Lord Srikrishna: పూర్వీకులు చెప్పిన విజయ రహస్యం... శ్రీకృష్ణుడి గురువులా మనము చేయాలి

శ్రీకృష్ణుడి గురువు సాందీప మహర్షి జీవితం నుంచి పట్టుదల, ఓపిక, సహనం అంటే ఏమిటో నేర్చుకోవచ్చు. విత్తనం నుంచి మహావృక్షం ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు ఎలా ఎదురొడ్డి నిలవాలో తెలుసుకోవచ్చు.

Balachander
Published on: 27 July 2026 7:45 AM IST
Lord Srikrishna: పూర్వీకులు చెప్పిన విజయ రహస్యం... శ్రీకృష్ణుడి గురువులా మనము చేయాలి
X

Lord Srikrishna: పట్టుదల, ఓపిక, సహనం ... ఈ మూడూ మానవ జీవితంలో అత్యున్నత విజయాన్ని, ఆధ్యాత్మిక సిద్ధిని అందించే దివ్య గుణాలు. మన పూర్వీకులైన మునులు, ఋషులు సుదీర్ఘకాలం పాటు ఓపికతో తపస్సు చేసి భగవద్దర్శనాన్ని పొందినట్లే, నేటి మానవుడు కూడా కోరికల చిట్టా పక్కనబెట్టి ఓపికతో దైవాన్ని ఆరాధిస్తే అపారమైన మానసిక శాంతిని, సఫలతను పొందవచ్చు.

సాందీప మహర్షి చూపిన మహోన్నత ఆదర్శం

శ్రీకృష్ణ భగవానుడు సమస్త వేదవిద్యలను ఆశాంతం అభ్యసించింది సాందీప మహర్షి ఆశ్రమంలోనే. విద్య పూర్తయిన తర్వాత గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమని కృష్ణుడు అడిగినప్పుడు సాందీపుడు ప్రవర్తించిన తీరు మనందరికీ గొప్ప మార్గదర్శకం. సాందీప మహర్షి ధనకనక వస్తువాహనాలు, రాజ్యాలు, భౌతిక సుఖభోగాలు ఏవీ కోరలేదు. ఒకేఒక ప్రధానమైన ఆకాంక్షను మాత్రమే వెలిబుచ్చారు. మరణించిన తన ఏకైక కుమారుడిని తిరిగి బతికించి ఇవ్వమని వేడుకున్నారు. విశ్వానికే ప్రభువైన కృష్ణుడు ఎదురుగా ఉన్నప్పటికీ, తన సొంత స్వార్థ భోగాల కోసం ఎలాంటి కోరికలు కోరక, కేవలం పితృవాత్సల్యాన్నే గురుదక్షిణగా కోరి తన వివేకాన్ని చాటుకున్నారు.

మూడు దశల ప్రతిబంధకాలు... విత్తనం నేర్పే జీవిత సత్యం

మానవ జీవిత ప్రయాణాన్ని ఒక విత్తనం వృక్షంగా మారే క్రమంతో పోల్చవచ్చు. విత్తనం వృక్షమయ్యే వరకు ఎదురయ్యే మూడు ముఖ్యమైన అడ్డంకులు ఏంటో తెలుసా... భూమిలో నాటిన విత్తనాన్ని చీమలు తినడానికి ప్రయత్నిస్తాయి. దీనినే విత్తన దశ అంటాం. రెండోది విత్తనం మొలకెత్తుతున్నప్పుడు పక్షలు దానిని తినడానికి ప్రయత్నిస్తాయి. ఇక మూడోది మొక్క చిన్నగా ఉన్నప్పుడు పశువులు వాటిని మేయడానికి వస్తాయి. ఈ మూడు దశల అడ్డంకులను ఓపికతో, పట్టుదలతో దాటుకుని ఆ విత్తనం మహా వృక్షంగా మారినప్పుడు.. అదే చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు నీడ కోసమే వస్తాయి. మన జీవితం కూడా అంతే. మనం వృక్షంలా స్థిరపడే వరకు సహనంతో వేచి ఉండాలి.

నిష్కామ సేవతోనే దైవానుగ్రహం

నేటి కాలంలో మానవుడు పూజలో కూర్చోగానే కోరికల చిట్టాను భగవంతుడి ముందు ఉంచుతున్నాడు. కానీ, భగవంతునికి సేవ చేయాలి తప్ప భౌతిక కోరికల కోసం మొండిగా మారంచేయకూడదు. మనం అనుభవించే కష్టసుఖాలు గత జన్మల కర్మఫలితాలు. దైవాన్ని ప్రార్థించేటప్పుడు ఆయన చరణ కమలాల వద్ద స్థానాన్ని మాత్రమే కోరుకోవాలి. మనస్సును లగ్నం చేసి ఓపికతో ధ్యానిస్తే, తాగే నీటి రుచిలో కూడా ఆ భగవంతుని దివ్యత్వాన్ని అనుభూతి చెందవచ్చు. పరమాత్మ పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో, ఓపికతో గడిపే ప్రతి క్షణం జీవితాన్ని ధన్యం చేస్తుంది. ఆనందమయం చేస్తుంది. విజయ తీరాలకు చేరుస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story