Krishna and Arjuna Devotion Story: శ్రీకృష్ణుడు రుక్మిణికి మాత్రమే చెప్పిన రహస్యం...అందుకే అర్జునుడిని విడిచిపెట్టలేదు

భగవంతుడు భక్త సులభుడు. మనం ఆయన్ని ప్రేమతో పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. మన కోరికలు తీరుస్తాడు.

Balachander
Published on: 17 April 2026 1:02 PM IST
Krishna and Arjuna Devotion Story
X

Krishna and Arjuna Devotion Story

Krishna and Arjuna Devotion Story: భగవంతుడు భక్త సులభుడు. మనం ఆయన్ని ప్రేమతో పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. మన కోరికలు తీరుస్తాడు. కానీ, నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఉండేవారి కోరికలు తీర్చడమే కాదు...వారిని ఒక్కక్షణం కూడా విడిచిపెట్టకుండా వారివెంటే ఉంటాడు. మహాభారతంలోని ఓ చిన్నికథే దీనికి ఉదాహరణ. శ్రీకృష్ణుడు అర్జునుడిని తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించడానికి గల కారణాన్ని తెలియజేసే ఈ అద్భుత గాథ మనలో భక్తిని తట్టిలేపుతుంది.

రుక్మిణి మనోవేదన

మహాభారత యుద్ధంలో గానీ, అంతకుముందు గానీ కన్నయ్య నిరంతరం అర్జునుడి వెంటే ఉండేవాడు. ఇది చూసిన రుక్మిణీదేవికి ఒక చిన్న సందేహం కలిగింది. భార్యగా తను, ఇతర గోపికలు ఆయనపై ఎంతో ప్రేమను కురిపిస్తుంటే, కృష్ణుడు మాత్రం ఎప్పుడూ అర్జునుడి గురించే ఎందుకు ఆలోచిస్తాడు? అని అనుమానం కలిగింది. పలు సందర్భాల్లో తన అనుమానాన్ని శ్రీకృష్ణుడి ముందు ఉంచినా చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్పకుండా ఉండేవాడు. అయితే, ఓసారి ద్వారకాలో ఓ ముఖ్యమైన కార్యక్రమం తలపెట్టారు. కార్యక్రమం ముగిసే వరకు శ్రీకృష్ణుడు ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని కోరుతుంది రుక్మిణీదేవి. సరేనని చెప్పిన శ్రీకృష్ణుడు సమయం దొరగ్గానే అంతఃపురం వదిలి అర్జునుడి వద్దకు వెళ్లిపోతాడు. విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి కృష్ణుడిని అనుసరించి ఆయనవెంట వెళ్తుంది.

కురుల నుంచి వినిపించిన నామస్మరణ

వేట నుంచి వచ్చి అలసిపోయి అర్జునుడు నిద్రిస్తుంటాడు. ఆయన పక్కనే ద్రౌపది కూర్చొని తల నిమురుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు ద్రౌపదిని పక్కకు జరిపి, స్వయంగా అర్జునుడి కేశాలను సవరిస్తూ పరవశించిపోతుంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన రుక్మిణీదేవి ఆశ్చర్యపోతుంది. ద్వారం వద్ద నిలబడి కోపంగా చూస్తున్న రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు నవ్వుతూ పిలిచి అర్జునుడి కేశాలను ఆమె చెక్కిళ్లకు తగిలేలా నిమురుతాడు. అర్జునుడి కేశాలు చెంపలకు తగలగానే రుక్మిణి ఆశ్చర్యపోతుంది. అర్జునుడి తలలోని ప్రతి కేశం నుంచి కృష్ణ...కృష్ణ.. అనే నామస్మరణ స్పష్టంగా వినిపిస్తుంది. అర్జునుడు నిద్రపోతున్నా...ఆయన అణువణువు శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూనే ఉంది. మనసులోనే కాకుండా శరీరంలోని అణువణువునా భగవంతుడిని నింపుకున్న పరమభక్తుడు అర్జునుడు.

భక్తికి లొంగే పరమాత్మ

మహాభారతంలోని ఈ చిన్ని కథలోని అంతరార్థం ఏమంటే..మన హృదయం నిండా భగవంతుడిని నింపుకుంటే... మనం ఎక్కడున్నా ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అర్జునుడి భక్తి ఎంతటిదంటే, ఆయన ప్రాణవాయువు కూడా కృష్ణ నామాన్నే పీలుస్తోంది. నా నామాన్ని నిరంతరం జపించే భక్తుడికి నేను దాసుడిని. వాడు నన్ను పిలవక్కర్లేదు, నేనే వాడిని వదిలి ఉండలేను అని రుక్మిణీదేవికి చెబుతాడు. మనలో కూడా అలాంటి అచంచలమైన భక్తి ఉంటే, ఆ దైవం మనకు కూడా మార్గదర్శిగా మారి, నిత్యం మన వెంటే ఉంటాడు. భక్తి ఉంటే భగవంతుడు మనతో ఆడతాడు, పాడతాడు, అవసరమైతే మన కోసం సారథిగా మారి మన జీవిత రథాన్ని ముందుకు నడిపిస్తాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story