Jagannathagattu: కర్నూలు జిల్లాలో మహాభారత కాలంనాటి ఆలయం... ఇక్కడ నిమ్మచెట్టే మహాశివుడు

పాండవులు ప్రతిష్టించిన శివలింగం కర్నూలు జిల్లా జగన్నాథ గట్టు కొండపై అత్యంత వైభవంగా పూజలు అందుకుంటోంది. నేటికీ భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Balachander
Published on: 15 July 2026 9:29 AM IST
Jagannathagattu: కర్నూలు జిల్లాలో మహాభారత కాలంనాటి ఆలయం... ఇక్కడ నిమ్మచెట్టే మహాశివుడు
X

Jagannathagattu: ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం చేసిన కాలం నాటి ఆనవాళ్లు ఇప్పటికీ భరతభూమిపై సజీవంగా దర్శనమిస్తూనే ఉన్నాయి. అందులోనూ సప్త నదుల సంగమ క్షేత్రమైన కర్నూలు జిల్లాకు ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ముక్కంటి ఆరాధన కోసం సాక్షాత్తూ పాండవ మధ్యముడైన భీమసేనుడు కాశీ నుంచి మోసుకొచ్చిన శివలింగం.. ముహూర్త సమయానికి ముందే ధర్మరాజు నిమ్మచెట్టు మొద్దుతో ప్రాణం పోసిన మరొక లింగం.. ఈ రెండు పవిత్ర రూపాలు ఒకే చోట కొలువుదీరిన అద్భుత పుణ్యక్షేత్రమే కర్నూలు నగర శివార్లలోని "జగన్నాథగట్టు". 1100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పురాతన ఆలయం వెనుక ఉన్న రహస్యాలు, కాల గమనంలో ఇది నది గర్భం నుంచి కొండపైకి చేరిన వైనం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.

మారిన సంగమేశ్వరం... జగన్నాథ గట్టుకు చేరిన వైనం

నిజానికి ఈ ఆలయం మొదట ఇక్కడ లేదు. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని సప్త నదులైన కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమరథి, మలాపహారిణి, భవనాశి వంటి పవిత్ర సంగమ ప్రాంతమైన సంగమేశ్వరంలో ఈ రూపాల సంగమేశ్వరస్వామి ఆలయం ఉండేది. చాలక్యులు, రాష్ట్రకూట రాజుల కాలంలో శిల్పకళా వైభవంతో నిర్మితమైన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే, 1980వ దశకంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా సంగమేశ్వర క్షేత్రం నీట మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మన పూర్వీకుల శిల్పకళా సంపదను కాపాడేందుకు, ఈ పురాతన ఆలయ రాళ్లను, స్తంభాలను యథాతథంగా విడదీసి.. కర్నూలు సమీపంలోని బి. తాండ్రపాడు వద్ద ఉన్న జగన్నాథగట్టు కొండపైకి తరలించి అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రతిష్ఠించారు. అలా సంగమేశ్వరం నాటి రూపాల సంగమేశ్వరుడు, నేడు జగన్నాథగట్టుపై భక్తుల పూజలందుకుంటున్నాడు.

నిమ్మచెట్టే పరమశివుడైన వేళ.. పురాణ గాథ!

పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ నదీ సంగమ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, అక్కడ ఒక పవిత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ధర్మరాజు భావించాడు. ఇందుకోసం కాశీ క్షేత్రం నుండి ఒక శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా బలశాలి అయిన భీముడిని పురమాయించాడు. భీముడు కాశీకి వెళ్లి లింగంతో తిరిగి వచ్చేసరికి మునులు నిర్ణయించిన పవిత్ర ముహూర్త సమయం దాటిపోసాగింది. దీంతో కంగారుపడిన ధర్మరాజు, అక్కడ ఉన్న ఒక నిమ్మచెట్టు మొద్దుకు శివలింగ ఆకృతిని కల్పించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత కాశీ నుంచి ఆలస్యంగా వచ్చిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాడు. భీముడు తెచ్చిన ఆ శివలింగమే 6 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పుతో గ్రానైట్ రాతితో చెక్కినట్లుగా భీమసేనుడి భారీ కాయానికి ప్రతీకగా నిలుస్తుంది.

భక్తులను ఆకట్టుకుంటున్న సంగమేశ్వరుడు...

కొండపైకి వెళ్లే దారిలో భారీ బసవేశ్వరుడు, ఆలయ ప్రాంగణంలో ఆదిశేషుని సుందర విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. నటరాజ మూర్తులు ఆనంద తాండవం చేస్తున్న శిల్ప కళా రీతులు ఈ ఆలయ గోపురాలపై అద్భుతంగా చెక్కబడ్డాయి. ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్న 50 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఈ కొండపై నుండి చూస్తే కర్నూలు నగరం మొత్తం అత్యంత సుందరంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, శివరాత్రి పర్వదినాన ఈ జగన్నాథ గిరి హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో మార్మోగిపోతుంది. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలతో పాటు గ్రహదోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story