2026 లాభ పంచమి నవంబర్ 14న వచ్చింది. లక్ష్మీ గణేశ పూజా ముహూర్తాలు, పూజా విధానం, వ్యాపార అభివృద్ధి కోసం పాటించాల్సిన సంప్రదాయాలు

2026 లాభ పంచమి నవంబర్ 14న వచ్చింది. లక్ష్మీ గణేశ పూజా ముహూర్తాలు, పూజా విధానం, వ్యాపార అభివృద్ధి కోసం పాటించాల్సిన సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.

Rudrachander
Published on: 13 Nov 2026 9:40 AM IST
2026 లాభ పంచమి నవంబర్ 14న వచ్చింది. లక్ష్మీ గణేశ పూజా ముహూర్తాలు, పూజా విధానం, వ్యాపార అభివృద్ధి కోసం పాటించాల్సిన సంప్రదాయాలు
X

Labh Panchami 2026: హిందూ సంప్రదాయంలో దీపావళి తర్వాత వచ్చే పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి పర్వదినాల్లో లాభ పంచమి ఒకటి. ఈ పండుగను ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, వ్యాపార అభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాయి. ఈ రోజున గణేశుడిని, లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, ఖాతా పుస్తకాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. లాభ పంచమిని లాభ్ పంచం, సౌభాగ్య పంచమి, లఖానీ పంచమి అని కూడా పిలుస్తారు. జైన సమాజంలో ఇదే రోజును జ్ఞాన పంచమిగా జరుపుకుంటారు. మరి 2026లో లాభ పంచమి ఎప్పుడు వచ్చింది? పూజకు శుభ ముహూర్తాలు ఏమిటి? ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

2026లో లాభ పంచమి ఎప్పుడు?

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి రోజున లాభ పంచమిని జరుపుకుంటారు. 2026లో నవంబర్ 14, శనివారం ఈ పండుగ వచ్చింది. ఉదయ తిథి ప్రకారం అదే రోజు పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పంచమి తిథి నవంబర్‌ 13 రాత్రి 8.42 గంటలకు ప్రారంభం అవుతుంది. ముగింపు నవంబర్‌ 14వ తేదీ రాత్రి 11.23 గంటలకు ఉంటుంది. అయితే, లక్ష్మీ గణేశ పూజలకు ఉదయం 6.43 గంటల నుంచి ఉదయం 10.18 గంటల వరకు ముహూర్తం ఉన్నది.

లాభ పంచమిని ఎందుకు జరుపుకుంటారు?

‘లాభం’ అంటే సంపాదన, పురోగతి అని అర్థం. దీపావళి వేడుకల అనంతరం కొత్త పనులు, వ్యాపారాలను ప్రారంభించడానికి ఈ రోజును శుభప్రదంగా భావిస్తారు. గణేశుడిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, సంపద, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల్లో అభివృద్ధి సాధించాలని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు.

లాభ పంచమి ప్రత్యేకతలు

దీపావళి సమయంలో వ్యాపార సంస్థలకు సెలవులు ప్రకటించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అనంతరం లాభ పంచమి రోజున దుకాణాలు, కార్యాలయాలను తిరిగి ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఈ రోజున చేసే ముఖ్యమైన ఆచారాల్లో చోప్రా పూజ ఒకటి. కొత్త ఖాతా పుస్తకాలపై ‘శుభ్’, ‘లాభ్’ అని రాసి గణేశుడు, లక్ష్మీదేవి ముందు ఉంచి పూజిస్తారు. సంపద, ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని, ఆటంకాలు తొలగించి విజయాన్ని ప్రసాదించాలని గణేశుడిని ప్రార్థిస్తారు. జైన సమాజంలో ఈ రోజును జ్ఞాన పంచమిగా జరుపుకుంటారు. ధార్మిక గ్రంథాలు, శాస్త్రాలను పూజించి జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తారు.

లాభ పంచమి రోజు పూజా విధానం

ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి గణేశుడు, లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించాలి. పూలు, పసుపు, కుంకుమ, అక్షతలు, పండ్లు, మిఠాయిలు సమర్పించి దీపారాధన చేయాలి. అనంతరం లక్ష్మీదేవి, గణేశుడికి సంబంధించిన మంత్రాలను పఠిస్తూ హారతి ఇవ్వాలి. వ్యాపారవేత్తలు తమ దుకాణాలు, కార్యాలయాల్లో ఖాతా పుస్తకాలు, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలను ఉంచి పూజించాలి. కొత్త పనులు విజయవంతం కావాలని ప్రార్థించాలి. ఇలా భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ఏడాదంతా సుఖసంతోషాలు, వ్యాపారాభివృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు