Lakshmi Devi: ఇంట్లో లక్ష్మీదేవి లేకున్నా...ఇలా ఉంటే చాలు...దరిద్రదేవత అడుగుకూడా పెట్టలేదు
ఇంట్లో ధనం లేకపోయినా లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసా? కుటుంబ ఐకమత్యం, ప్రేమ, సహనం దరిద్రాన్ని ఎలా దూరం చేస్తాయో తెలుసుకుందాం.
Lakshmi Devi: మానవ జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు భయపడి ఆత్మాభిమానాన్ని చంపుకుని పరుల వద్ద చేయి చాచకుండా, కుటుంబంలో ప్రేమాభిమానాలు, ఐకమత్యంతో మెలిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి అభయముతో పాటు దరిద్ర దేవత సైతం అడుగుపెట్టలేని దివ్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆకలితో అలమటించినా పులి గడ్డి మేయనట్లే, మనిషి కూడా ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఇంట్లో సిరిసంపదలు లేకపోయినా సభ్యుల మధ్య ఉన్న ఐక్యతే నిజమైన ఐశ్వర్యమని, అది దరిద్ర దేవిని ఎలా తరిమికొడుతుందో ఒక అంతరార్థంతో కూడిన ఆధ్యాత్మిక కథ ద్వారా తెలుసుకుందాం.
లక్ష్మీదేవి నిష్క్రమణ ... భక్తుని వరయాచన
ఒక నిరుపేద సాధకుడిపై లక్ష్మీదేవికి కోపం వచ్చి, ఆయన గృహాన్ని విడిచిపెట్టి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అయితే, తాను వెళ్తున్నందున జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుందని, వెళ్లేముందు ఒక వరం కోరుకోమని లక్ష్మీదేవి చెప్తుంది. దరిద్రం వచ్చినా తమ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఐకమత్యం, ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమానురాగాలు ఎప్పటికీ తగ్గకూడదని ఆ గృహస్థుడు వరం కోరతాడు. లక్ష్మీదేవి ఆ వరాన్ని ప్రసాదించి వెళ్లిపోతుంది.
దరిద్ర దేవత ప్రవేశం ... ఉప్పుకారం పరీక్ష
లక్ష్మీదేవి వెళ్లగానే ఇంట్లోకి ప్రవేశించిన దరిద్ర దేవత, ఆ కుటుంబంలో కలహాలు రేపడానికి ఒక సందర్భాన్ని సృష్టిస్తుంది. అత్తగారు గుడికి వెళ్తూ కూరలో ఉప్పుకారం వేయమని చెప్పగా, సమయ వేళల తేడాతో చిన్నకోడలు, పెద్దకోడలు, చివరగా అత్తగారు ముగ్గురూ వేర్వేరుగా ఉప్పు, కారం వేస్తారు. అయితే, మధ్యాహ్నం భోజనానికి వచ్చిన గృహ యజమాని కూరలో ఉప్పు తీవ్రంగా ఎక్కువైందని గ్రహిస్తాడు. అయితే కుటుంబంలో అశాంతి కలగకూడదని, కోడళ్లను నిందించకుండా మౌనంగా భోజనం ముగిస్తాడు. తండ్రి మౌనాన్ని చూసిన పెద్ద కొడుకు, ఆపై మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఆ ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇంటి యజమాని కోపం లేకుండా శాంతంగా ఉంటే, కుటుంబంలో కలహాలు రావని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
ఐకమత్యం ముందు ఓడిన జ్యేష్ఠాదేవి
చిన్న పొరపాటును పట్టుకుని రభస జరుగుతుందని ఆశించిన దరిద్ర దేవతకు ఆ ఇంట్లో ఆశాభంగం ఎదురవుతుంది. ప్రశాంతత, సహనం ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఉన్న చోట తాను క్షణం కూడా నిలబడలేనని గ్రహించి దరిద్ర దేవత ఆ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోతుంది. జ్యేష్ఠాదేవి వెళ్లిన మరుక్షణమే లక్ష్మీదేవి ఆ ఇంటికి తిరిగి వస్తుంది. ధనం, సంపదలో సుఖం ఉండదని, నిజమైన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అదే నిజమైన సంపదని ఈ అంశం మనకు తెలుయజేస్తుంది.
ఈ పవిత్ర కథ మానవాళికి మూడు ప్రధాన సూత్రాలను అందిస్తోంది. ఒకటి స్వయంకృషితో జీవించాలి తప్ప చీటికి మాటికి పరుల వద్ద చేయి చాచకూడదు. ఆత్మాభిమానం లేని చోట లక్ష్మీదేవి నిలవదు. రెండోది కుటుంబంలో చిన్న చిన్న లోపాలు ఎదురైనప్పుడు సహనంతో వ్యవహరిస్తే ఎలాంటి వివాదాలు దరిచేరవు. ఇక మూడోది కోపతాపాలు, కలహాలు ఉన్న చోట దరిద్రం తాండవిస్తుంది; శాంతి, అనురాగం ఉన్న ఇల్లే నిజమైన లక్ష్మీ నిలయం. పరిస్థితులు అనుకూలించనప్పుడు అధైర్యపడకుండా, ఐకమత్యంతో సాగే గృహంలో దరిద్ర దేవి అడుగుపెట్టలేదనడానికి ఈ కథే నిదర్శనం.




