Lakshmi Kubera Temple: ధనాకర్ష లక్ష్మీకుబేర ఆలయం... ఇక్కడి చిల్లి కాణితో కనకవర్షం

తమిళనాడులోని లక్ష్మీకుబేర ఆలయం అత్యంత అరుదైన ఆలయం మాత్రమే కాదు...ఇక్కడ ఇచ్చే చిల్లికాణి ధనాన్ని ఆకర్షిస్తుందని పండితులు చెబుతున్నారు.

Balachander
Published on: 28 Aug 2026 8:44 AM IST
Lakshmi Kubera Temple: ధనాకర్ష లక్ష్మీకుబేర ఆలయం... ఇక్కడి చిల్లి కాణితో కనకవర్షం
X

Lakshmi Kubera Temple: హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం అంటేనే సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవికి పవిత్రమైన కాలం. అయితే ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవితో పాటు, ఆ సంపదలను భక్తులకు పంచిపెట్టే అధిదేవత కుబేరుడు. ఈ ఇద్దరి దివ్య అనుగ్రహం ఒక్కటే క్షేత్రంలో లభించే అరుదైన పుణ్యధామమే తమిళనాడులోని రత్నమంగళం శ్రీ లక్ష్మీ కుబేర ఆలయం. ఇక్కడ లభించే 'చిల్లి కాణి' ని కుబేరుని విగ్రహానికి తాకించి ఇంట్లో దాచుకుంటే ధనాకర్షణ కలిగి కనకవర్షం కురుస్తుందని భక్తుల బలమైన విశ్వాసం.

కుబేరుని పౌరాణిక గాథ ... నవనిధుల ప్రాప్తి

విశ్వావసు మహర్షి, దేవమిని దంపతుల కుమారుడైన వైశ్రవణుడు బ్రహ్మదేవుని గురించి తీవ్రమైన తపస్సు చేసి ఉత్తర దిక్కుకు దిక్పాలకుడిగా, 'పుష్పక విమాన' అధిపతిగా వరం పొందాడు. అనంతరం పరమశివుని దివ్య కృప కోసం తపస్సు చేయగా, ప్రత్యక్షమైన పార్వతీదేవి తేజస్సును చూడలేక ఒక కన్ను మూశాడు. దానిని అపార్థం చేసుకున్న అమ్మవారు కుబేరుని చూపును హరించగా, పరమేశ్వరుడు నిజం తెలిపి చూపును పునరుద్ధరించాడు. అంతేకాకుండా, కుబేరునికి అష్టైశ్వర్యాలను పరిపాలించే నవ నిధులను (కల్పవృక్షం, కామధేనువు, శంఖం, మత్స్యం, కూర్మం, వజ్ర వైడూర్యాలు, పాలు, పద్మం, గోవు) శివుడు కానుకగా ప్రసాదించాడు.

ఆలయ విలక్షణత ... 16 తిథులు, 16 గణపతులు

చెంగల్పట్టు జిల్లా వందలూరు సమీపంలోని రత్నమంగళంలో వెలసిన ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక విశేషాలు మనకు దర్శనమిస్తాయి. ఇందులో ఒకటి షోడశ గణపతులు. నెలలోని 14 తిథులు, పౌర్ణమి, అమావాస్యలతో కలిపి మొత్తం 16 తిథులకు అధిదేవతలుగా 16 విభిన్న రూపాల్లో ఉన్న విఘ్నేశ్వరులను ఇక్కడ దర్శించుకోవచ్చు. ఏ తిథిలో జన్మించినవారు ఆ గణపతిని పూజిస్తే సకల విఘ్నాలు తొలగుతాయి. అంతేకాదు, సాధారణ ఆలయాల్లోలా కాకుండా ఇక్కడ నవగ్రహాలు తమ ధర్మపత్నులతో సహా కొలువై ఉండటం విశేషం. ఇక్కడ కలియుగంలో పద్మావతి దేవి పరిణయానికై కుబేరుని వద్ద 1,40,00,000 బంగారు నాణేలు అప్పుగా తీసుకున్న వేంకటేశ్వరస్వామి, స్వర్ణాకర్షణ భైరవుడు, బ్రహ్మ-సరస్వతులు కూడా ఇక్కడ దర్శనమిస్తారు.

గర్భాలయం ... చిల్లి కాణి మహిమ

గర్భగుడిలో స్వామివారు తన భార్య చిత్రలేఖ సమేతుడై, లక్ష్మీదేవితో కలిసి వెండి కిరీటాలు, కరెన్సీ నోట్ల హారాలతో దర్శనమిస్తారు. కుబేరునికి ఆకుపచ్చ రంగంటే ఎంతో ప్రీతి కావున, ఇక్కడ పూజారులు ఇచ్చే కుంకుమ, ప్రసాద రక్షణలు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఇక్కడ లభించే రాగి చిల్లి కాణీకి ఎర్రటి దారాన్ని కట్టి, స్వామివారి బొజ్జకు తాకించి, మన ఎడమచేతిలో ఉంచుకుని పూజించిన అనంతరం ఇంట్లోని బీరువా లేదా ధన స్థానంలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.

తమిళనాడులోని చెన్నై లేదా చెంగల్పట్టు నుంచి వందలూరుకు చేరుకుని, అక్కడి నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్నమంగళం లక్ష్మీ కుబేర క్షేత్రాన్ని సులభంగా దర్శించుకోవచ్చు. శ్రావణ మాసపు పవిత్ర శుక్రవారాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story