Lessons from Ravana: రావణుడి నుంచి ఈనాటి యువత ఏం నేర్చుకోవాలి...పూర్వీకులు మెచ్చిన నీతి

రావణుడు గొప్ప మేధావి, పండితుడు అయినప్పటికీ ఆయనలోని కొన్ని చెడు లక్షణాలే ఆయన్ను పతనం అంచుకు నెట్టాయి. అవేంటో తెలుసుకుందాం.

Balachander
Published on: 13 Jun 2026 8:51 AM IST
Lessons from Ravana: రావణుడి నుంచి ఈనాటి యువత ఏం నేర్చుకోవాలి...పూర్వీకులు మెచ్చిన నీతి
X

Lessons from Ravana: రావణుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది లంకాధీశుడు, రాక్షస రాజు మాత్రమే. కానీ, ఆయన అపారమైన జ్ఞానం కలిగినవాడు. వేదపండితుడు. గొప్ప పరిపాలకుడు కూడా ఉన్నాడు. పది తలలు కలిగిన అపర మేధావి. మనకు ఎన్ని గొప్ప గుణాలున్నా అవసరమైనపుడు లొంగిపోని అహంకారం, విచక్షణను కోల్పోవడం వంటి వాటి వలనే పతనం అవుతారు. అందుకే మన పూర్వీకులు రావణుడి జీవితాన్ని ఒక హెచ్చరికగా మనకు అందించారు. నేటి ఆధునిక యువత, ముఖ్యంగా కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే వారు, రావణుడి జీవితం నుండి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన 5 సూత్రాలు గురించి మనకు తెలియజేస్తున్నారు.

విజ్ఞానానికి వినయం తోడవ్వాలి

రావణుడు 4 వేదాలు, 6 ఉపనిషత్తులను క్షుణ్ణంగా చదివిన మహా పండితుడు. సరస్వతీ దేవి అనుగ్రహంతో అద్భుతంగా వీణ వాయించగల కళాకారుడు. అయితే, ఈ విజ్ఞానమంతా అతనిలో వినయానికి బదులు 'అహంకారాన్ని' పెంచింది. నేటి యువత ఎంతటి ఉన్నత చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు సాధించినా, జీవితంలో ఎదగడానికి 'వినయం' అనే గుణమే ప్రధాన ఆధారం అని గుర్తుంచుకోవాలి. వినయం లేని విద్య నిరుపయోగం.

ఒక్క తప్పు... 100 పుణ్యాలను బూడిద చేస్తుంది

రావణుడు కోట్లాది సంవత్సరాలు తపస్సు చేసి శివుడి నుండి అపారమైన శక్తులను, వరాలను పొందాడు. కానీ, పరస్త్రీ వ్యామోహంతో సీతమ్మను అపహరించి, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించాడు. ఆ ఒక్క చిన్న తప్పు అతడు జీవితకాలంలో సంపాదించిన పుణ్యాన్నంతటినీ నిలువునా దహించివేసింది. నైతిక విలువలు తప్పితే ఎంతటి సామ్రాజ్యమైనా కూకటివేళ్లతో పడిపోతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ రెండువేల సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగిన సంగతి తెలిసిందే.

హితవు పలికే ‘విభీషణుల’ను దూరం చేసుకోకండి

లంకపై యుద్ధం వచ్చే ముందు రావణుడి తమ్ముడు విభీషణుడు, భార్య మండోదరి ఎంతో హితవు పలికారు. తప్పును సరిదిద్దుకోమని మంచి సలహాలు ఇచ్చారు. కానీ, రావణుడు వారిని అవహేళన చేసి వెళ్లగొట్టాడు. మన తప్పులను ఎత్తిచూపి, మంచి మార్గం చెప్పే స్నేహితులను, పెద్దలను ఎప్పుడూ మనం దూరం చేసుకోకూడదు.

తన కోపమే తన శత్రువు

రావణుడి పతనానికి మరో ముఖ్య కారణం అతని మితిమీరిన క్రోధం. కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్లే అతడు లంకను శ్మశానంగా మార్చుకున్నాడు. రాముడు సముద్రాన్ని దాటి రావడం వెనుక రావణుడి ఆవేశమే కారణమైంది. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి వల్ల వచ్చే కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే, చేజేతులా కెరీర్‌ను పాడుచేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునే సమయంలో శాంతం వహించాలి.

శక్తిని సన్మార్గంలో ఉపయోగించాలి

భౌతిక బలం, అధికార బలం ఉన్నప్పుడు మనిషి మరింత బాధ్యతగా నడుచుకోవాలి. రావణుడు తన బలంతో లోకాలను పీడించాడు. అదే బలాన్ని లోకకల్యాణానికి ఉపయోగించి ఉంటే, ఈరోజు రావణుడిని కూడా ఒక దేవుడిగా పూజించేవారు. మనలో ఉన్న ప్రతిభను సమాజ శ్రేయస్సుకు, నలుగురి మేలుకు ఉపయోగించినప్పుడే ఆ జీవితానికి సార్థకత లభిస్తుంది. ప్రపంచం ఈరోజు గుర్తుపెట్టుకున్న గొప్ప గొప్పవారంతా చేసింది ఇదే.

చరిత్ర కేవలం కథలను చదవడానికి కాదు, మనల్ని మనం దిద్దుకోవడానికి. రావణుడి లాంటి మహాపండితుడే అహంకారం వల్ల మట్టిలో కలిసిపోయాడంటే, సామాన్యులమైన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించాలి. యువత ఈ నైతిక పాఠాలను గ్రహించి, విజ్ఞానంతో పాటు విలువులను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సమానంగా ఎదుర్కొంటారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story