Lord Krishna: పిల్లవాడికోసం కదిలొచ్చిన కన్నయ్య...ఇలా మీరు పిలిచి చూడండి

భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం ఉంటే ఆయన భక్తుని కోసం ఎలా కదిలివస్తాడో తెలియజేసే గోపి-గోపాలుడి హృద్యమైన కథ.

Balachander
Published on: 16 Jun 2026 9:31 AM IST
Lord Krishna: పిల్లవాడికోసం కదిలొచ్చిన కన్నయ్య...ఇలా మీరు పిలిచి చూడండి
X

Lord Krishna: భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొండంత జ్ఞానం అక్కర్లేదు, గుండె నిండా ‘నిష్కల్మషమైన నమ్మకం’ ఉంటే చాలు. శరణాగతి అనే ఆ ఒక్క మాటలోనే దైవాన్ని లొంగతీసుకునే శక్తి ఉంది. రామాయణంలో గురువు మాటపై నమ్మకంతో శబరి దశాబ్దాల కాలం వేచి చూసి రాముడి అనుగ్రహం పొందితే, ద్వాపర యుగంలో ద్రౌపది సర్వస్వం కోల్పోయిన వేళ ‘కృష్ణా’ అని పిలిచి అక్షయ వస్త్రాలను పొందింది. భగవంతుడు కేవలం పురాణ కాలానికే పరిమితం కాదు, కలియుగంలోనూ అమాయకపు పిలుపునకు అర్ధరాత్రి అయినా అలికిడి చేస్తాడని నిరూపించే ఒక మధురమైన గాథ ఇది. ఈ కథ వింటే ప్రతిఒక్కరికీ ఆ భగవంతుడిపై నమ్మకం కలుగుతుంది.


భయాన్ని పోగొట్టిన ఆ ‘ఒక్క’ పిలుపు

అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ‘గోపి’ అనే ఒక తండ్రి లేని పేద బాలుడు ఉండేవాడు. తల్లి కూలి పనులు చేస్తూ, రోజుకు ఒక పూట చొప్పున పెరుగన్నం పెడుతూ వాడిని చదివిస్తోంది. అయితే, గోపి చదువుకునే పాఠశాలకు వెళ్ళాలంటే దారిలో ఒక భయంకరమైన, నిశ్శబ్దమైన ‘చింతతోపు’ దాటాలి. తోటి పిల్లలంతా వాళ్ళ తండ్రులతో వెళ్తుంటే, తను ఒంటరిగా వెళ్ళడానికి భయపడి తల్లిని అడిగాడు. అప్పుడు ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా, గుండె నిబ్బరంతో ఒక అద్భుతమైన మార్గం చెప్పింది. నీకు తోడుగా రావడానికి తల్లికి సమయం లేదు. నీకు గోపి అని పేరుపెట్టాను కదా. ఆ తోపు దగ్గరికి రాగానే గోపాలా అని పిలువు. నీకు తోడుగా కన్నయ్య వస్తాడు అని చెబుతుంది. తల్లిచెప్పింది నిజమో కాదో ఆ చిన్నారికి తెలియదు. కానీ, అమ్మనే వేదవాక్కుగా భావించి మరుసటిరోజు బడికి వెళ్లే మార్గంలో తోపు దగ్గరకు రాగానే అన్నా గోపాలా అని పిలుస్తాడు. ఆ పిలుపు బాలుడి హృదయాంతరాళంలో నుంచి వస్తుంది. అంతే... వెంటనే ఆ జగన్నాథుడు ఓ చిన్న యాదవ బాలుడి రూపంలో వచ్చి గోపి చేయిపట్టుకొని తోపు దాటిస్తాడు. ఆరోజు నుంచి తోపు దగ్గరకు రాగానే అన్నా అని పిలవడం గోపాలుడు తోడుగా రావడం అలవాటుగా మారిపోయింది.

ముంతెడు పెరుగు... అక్షయ పాత్రగా మారిన వేళ

కొంతకాలానికి ఆ ఊరి ఉపాధ్యాయుడి కుమార్తె వివాహం నిశ్చయమైంది. ఊరిలోని ధనికుల పిల్లలంతా 10 రకాల ఖరీదైన బహుమతులు పట్టుకువెళ్లారు. కానీ పేదవాడైన గోపికి వాళ్ళ అమ్మ ఒక చిన్న మట్టి ముంతలో పెరుగు ఇచ్చి పంపింది. పిల్లలు హేళన చేస్తారేమోనని భయపడుతున్న గోపిని చూసి, దారిలో గోపాలుడు నవ్వి, భుజం తట్టి ధైర్యంగా వెళ్ళమన్నాడు. పెళ్లి వేడుకలో గోపి ఆ చిన్న ముంతను గురువుగారికి ఇచ్చాడు. భోజనాల సమయంలో గురువుగారు ఆ ముంతలోని పెరుగును వడ్డించడం ప్రారంభించారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. పదిమందికి వడ్డించినా ఆ చిన్న ముంతలో పెరుగు అయిపోలేదు. ఎంత మంది తిన్నా అది ఖాళీ అవ్వలేదు. పైగా ఆ పెరుగు రుచి అమృతాన్ని తలపించింది.

అసలైన ఆధ్యాత్మిక సత్యం

ఆశ్చర్యపోయిన గురువుగారు గోపిని నిలదీయగా, చింతతోపులో తన అన్న గోపాలుడు ఇచ్చిన మహిమ ఇదని చెప్పాడు. కొందరు హేళనగా ఏదీ ఇప్పుడు పిలువు వస్తాడేమో చూద్దామని అంటారు. అప్పుడు గురువుగారు కళ్ళవెంట నీళ్లు పెట్టుకుంటూ,మన కళ్లకు కనపడనిది, ఆ కృష్ణుడు వండించిన ఈ అక్షయ పెరుగు రూపంలో కనిపిస్తోంది కదా! నమ్మకానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అంటాడు. ఆ రోజు నుంచి ఊరి వారంతా గోపిని భగవత్ స్వరూపంగా చూడటం మొదలుపెట్టారు. భగవంతుడికి కావాల్సింది మన దగ్గర ఉన్న ఐశ్వర్యం కాదు, మన మనసులోని నిష్కల్మషమైన ప్రేమ. ఈ రోజు నుంచే కష్టాల్లో ఆ కన్నయ్యను గుండెల నిండా నమ్మి పిలిచి చూడండి, ఆయన కదిలి రాక మానడు!

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story