Lucky Mole Signs: హస్తసాముద్రిక శాస్త్రం చెప్పినట్టుగా ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉందా... రాజయోగమే
శరీరంపై కొన్ని స్థానాల్లో పుట్టు మచ్చలు ఉండటం అదృష్టమని చెబుతారు. మరి ఆయా స్థానాలు ఏమిటో... ఉంటే ఏమౌతుందో తెలుసుకుందాం.
Lucky Mole Signs: సనాతన హిందూ సంప్రదాయంలో సాముద్రిక శాస్త్రానికి ఎంతో ప్రాచీనమైన, పవిత్రమైన స్థానం ఉంది. మనిషి శరీర నిర్మాణం, చేతి రేఖలు, శరీర భాగాలపై ఉండే సహజమైన గుర్తులు, పుట్టుమచ్చల ఆధారంగా వారి స్వభావం, అదృష్టం, భవిష్యత్తును మహర్షులు వివరించారు. ముఖ్యంగా శరీరంపై ఉన్న కొన్ని విశిష్ట స్థానాల్లోని పుట్టుమచ్చలు వ్యక్తికి రాజయోగాన్ని, కీర్తిప్రతిష్టలను, సంపదను ప్రసాదిస్తాయని సాముద్రిక శాస్త్రం ఘోషిస్తోంది. అటువంటి 5 విశేష స్థానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాజయోగాన్ని ఇచ్చే దివ్యమైన స్థానాలు
శరీరంపై ఉన్న వివిధ మచ్చల్లో ప్రత్యేకించి 5 ప్రదేశాలలో ఉండే పుట్టుమచ్చలు అత్యంత అదృష్టవంతమైనవిగా పరిగణించబడతాయి. పురుషుడికి కుడి అరచేతిలోని శుక్ర స్థానంలో అంటే బొటనవేలు కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే లక్ష్మీకటాక్షం లభిస్తుంది. వీరు స్వయంకృషితో ఉన్నత పదవులను అధిరోహించి, సమాజంలో గొప్ప శ్రేయస్సును, ఆస్తిపాస్తులను గడిస్తారు. అంతేకాదు, అరికాళ్లపై పుట్టుమచ్చలు ఉన్నవారు నిరంతరం ప్రయాణాలు చేస్తారు. వీరికి విదేశీ యాన యోగం, సుదూర ప్రాంతాలలో అద్భుతమైన గుర్తింపు లభిస్తాయి. ఇక నొసటి మధ్యభాగంలో పుట్టుమచ్చ ఉంటే అది నాయకత్వ లక్షణాలకు, సుపరిపాలనకు సంకేతం. వీరు రాజకీయాల్లో, రాజకీయేతర అధికార హోదాల్లో రాణిస్తారు. సమాజంలో వేలాదిమందికి మార్గదర్శకులుగా మారి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మెడ భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారికి జీవితంలో అన్నవస్త్రాలకు, సౌఖ్యానికి ఎన్నటికీ కొరత ఉండదు. వీరు మధుర సంభాషణతో, సౌమ్య స్వభావంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఎల్లప్పుడూ బంధుమిత్రుల ఆదరాభిమానాలు వీరికి పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా నాభి సమీపంలో పుట్టుమచ్చ ఉన్నవారు భౌతిక సుఖాలను అనుభవిస్తారు. గృహంలో సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, నిత్య ఆనందం నెలకుంటాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని పట్టుదల వీరి సొంతమని హస్తసాముద్రిక శాస్త్రం చెబుతోంది.
భక్తి, దైవానుగ్రహమే మూలం
సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంపై ఉండే ఈ శుభ గుర్తులు పూర్వజన్మ సుకృతానికి, దైవానుగ్రహానికి నిదర్శనాలు. అయితే కేవలం గుర్తులపైనే ఆధారపడకుండా, పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ భగవంతుని యందు నిశ్చలమైన భక్తిని కలిగి ఉన్నప్పుడు ఈ అదృష్ట యోగాలు పరిపూర్ణంగా ఫలిస్తాయి. నిత్యం దైవనామస్మరణ చేస్తూ... వీలైనప్పుడల్లా ఆలయాలను సందర్శిస్తూ భక్తితో ఉండటంతో పాటు పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తే... ఈ మచ్చలు దైవత్వంగా మారతాయి. అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా చేస్తాయని పండితులు చెబుతున్నారు.




