Mahabharata Life Lessons: ప్రతి ఇంట్లో మహాభారతంలోని ఓ పాత్ర తప్పకుండా ఉంటుంది
మహాభారతంలోని ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కర్ణుడు, దుర్యోధనుడు, శకుని వంటి పాత్రలు నేటి కుటుంబ జీవితానికి ఎలా అన్వయిస్తాయి? వారి పాత్రల వెనుక దాగిన జీవిత సత్యాలు, ధర్మబోధలు ఏమిటో తెలుసుకుందాం.
Mahabharata Life Lessons: మహాభారతం అనగానే మనకు 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం, వేలాది రథాలు, శంఖనాదాలు గుర్తొస్తాయి. కానీ నిశితంగా గమనిస్తే... మహాభారతంలోని ప్రతీ పాత్ర నేటి సమాజంలో, అంతెందుకు మన కళ్ల ముందే మన సొంత కుటుంబాల్లో జీవిస్తూనే ఉంది. వ్యాస భగవానుడు ఆనాడే మానవ నైజాలను, బలహీనతలను గ్రంథస్థం చేశాడు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్నా, సంసారాన్ని చక్కదిద్దుకోవాలన్నా మహాభారతంలోని లోప భూయిష్టమైన పాత్రల వెనుక ఉన్న హెచ్చరికలను మనం తప్పక గ్రహించాలి. నేటి ఆధునిక కాలానికి అన్వయించుకోదగ్గ ఆరు ముఖ్యమైన జీవిత సత్యాలు మరియు పాత్రల అంతరార్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ధృతరాష్ట్రుడు... అంధ పుత్రవాత్సల్యం
కన్నపిల్లలపై ప్రేమ ఉండటం సహజం, కానీ అది మితిమీరిన స్వార్థంగా మారితే వినాశనం తప్పదు. బాల్యం నుంచి పిల్లల తప్పుడు కోరికలను కూడా తీర్చుకుంటూ పోతే, కాలక్రమేణా వారు అదుపుతప్పి మీ ఆధీనంలో నుంచి దూరమౌతారు. యోగ్యతను చూడకుండా, కేవలం పుత్రవాత్సల్యంతో అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ధారపోసిన ద్రోణాచార్యుడి కథ కూడా ఇదే చెబుతుంది. పిల్లలకు సంస్కారం లేని జ్ఞానాన్ని ఇస్తే చివరకు మిగిలేది శోకం మాత్రమే.
భీష్ముడు ... విచక్షణా రహితమైన హామీలు
జీవితంలో ఏది ఎంత అవసరమో, అంతవరకు మాత్రమే మాట ఇవ్వాలి లేదా హామీలు ప్రకటించాలి. గంగేయుడైన భీష్ముడు విచక్షణా రహితంగా చేసిన సింహాసన రక్షణ ప్రతిజ్ఞే ఆయనను జీవితాంతం అధర్మానికి లోబడి బానిసగా బతికేలా చేసింది. సర్వ సమర్థత, అమితమైన శక్తులు ఉన్నప్పటికీ కళ్ల ముందే ద్రౌపదికి అన్యాయం జరుగుతున్నా చేతులు ముడుచుకుని కూర్చోవలసిన దీనస్థితి ఆయనకు పట్టింది.
కర్ణుడు ... అధర్మానికి ఆయుధం
ఎంతటి బలవంతుడైనా, లోకంలో తిరుగులేని నైపుణ్యాలు సంపాదించినా, ఆ శక్తులను ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు నిలబెడితే అవి సమయం వచ్చినప్పుడు నిరుపయోగమౌతాయి. కర్ణుడి అస్త్రవిద్యలు ఆఖరి నిమిషంలో పనిచేయకపోవడానికి కారణం ఆయన అధర్మ పక్షాన నిలబడటమే. శక్తులతో పాటు మనిషి కూడా నాశనమౌతాడని ఈ పాత్ర హెచ్చరిస్తుంది.
దుర్యోధనుడు ... దురహంకార నాశనం
సంపద, అధికారం, బంధుబలం ఉన్నాయని అహంకారంతో విర్రవీగితే ఎంతటి మహా సామ్రాజ్యమైనా కూలిపోతుంది. దుర్యోధనుడు తన శక్తులను అధర్మానికి వాడి తనతో పాటు తన వందమంది సోదరులను, కులాన్ని సర్వనాశనం చేసుకున్నాడు.
శకుని ... చెడ్డ మిత్రుడి సావాసం
జీవితంలో స్నేహం చేయాల్సి వస్తే ఒక మంచి శత్రువునైనా ఎంచుకోవచ్చు గానీ, వెన్నుపోటు పొడిచే దుష్ట మిత్రుడితో మాత్రం సావాసం చేయకూడదు. శకుని లాంటి కుటిల బుద్ధి గలవారు పక్కన ఉంటే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుంది. మహాభారతాన్ని కేవలం ఒక కథలా చదవకండి. మన ఇంట్లో ఉన్న ధృతరాష్ట్రుడి లాంటి మోహాన్ని, భీష్ముడి లాంటి పట్టింపులను, దుర్యోధనుడి లాంటి అహాన్ని గుర్తించి సరిచేసుకోవడమే నిజమైన గీతా సారం.




