Ulupi Story: మహాభారతం...ప్రతి మగవాడు తెలుసుకోవలసిన ఓ భార్యకథ

మహాభారతంలో అర్జునుడిని శాపం నుంచి రక్షించుకున్న ఉలూపి కథ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉంటుంది. నాగకన్య ఉలూపి ఎవరు? అర్జుడిని ఎలా వివాహం చేసుకుంది? అర్జునుడికి ఉన్న శాపమేంటో తెలుసుకుందాం.

Balachander
Published on: 15 Aug 2026 10:51 AM IST
Ulupi Story: మహాభారతం...ప్రతి మగవాడు తెలుసుకోవలసిన ఓ భార్యకథ
X

Ulupi Story: వ్యాస మహర్షి విరచిత మహాభారతంలో ప్రతి పాత్ర ఒక దివ్యమైన ధర్మ సూచిక. పాండవ మధ్యముడైన అర్జునుడి జీవితం అనగానే మనకు ద్రౌపది, సుభద్రల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ, అర్జునుడిని నరక లోక శాపం నుండి, మృత్యువు నుండి కాపాడి పునర్జన్మను ప్రసాదించిన నాగకన్య 'ఉలూపి' కథ ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. భర్త శ్రేయస్సు కోసం ఒక భార్య ఏ స్థాయి త్యాగానికైనా వెనుకాడదని నిరూపించిన మహోన్నత పతివ్రత ఉలూపి.

నాగలోక ప్రవేశం... ఉలూపితో వివాహం

ద్రౌపదితో ఏకాంత సమయం విషయంలో నారద మహర్షి విధించిన నియమాన్ని క్షాత్రధర్మ రక్షణ కోసం అర్జునుడు దాటవలసి వచ్చింది. దీనివల్ల ఆయన 12 సంవత్సరాల తీర్థయాత్రా వ్రతాన్ని చేపట్టాడు. ఒకరోజు గంగానదిలో స్నానం చేస్తుండగా అర్జునుడిని నాగకన్య ఉలూపి పాతాళ లోకానికి తీసుకువెళ్లింది. అర్జునుడి తేజస్సుకు ముగ్ధురాలైన ఉలూపి, ఆయనను వివాహం చేసుకోమని కోరింది. నిబంధనలను వివరించినప్పటికీ ఆమె ఆరాధనా భావాన్ని గుర్తించి అర్జునుడు ఉలూపిని వివాహమాడాడు. వీరి అనుబంధానికి ప్రతీకగా 'ఐరావంతుడు' జన్మించాడు.

వసువుల ఘోర శాపం ... ఉలూపి పతిభక్తి

కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మ సంస్థాపన కోసం భీష్మాచార్యులను అర్జునుడు కూల్చివేశాడు. తన పుత్రుడి పతనానికి ఆగ్రహించిన గంగాదేవి ఆజ్ఞతో, అష్టవసువులు అర్జునుడికి ఘోరమైన శాపాన్ని విధించారు. అర్జునుడు మరణించి నరక బాధలు అనుభవిస్తాడని శపించారు. గంగాదేవి శాపాన్ని తెలుసుకున్న ఉలూపి ఎంతగానో కుంగిపోయింది. తన తండ్రి కౌరవ్యుడి సహాయంతో వసువులను ప్రార్థించి, శాప విమోచన మార్గాన్ని కనుగొంది. అర్జునుడు తన సొంత కుమారుడి చేతిలో మరణించి నేలకొరిగితేనే ఆ నరక శాపం తొలగిపోతుందని వసువులు స్పష్టం చేశారు.

బభృవాహనుడితో యుద్ధం ... నాగమణి దివ్య లీల

తరువాతి కాలంలో ధర్మరాజు నిర్వహించిన అశ్వమేధ యాగంలో యాగాశ్వం మణిపూర రాజ్యానికి చేరుకుంది. ఆ రాజ్యాన్ని అర్జునుడు, చిత్రాంగదల కుమారుడైన 'బభృవాహనుడు' పాలిస్తున్నాడు. తండ్రికి ఎదురెళ్లి నమస్కరించిన బభృవాహనుడిని, ఉలూపి వెనుక నుండి ప్రోత్సహించి అర్జునుడితో యుద్ధానికి దిగేలా చేసింది. భర్తను నరకం నుండి రక్షించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఉలూపి వ్యూహం ప్రకారం జరిగిన తీవ్ర యుద్ధంలో బభృవాహనుడి బాణానికి అర్జునుడు సంహరించబడి నేలకొరిగాడు. ఆ వెంటనే వసువుల శాపం నివారణ అయింది. కానీ, ఉలూపి తన వద్ద ఉన్న అమూల్యమైన 'నాగమణి'ని అర్జునుడి రొమ్ముపై ఉంచి, తన పతిభక్తి శక్తితో ఆయనను తిరిగి బతికించుకుంది. ఈ విధంగా తన మాతృత్వ వేదనను, సవతి మానసిక బాధను పక్కనపెట్టి, కేవలం భర్త ప్రాణ రక్షణే పరమావధిగా భావించిన ఉలూపి పాత్ర మహాభారతంలో అత్యంత దివ్యమైనది. పతిభక్తి ఎంత గొప్పదో ఉలూపి కథ మనకు తెలియజేస్తుంది. అయితే, ద్రౌపది పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యత, ప్రాచూర్యం ఉలూపి పాత్రకు ఇవ్వకపోవడంతో మహాభారతంలో ఓ ఉపకథగా మాత్రమే మిగిలిపోయింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story