Manas Epic: మహాభారతాన్ని పోలిన మహాగ్రంథం మానస్‌... కిర్గిస్తాన్‌ మహాకావ్యం ప్రత్యేకత ఇదే

కిర్గిజిస్తాన్‌ మహాకావ్యం మానస్‌ ప్రత్యేకత ఏమిటి? ఐదు లక్షల పద్య పాదాలతో సాగిన ఈ వీరగాథకు మహాభారతంతో ఉన్న సారూప్యతల గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 5 Sept 2026 9:38 AM IST
Manas Epic: మహాభారతాన్ని పోలిన మహాగ్రంథం మానస్‌... కిర్గిస్తాన్‌ మహాకావ్యం ప్రత్యేకత ఇదే
X

Manas Epic: భారతదేశానికి 'మహాభారతం' ఎంతటి పవిత్రమైన చారిత్రక కావ్యమో, మధ్య ఆసియాలోని కిర్గిజిస్తాన్ దేశానికి 'మానస్' అనే మహాకావ్యం అంతటి ఆత్మలాంటిది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ సందర్శించినప్పుడు ప్రముఖ మానస్‌చి రైస్‌బాయ్ ఇసాకోవ్ ఈ కావ్యాన్ని శ్రావ్యంగా ఆలపించి వినిపించారు. దాదాపు ఐదు లక్షల పద్య పాదాలతో కూడిన ఈ కావ్యం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన మౌఖిక కావ్యాగా 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది. భారతీయ మహాభారతంలో ఉన్నట్లే ఇందులో కూడా స్నేహం, సహనం, ధర్మం, తరతరాల పోరాటాలు ప్రధానాంశాలుగా కనిపిస్తాయి.

యోధుడు మానస్ ...మూడు తరాల సుదీర్ఘ గాథ

ఈ మహాకావ్యం కిర్గిజ్ తెగలను ఒకతాటిపైకి తెచ్చి, శత్రువుల నుండి దేశాన్ని కాపాడిన 'మానస్' అనే పరాక్రమవంతుడైన నాయకుడి చుట్టూ తిరుగుతుంది. కేవలం పోరాటాలే కాకుండా ఆనాటి సాంస్కృతిక వేడుకలు, వివాహాలు, రాజకీయ విలువల గురించి ఇది వివరిస్తుంది. అంతేకాదు, మానస్ మరణంతో ఈ కథ ముగిసిపోదు. ఆయన కుమారుడు 'సెమెతే', మనవడు 'సెయ్‌తేక్' జీవిత ఘట్టాలతో కూడి మూడు విభాగాలుగా రూపాంతరం చెంది తరతరాల కథగా నిలిచింది.

మానస్‌చి ... అద్భుత జ్ఞాపకశక్తి

ఈ గ్రంథం శతాబ్దాల పాటు ఏ పుస్తకంలోనూ లిఖించబడలేదు. కేవలం కథకుల జ్ఞాపకశక్తి ద్వారానే తరతరాలకు అందించబడింది. ఈ కావ్యాన్ని ఆలపించే కథకులను 'మానస్‌చి' అని పిలుస్తారు. ఐదు లక్షల వరుసలు కలిగిన ఈ కావ్యాన్ని ఆపకుండా ఆలపించడానికి దాదాపు మూడు రోజులు సమయం పడుతుంది. అసాధారణ జ్ఞాపకశక్తి, స్వర నియంత్రణ, హావభావాలు కలిగిన ఈ కథకులకు ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయని అక్కడి ప్రజలు నమ్ముతారు.

మహాభారతం ... మానస్ పోలికలు

మహాభారతంలో కురువంశ తరతరాల చరిత్ర, ఆయుర్వేదం, ధర్మశాస్త్రాలు ఎలా ఇమిడి ఉన్నాయో... మానస్ కావ్యంలో కూడా వైద్యం, భూగోళశాస్త్రం, ఆచారాలు, రాజనీతి అంతర్లీనంగా ఉంటాయి. మానస్ కావ్యం కేవలం ఒక వీరగాథ మాత్రమే కాదు. కిర్గిజ్ జాతి ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిలువెత్తు రూపం. భారతీయ మహాభారతానికి, కిర్గిజ్ మానస్‌కు ఉన్న ఈ సారూప్యత రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story