మే నెల ఆధ్యాత్మిక విశిష్టత... మే నెలలో వచ్చే పండుగలు, ముహూర్తాలు ఇవే
తెలుగు కాలమానం ప్రకారం 2026 మే నెల అత్యంత విశిష్టమైనది. వైశాఖమాసం ముగిసి జ్యేష్టమాసం మే నెలలోనే ప్రారంభం అవుతుంది. ఈ మే నెలలో ఎండలు మండుతున్నా...భక్తుల హృదయాల్లో భక్తి తుషారం నింపుతుంది.
May 2026 Festivals Muhurat Dates : తెలుగు కాలమానం ప్రకారం 2026 మే నెల అత్యంత విశిష్టమైనది. వైశాఖమాసం ముగిసి జ్యేష్టమాసం మే నెలలోనే ప్రారంభం అవుతుంది. ఈ మే నెలలో ఎండలు మండుతున్నా...భక్తుల హృదయాల్లో భక్తి తుషారం నింపుతుంది. ఈ నెలలోనే సూర్యుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తారు. దీనిని వృషభ సంక్రమణం అని పిలుస్తారు. వైశాఖ మాసంలో దాన ధర్మాలు, జ్యేష్టమాసంలో జలదానాలు అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో హనుమాన్ జయంతి, శిని జయంతి, బుద్ధ పూర్ణిమ వంటి 10కి పైగా ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు కూడా మంచి ముహూర్తాలు ఉండటం విశేషం.
మే 2026- ముఖ్యమైన పండుగలు - విశిష్టత
మే నెల భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక శక్తిని నింపుతూ...వారిలో శక్తిని పెంచుతుంది. ఈ మాసంలో వచ్చే పండుగలు సామాజిక చైతన్యాన్ని నింపుతాయి. సమాజంలో మార్పును తీసుకొస్తాయి. మరి మే నెలలో వచ్చే పండుగలు, వాటి వివరాలు, తేదీలను ఒకసారి పరిశీలిద్దాం.
మే 1 శుక్రవారం వైశాఖ పూర్ణిమ. దీనినే బుద్ద పూర్ణిమ అని కూడా పిలుస్తారు. వైశాఖ పూర్ణిమ రోజున శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో అవతరించినట్టుగా చెబుతారు. అందుకే వైశాఖ పూర్ణిమ రోజును కూర్మజయంతిగా కూడా జరుపుకుంటారు. అంతేకాదు, మే 1 పూర్ణమి తిథి కావడంతో ఆరోజున సత్యనారాయణ స్వామి వ్రతాలను చేసుకుంటారు.
మే 12వ తేదీ మంగళవారం హనుమంతుడికి కేటాయించిన రోజు. మే 12 వ తేదీ హనుమాన్ జయంతి కూడా రావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాం. అంతేకాదు, హనుమంతుడికి అత్యంత ఇష్టమైన మంగళవారం కూడా అదే రోజు కావడం ఈ పండుగకు మరింత ప్రాశస్త్యం ఏర్పడింది.
మే 16 శనివారం రోజున శనిజయంతిని జరుపుకుంటాం. శని భగవానుడు జన్మించిన రోజు కావడంతో ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు ఆరోజున స్వామివారికి తైలాభిషేకం చేస్తారు. ఇలా శని జయంతి రోజున తైలాభిషేకం చేయడం వలన ప్రభావం 50 శాతం వరకు తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, మే 16న వట సావిత్రి వ్రతాన్ని కూడా మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. వట వృక్షాన్ని పూజించి ఈ వ్రతం చేయడం వలన సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం.
మే 25న గంగా దసరా పండుగను జరుపుకోబోతున్నాం. పవిత్రమైన గంగానది భూమికి దిగివచ్చిన రోజు గంగా దసరా. ఆధ్యాత్మిక శుద్ది, దానధర్మాలు, ఆశీర్వాదాలను కొనుకోవడానికి ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. గంగా దరరా తరువాత రోజు నుంచి అంటే మే 26 నుంచి యమునా నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
అదేవిధంగా మే 28వ తేదీ గురువారం రోజు నిర్జల ఏకాదశి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ నిర్జల ఏకాదశి అత్యంత కఠినమైనదిగా చెబుతారు. ఈ నిర్జల ఏకాదశి రోజున చుక్కనీరు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేయాలి. ఇలా చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయిని చెబుతారు.
ఇక మే 31 ఆదివారం ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి రోజున రైతులు నాగలిపట్టి పొలాన్ని దున్నే శుభ సమయం. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగల్లో ఏరువాక పౌర్ణమి కూడా ఒకటి. పొలం దున్నిన రోజు నుంచి రైతుల పొలం పనులు ప్రారంభమౌతాయి.
మే నెల - ఓ సిరి వెన్నెల
సాధారణంగా మే నెలలో శుభ ముహూర్తాలు పెద్దగా ఉండవు. కానీ ఈసారి ఈ మే నెలలో అనేక శుభకార్యాలు జరుపుకునేందుకు శుభముహూర్తాలు ఉండటం విశేషం. వివాహం, గృహప్రవేశం, నిశ్చితార్థం వంటి పనులకు పలు ముహూర్తాలు ఉన్నాయి. ఆ తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
మే 2, మే 5, మే 9, మే 13, మే 17, మే 20, మే 24, మే 28 తేదీలు వివాహాలకు అత్యంత శుభకరమైనవి. గ్రహస్థితులకు అనుగుణంగా ముహూర్తబలం ఉన్నది. మే నెలలో ఈ 8 తేదీల్లో వివాహాలు చేసుకున్నవారి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇతర శుభకార్యాలు, నామకరణం వంటి వాటికి మే 1, మే 5, మే 9, మే 13, మే 17, మే 20, మే 24, మే 28 తేదీలు అత్యంత శుభప్రదం.
మొత్తంగా చెప్పాలంటే మే నెలలో ప్రతి ఒక్కరూ కనీసం ఐదు రోజులు ఉపవాసం, జపం, దానం చేయడం ద్వారా జీవితంలో శాంతిని, సుఖాన్ని పొందవచ్చు. ఈ మే నెలలో భక్తితో చేసిన ప్రతి పని మహాపుణ్య ఫలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికతను ఆచరిస్తే జీవితం సార్థకమౌతుందని పండితులు చెబుతున్నారు.




