Meenakshi Amman Miracle: కలెక్టర్‌ను కాపాడిన మీనాక్షి అమ్మాన్‌... ఈ పాదుకలే నిదర్శనం

బ్రిటీష్‌ కాలం నాటి కలెక్టర్‌ను కాపాడిన మధుర మీనాక్షి అమ్మాన్‌. అమ్మవారికి బంగారు పాదుకలను సమర్పించిన పీటర్‌. చిత్రై ఫెస్టివల్‌లో ఈ పాదుకలను మనం చూడవచ్చు.

Balachander
Updated on: 25 Jun 2026 10:10 AM IST
Meenakshi Amman Miracle: కలెక్టర్‌ను కాపాడిన మీనాక్షి అమ్మాన్‌... ఈ పాదుకలే నిదర్శనం
X

Meenakshi Amman Miracle: భగవంతుడి ఆరాధనకు కులమతాల సరిహద్దులు లేవు, కేవలం నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలని నిరూపించే సజీవ సాక్ష్యం మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని ‘పీటర్ పాదుకలు’. బ్రిటీష్ కాలంలో ఒక తెల్లదొర, మధురై కలెక్టర్‌గా పనిచేసిన రోజ్ పీటర్ అనే అధికారిని మీనాక్షి అమ్మవారే స్వయంగా వచ్చి ప్రాణాపాయం నుండి రక్షించారు. దానికి కృతజ్ఞతగా ఆయన సమర్పించిన రత్నఖచిత పాదుకలు నేటికీ అమ్మవారి చెంత పూజలందుకుంటున్నాయి.

భక్తికి లొంగిన జగన్మాత ... చరిత్రాత్మక ఘట్టం

భారతదేశం తెల్లదొరల పాలనలో ఉన్న సమయం. నాటి మధురై కలెక్టర్ రోజ్ పీటర్ గారు నిత్యం తన గుర్రంపై కార్యాలయానికి వెళ్లేటప్పుడు, మీనాక్షి అమ్మవారి ఆలయం రాగానే భక్తితో గుర్రం దిగి, తన బూట్లను విప్పి, చేతులు జోడించి నమస్కరించేవారు. క్రైస్తవుడైనప్పటికీ ఆయన మనసులో అమ్మవారిపై అపారమైన గౌరవం ఉండేది. ఆ భక్తే ఆయన ప్రాణాలను కాపాడింది. ఒకరోజు రాత్రి మధురైలో ఉరుములు, మెరుపులతో కూడిన భీభత్సమైన వర్షం కురిసింది. ఆ సమయంలో ఒక దివ్యమైన కాంతితో, నుదుటన పెద్ద కుంకుమ బొట్టు, కళ్లలో కరుణతో కూడిన ఒక స్త్రీమూర్తి కలెక్టర్ పీటర్ ఇంటి వద్దకు వచ్చింది. ఆమె పీటర్ వైపు చూసి, "పీటర్! త్వరగా బయటకు రా..." అని వాత్సల్యంతో పిలిచింది. ఆ పిలుపులోని అమృతత్వానికి పరవశించి, ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా ఆమె వెనుక బయటకు నడిచారు. ఆయన అలా తోటలోకి అడుగు పెట్టారో లేదో... ఒక్కసారిగా పిడుగుపడి ఆయన నివసిస్తున్న భవనం కుప్పకూలిపోయింది! దిగ్భ్రాంతి చెందిన పీటర్ వెనక్కి తిరిగి కూలిన ఇంటివైపు చూసి, ఆ తరువాత తనను పిలిచిన స్త్రీమూర్తివైపు చూశాడు. ఇక్కడే అద్భుతం చోటుచేసుకుంది. పీటర్‌ అని పిలిచిన మహిళ అక్కడ లేదు. అప్పుడే ఆయనకు అర్థమైంది. తనను కాపాడింది సాక్షాత్తు ఆ మధురై మీనాక్షి అమ్మవారే అని. ఆ క్షణంలో ఆయన కంటి నుంచి ఆనందభాష్ఫాలు జలజల రాలాయి.

అమ్మవారికి సమర్పించిన రత్నఖచిత పాదుకలు

మరుసటి రోజు ఉదయమే ఆలయానికి వెళ్లిన కలెక్టర్ పీటర్, నిన్న రాత్రి అమ్మవారు తన కోసం చెప్పులు లేకుండా వచ్చారని గ్రహించి, అమ్మవారి పాదాలకు బంగారు పాదుకలను చేయించాలని సంకల్పించారు. ఆ విధంగా ఆయన అద్భుతమైన నైపుణ్యంతో మూడు రకాల నవరత్నాలను పొదిగించి దివ్యమైన పాదుకలను సమర్పించారు. 412 కెంపులు, 72 పచ్చలు, 80 వజ్రాలున్న మూడు పాదుకలను అమ్మవారికి సమర్పించారు కలెక్టర్‌ పీటర్‌.

నేటికీ మధురై ఆలయంలో ప్రతి ఏటా జరిగే ప్రసిద్ధ ‘చిత్రై ఉత్సవాల’ సమయాన అమ్మవారి ఉత్సవ మూర్తికి ఈ ‘పీటర్ పాదుకలనే’ అలంకరిస్తారు. భగవంతుడికి కావాల్సింది మతం కాదు, అంతఃకరణ శుద్ధితో కూడిన భక్తి మాత్రమే అని చాటిచెప్పే ఈ కథ ప్రతి ఒక్కరి గుండెలను తాకుతుంది. భక్తితో కొలిచిన వారిపై అమ్మవారి కృప కటాక్షాలు తప్పకుండా ఉంటాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story