Shiva Abhishekam: రాగిచెంబులోని పాలతో శివాభిషేకం చేస్తున్నారా... శివయ్య ఆగ్రహిస్తాడు జాగ్రత్త
భోళాశంకరుడు అభిషేక ప్రియుడు. భక్తితో కాసిన్ని నీళ్లు పోసినా ప్రసన్నుడయ్యే దయామయుడు. అయితే శివారాధనలో మనం చేసే ఒక చిన్న పొరపాటు మహాపాపంగా మారుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి.
Shiva Abhishekam: భోళాశంకరుడు అభిషేక ప్రియుడు. భక్తితో కాసిన్ని నీళ్లు పోసినా ప్రసన్నుడయ్యే దయామయుడు. అయితే శివారాధనలో మనం చేసే ఒక చిన్న పొరపాటు మహాపాపంగా మారుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. చాలామంది పుణ్యం వస్తుందనే భావనతో రాగి చెంబులో పాలు పోసి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ రాగి పాత్రలోని పాలతో అభిషేకం చేయడం వల్ల పుణ్యానికి బదులు శివుని ఆగ్రహానికి, పాపానికి గురికావలసి వస్తుంది. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాగి పాత్రలో పాలు పోస్తే ఏమవుతుంది?
హిందూ సనాతన ధర్మంలో రాగి (తామ్రం) అత్యంత పవిత్రమైన లోహం. దైవ కార్యాలకు దీనిని విస్తృతంగా వాడతారు. కానీ, రాగి పాత్రకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అది తన చుట్టూ ఉండే శక్తులను త్వరగా ఆకర్షిస్తుంది. ఇక పాలు సాత్వికతకు, స్వచ్చతకు చిహ్నం. శాస్త్రాల ప్రకారం, పాలను రాగి పాత్రలో పోసినపుడు ఆ లోహపు గుణాల వలన పాలు క్షీరత్వాన్ని కోల్పోయి విషతుల్యంగా, అశుభ్రంగా మారిపోతాయి. సైన్స్ పరంగా చూసుకుంటే రాగి పాత్రలో పాలు లేదా పెరుగు పోసినపుడు వాటిమధ్య రసాయన చర్య జరిగి పాలు పాడైపోతాయి. అవి తాగడానికి కూడా పనికిరావు. అలాంటి పాలను పవిత్రమైన శివలింగంపై అభిషేకం చేయడం వలన మహాపరాధం.
మరి రాగి చెంబుతో నీటి అభిషేకం చేయవచ్చా?
ఖచ్చితంగా చేయవచ్చు! నీటికి ఒక అద్భుతమైన స్వభావం ఉంది. నీరు తన చుట్టూ ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీనైనా నిర్వీర్యం చేయగలదు. రాగి పాత్రలోని నీరు గంగాజలంతో సమానమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి రాగి చెంబులోని నీటితో శివునికి అభిషేకం చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు, పైగా అమితమైన పుణ్యం లభిస్తుంది.
పాలాభిషేకం ఏ పాత్రతో చేయాలి?
మహాశివరాత్రి రోజున లేదా సాధారణ రోజుల్లో శివునికి పాలాభిషేకం చేయాలనుకుంటే ఖచ్చితంగా మూడు నియమాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పాలాభిషేకానికి ఎల్లప్పుడూ వెండి లేదా ఇత్తడి లేదా కంచు పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ ఈ పాత్రలు అందుబాటులో లేకుంటే మట్టి పాత్ర లేదా స్టీలు పాత్రలనైనా ఉపయోగించవచ్చు. కానీ, పొరపాటున కూడా రాగి పాత్రను వినియోగించరాదు. ఇక అభిషేకం చేసే సమయంలో తప్పనిసరిగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. శివనామస్మరణ చేయాలి. భగవంతుడికి మనం ఇచ్చే పదార్థం కంటే, ఇచ్చే విధానంలో ఉండే పవిత్రత ముఖ్యం. కాబట్టి ఈ చిన్న నియమాన్ని పాటించి, శివయ్య సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం.
గమనికః పురాణాలు, నమ్మకాల ఆధారంగా మాత్రమే ఈ విషయాలను సేకరించడం జరిగింది.




