Mohata Jagannath Temple: మోహతా జగన్నాథుడి రహస్యం - వర్షాన్ని అంచనావేసే ఆలయం

Mohata Jagannath Temple: ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఎదిగినా, వాతావరణ మార్పులను ఖచ్చితంగా అంచనా వేయడం నేటికీ సవాలే.

Balachander
Published on: 21 April 2026 1:23 PM IST
Mohata Jagannath Temple
X

Mohata Jagannath Temple

Mohata Jagannath Temple: ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఎదిగినా, వాతావరణ మార్పులను ఖచ్చితంగా అంచనా వేయడం నేటికీ సవాలే. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా, మోహతా గ్రామంలో ఉన్న ఒక పురాతన జగన్నాథ ఆలయం మాత్రం ఇందుకు మినహాయింపు. వర్షం రాకను వారం రోజుల ముందే పసిగట్టి భక్తులను, ముఖ్యంగా రైతులకు ముందస్తు సమాచారం అందించే అద్భుత శక్తి ఈ ఆలయానికి ఉంది. ఈ ప్రాంతం ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. వర్షాన్ని ముందుగానే ఊహించే ఈ ఆలయం గురించి తెలుసుకుందాం.

పైకప్పు నుంచి రాలే నీటి బిందువుల రహస్యం

ఈ ఆలయంలో ప్రధాన దైవం జగన్నాథ స్వామి. ఇక్కడ స్వామివారిని 'వర్ష దేవుడు'గా కొలుస్తారు. ఈ క్షేత్రంలోని అత్యంత వింతైన విషయం ఏమిటంటే, వర్షం కురవడానికి సరిగ్గా 6 నుండి 7 రోజుల ముందే గర్భాలయం పైకప్పు నుంచి నీటి బిందువులు రాలడం మొదలవుతాయి. పై కప్పు నుంచి పడే నీటి చుక్కల పరిమాణాన్ని బట్టి ఆ ఏడాది వర్షం ఎంత మోతాదులో కురుస్తుందో రైతులు అంచనా వేస్తారు. వర్షపు బిందువులు పెద్ద పరిమాణంలో ఉంటే భారీ వర్షాలు కురుస్తాయని, అదే పరిమాణంలో చిన్నగా ఉంటే సాధారణ వర్షాలు కురుస్తాయని అర్ధం చేసుకోవాలి. ఈ ఆలయంలో మరో విశేషం ఏమంటే... వర్షం కురవడానికి వారం రోజుల ముందు నుంచి ఆలయం పైకప్పు నుంచి నీటి బిందువులు రాలిపడుతుంటాయి. ఎప్పుడైతే ఆకాశం మేఘావృతం అవుతుందో అప్పుడు ఆలయం పైకప్పు పొడిగా మారిపోతుంది. ఇదంతా భగవంతుడి లీలగా చెబుతారు.

ఖగోళ వింతలు - నిర్మాణ శైలి

జగన్నాథుని ఆలయం పైకప్పు వృత్తాకారంలో ఉంటుంది. ఈ నిర్మాణశైలి కారణంగానే పిడుగులు, మెరుపులు ఈ ఆలయాన్ని తాకవని భక్తులు చెబుతున్నారు. ఇక ఈ ఆలయంలో జగన్నాథుడితో పాటు శ్రీమహావిష్ణువు యొక్క 24 అవతారాలకు సంబంధించిన విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం పైకప్పుపై దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ, పైకప్పు నుంచి ఎందుకు నీరు అలా రాలిపడుతుందో, ఆకాశం మేఘావృతం కాగానే ఎందుకు పైకప్పు పొడిబారిపోతుందో గుర్తించలేకపోయారు. ఇది దేవరహస్యమని భక్తులు విశ్వసిస్తారు.

కోరికలు తీర్చే కల్పవృక్షం

ఈ జగన్నాథుడి క్షేత్రం కేవలం వర్షం రాకను అంచనా వేయడమే కాదు...వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే ఆలయంగా కూడా ప్రసిద్ది. వివాహ సంబంధాలు కుదరక ఇబ్బందిపడేవారు స్వామిని దర్శించుకుంటే ఆరునెలలు తిరక్కముందే సంబంధాలు కుదురుతాయని నమ్మకం. అంతేకాదు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించే ఆలయంగా కూడా ప్రసిద్ది పొందింది. క్లుప్తంగా చెప్పాలంటే... ప్రకృతికి, దైవానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ఈ మోహతా జగన్నాథ ఆలయం ఒక సజీవ సాక్ష్యం. ఇలాంటి మహిమాన్వితమైన ఆలయాలు దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని భగవంతునికి సంపూర్ణ శరణాగతి అయితే భగవంతుడు మన పక్కనే ఉండి మనల్ని వెన్నంటి కాపాడతాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story