Monk's Story: సన్యాసి చెప్పిన సత్యం... అందరం ఇలానే బతుకుతున్నాం... మార్పు రావాలంటే
సన్యాసి చెప్పిన గాడిద కథలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏమిటి? మన జీవితంలోని మాయ, బంధాలు, భ్రమలు ఎలా మనల్ని కట్టిపడేస్తాయో, ఆత్మజ్ఞానం ద్వారా విముక్తి ఎలా సాధ్యమో తెలుసుకుందాం.
Monk's Story: మన దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనల వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉంటాయి. మనమందరం అనేక బంధాలు, రాగద్వేషాలు, భ్రమల అనే అదృశ్యమైన కట్లతో కట్టబడి ఉన్నామనే చేదు సత్యాన్ని ఒక సన్యాసి చెప్పిన కథ ఎంతో తేలికగా బోధిస్తుంది. నిజానికి లేని బంధాలను ఉన్నాయని నమ్ముతూ, అజ్ఞానంలో జీవిస్తున్న మానవుడికి ఈ కథ ఒక కన్నువిప్పు లాంటిది. మనస్సులో ఉన్న అజ్ఞానపు పొరలను తొలగించుకుని ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయడమే నిజమైన ముక్తి అని ఈ చిన్న కథ స్పష్టం చేస్తోంది.
చండప్రచండమైన ఎండ ... రైతు ఉపాయం
ఒక గ్రామంలో గాడిదలను మేపుకుంటూ జీవించే ఒక సామాన్య రైతు ఉండేవాడు. తీవ్రమైన వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక, పక్కనే ఉన్న పవిత్రమైన చెరువులో స్నానం చేసి రావాలని భావించాడు. తన వద్ద ఉన్న 3 గాడిదలలో రెండు గాడిదలను చెట్టుకు బలమైన తాళ్లతో కట్టేశాడు. అయితే, మూడో గాడిదను కట్టడానికి తన వద్ద తాడు లేకపోవడంతో అయోమయంలో పడ్డాడు. ఆ సమయానికి అటుగా వస్తున్న ఒక జ్ఞాని అయిన సన్యాసిని చూసి రైతు తాడు సహాయం కోరాడు. సన్యాసి చిరునవ్వుతో "నా వద్ద తాడు లేదు కానీ, ఆ గాడిదను నిజంగా తాడుతో కడుతున్నట్లే దాని కళ్లకు కనిపించేలా నటించు" అని చెప్పారు. రైతు సన్యాసి చెప్పినట్లే తాడుతో కడుతున్నట్లు నటించి స్నానానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా మూడు గాడిదలు అక్కడే సురక్షితంగా నిలబడి ఉన్నాయి.
కదలని గాడిద ... సన్యాసి బోధించిన అంతరార్థం
రైతు సంతోషంతో రెండు గాడిదలకు ఉన్న నిజమైన తాళ్లను విప్పి ముందుకు నడిపాడు. కానీ, మూడో గాడిద మాత్రం అంగుళం కూడా కదలకుండా అక్కడే నిలబడిపోయింది. మళ్లీ అటుగా వచ్చిన సన్యాసిని రైతు ఆవేదనతో అడగ్గా, "నువ్వు గాడిదను కట్టేసినట్లు నటించావు కానీ, దాని కట్లు విప్పినట్లు నటించలేదు కదా! తాడు లేదనే విషయం నీకూ నాకూ తెలుసు, కానీ గాడిద ఇంకా తాడుతో కట్టబడి ఉన్నాననే భ్రమలోనే ఉంది" అని వివరించారు. రైతు వెంటనే సన్యాసి సూచన మేరకు తాడును విప్పుతున్నట్లు నటించగానే, ఆ గాడిద రైతు వెంట ప్రశాంతంగా అడుగులు వేసింది.
ఆధ్యాత్మిక సత్యం.... మానవ జన్మ సార్థకత
ఈ చిన్న సంఘటన మానవ జీవితానికి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక పాఠం. సనాతన ధర్మం ప్రకారం జగత్తు అంతా మాయాభరితం. "సంసార బంధనాలు అనేవి నిజానికి లేని తాళ్ల వంటివి. కేవలం మనస్సులోనే మనం ఆ బంధాలకు కట్టుబడి ఉన్నామని నమ్ముతాము." ధనం, పదవి, కుటుంబ మోహం వంటివన్నీ ఆ గాడిదను కట్టేసిన అదృశ్యపు తాడు లాంటి భ్రమలే. ఈ బంధాలన్నీ మిథ్య అని, ఆత్మ మాత్రమే నిత్య సత్యమని గ్రహించిన నాడు మానవుడికి పరిపూర్ణమైన స్వేచ్ఛ, మోక్షం లభిస్తాయి. ఆత్మజ్ఞానమనే దివ్య వెలుగుతో మనలోని అజ్ఞానపు కట్లను తెంచుకున్నప్పుడే జీవుడు పరమాత్మలో ఐక్యమవుతాడు.




