Moving Shiva Lingam: ఇక్కడ మహాశివుడు నిలకడగా ఉండడు...నిత్యం ఇలా కదులుతూనే ఉంటాడు
ఉత్తరప్రదేశ్‌లోని దుగ్దేశ్వర్నాథ్ ఆలయంలో ఉన్న అద్భుత శివలింగం స్వయంగా కదులుతుందనే విశ్వాసం భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ మహిమ వెనుక ఉన్న విశేషాలు తెలుసుకోండి.
Moving Shiva Lingam: భారతదేశంలో ఆలయాలకు కొదవలేదు. పురాతన ఆలయాలతో పాటు మనల్ని మంత్రముగ్దుల్ని చేసే ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాలకు వెళ్తే అక్కడ జరిగే వింతలను చూసి ఆశ్చర్యపోతాం. ఎక్కడైనా సరే గర్భగుడిలో మూలవిరాట్ స్థిరంగా ఉంటుంది. కానీ, ఉత్తరప్రదేశంలోని ఈ పురాతనమైన శివాలయంలో శివలింగం నిత్యం కదులుతూనే ఉంటుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా...అక్షరాల నిజమని పండితులు చెబుతున్నారు. ఈ ఆలయానికి సుమారు 2 వేల సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటుంటారు.
దుగ్దేశ్వర్నాథ్ క్షేత్రం – ఎక్కడ ఉంది?
ఈ పరమాద్భుతమైన శివలింగాన్ని దర్శించుకోవాలంటే మనం ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లా, రుద్రపూర్ అనే గ్రామానికి వెళ్లాలి. ఇక్కడి స్వామివారిని భక్తులు "శ్రీ దుగ్దేశ్వర్నాథ్" అని భక్తితో కొలుస్తారు. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఈ దుగ్దేశ్వర్నాథ్ శివలింగం ఉపలింగంగా పురాణాలు చెబుతున్నాయి. రూపంలోనూ, మహిమలోనూ ఈ లింగం మహాకాళుడిని పోలి ఉంటుంది.
ఆ కదలికల వెనుక ఉన్న రహస్యం ఏంటి?
ఈ ఆలయంలోని అసలైన వింత ఏమిటంటే... పదుల సంఖ్యలో మనుషులు కలిసి ఈ శివలింగాన్ని పట్టుకుని బలంగా కదిలించాలని చూసినా, అది కొంచెం కూడా కదలదు. కానీ, కొన్ని ప్రత్యేక సమయాల్లో ఎటువంటి బాహ్య శక్తి లేకుండా, ఆ పరమశివుని సంకల్పంతోనే ఈ లింగం స్వయంగా కదులుతుంది. ఈ శివలింగం ఎప్పుడు కదులుతుందో, ఎలా కదులుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే, ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఈ అద్భుత దృశ్యం కనిపించదు. పూర్వజన్మ సుకృతం, నిజమైన భక్తి ఉన్నవారికి మాత్రమే ఆ శివయ్య కదలికలు కంటికి కనిపిస్తాయని ఇక్కడి అర్చకులు చెబుతారు.
భక్తుల విశ్వాసం
గత 20 శతాబ్దాలుగా ఈ మహిమ ఇలాగే సాగుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకుని, స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తుంటారు భక్తులు. ఇలా ఇక్కడి స్వామికి అభిషేకం చేయడం వలన అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద పెరుగుతుందని చెబుతారు. అంతేకాదు, ఇక్కడి శివయ్యను దర్శించుకుంటే అకాల మృత్యు భయాలు తొలగిపోయి, సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని అర్చకులు చెబుతున్నారు. మనసులో ఏదైనా కోరిక బలంగా ఉంటే... ఇక్కడి స్వామికి ఆ కోరికను నివేదిస్తే ఆయన సంకల్పబలం చేత కోరికలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. భగవంతుడు అంతటా ఉన్నాడు, అణువణువునా ఆయనే నిండి ఉన్నాడు అనడానికి రుద్రపూర్‌లోని ఈ కదిలే శివలింగమే సజీవ సాక్ష్యం. భక్తితో తలిస్తే ఆ భోళాశంకరుడు మన కష్టాలన్నింటినీ కదిలించి, సుఖసంతోషాలను ఇస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.




