Mrigasira Karte Secrets: జీవితాన్ని పూలపాన్పుగా మార్చే మృగశిర కార్తె...పెద్దలు చెప్పిన రహస్యం
ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న మృగశిర కార్తెలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా శరీరంలో, ఆధ్యాత్మికంగా పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Mrigasira Karte Secrets: ఈరోజు మధ్యాహ్నం 1.34 గంటల నుంచి మృగశిక కార్తె ప్రారంభం కాబోతున్నది. ఖగోళంలో రాబోతున్న ఈ మార్పులు మన జీవితంపై భారీ ప్రభావాన్ని చూపబోతున్నాయి. ఈ కార్తె ఈరోజు నుంచి జూన ్ 21 వరకు ఉంటుంది. ఈ 14 రోజుల కాలంలో ప్రకృతిలోనూ, మన శరీరంలోనూ వచ్చే మార్పులను గమనించి మన పూర్వీకులు కొన్ని అద్బుతమైన నియమాలను అందించారు. ఈ నియమాలను పాటించడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా చేకూరి జీవితం పూలపాన్పుగా, సుఖమయంగా మారుతుందని చెబుతున్నారు. మరి ఆ మార్పులు ఏంటో చూసేద్దామా.
ఇంద్రుని విజయం - ప్రకృతి మార్పు
ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, వర్షాలు పడకుండా అడ్డుపడిన వృతాసురుడిని అంటే మృగాసురుడిని సంహరించి, భూమిపై తొలకరి జల్లులు కురిపించిన వర్షదేవుడు... ఇంద్రుని విజయానికి సంకేతం ఈ మృగశిర కార్తె. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ఠా నక్షత్రానికి, మృగశిరకు 180 డిగ్రీల దూరం ఉంటుంది. తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే, సూర్యుడు మృగశిరలోకి ప్రవేశిస్తాడు. ఇది రుతుపవనాల రాకకు, సకాలంలో వర్షాలు కురవడానికి సంకేతం. ఈ కార్తెలో నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి ఇంద్రయోగం లభిస్తుంది. అంటే స్వర్గాధిపతి ఇంద్రుడు ఎంత వైభోగంగా ఉంటాడో భూమిపై నివశించే మనుషులు కూడా అంతే వైభోగంతో జీవించేందుకు అవకాశం లభిస్తుంది.
చేపలు - బెల్లం ఇంగువ... అసలు రహస్యం ఏమిటి?
ఎండకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సంధి కాలంలో వాతావరణం అకస్మాత్తుగా చల్లబడుతుంది. దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణించి, ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. దీని నుంచి బయటపడేందుకు ఈ మృగశిర కార్తె ప్రారంభంలో తప్పని సరిగా చేపలు తినాలని చెబుతారు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు, ఊపిరితిత్తులకు రక్షణనిస్తాయి. శరీరానికి అవసరమైన వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక శాఖాహారుల విషయానికి వస్తే ఈ కార్తెలో బెల్లం, ఇంగువ కలుపుకొని తీసుకుంటారు. ఇలా చేయడం వలన శరీరానికి సహజసిద్దమైన వేడి లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బెల్లం రక్తాన్ని శుద్ది చేస్తుంది. వర్షాకాలంలో సోకే గుండె, శ్వాసకోశ వ్యాధులను అడ్డుకోవడంలో బెల్లం ఇంగువ మిశ్రమం సంజీవినిలా పనిచేస్తుంది.
జీవితాన్ని పూలపాన్పుగా మారే ఆధ్యాత్మిక నియమాలు
మృగశిర కార్తెలో పూర్వీకులు చెప్పిన నియమాలు కేవలం ఆహారానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ 14 రోజులు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం, ఇంట్లో కర్పూర హారతి లేదా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. శరీరం రోగాల బారిన పడకుండా స్వస్థంగా ఉన్నప్పుడు మనసులో సానుకూల దృక్పథం పెరుగుతుంది. అనారోగ్య భయాలు తొలగిపోవడంతో మనిషి ఆనందంగా, ఉత్సాహంగా పనుల వైపు అడుగులు వేస్తాడు. ఈ కార్తె నియమాలు పాటించి శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధిస్తే, రాబోయే కాలమంతా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోతుంది. అలా పెద్దలు చెప్పిన ఈ చిన్న ఆరోగ్య రహస్యమే మన జీవితాన్ని సకల సుఖాలతో పూలపాన్పుగా మారుస్తుంది. కాబట్టి ఈ కార్తెలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నియమాలు పాటించి ఆరోగ్యాన్ని, దానికి అనుబంధంగా ఆధ్యాత్మిక జీవితాన్ని సానుకూలంగా మార్చుకోండి.




