Kailasa Mountain Mystery: కైలాస పర్వత రహస్యం...ఈ పర్వతాన్ని సామాన్యులు ఎందుకు ఎక్కలేరంటే
సామాన్యులు కైలాస పర్వతాన్ని ఎందుకు ఎక్కలేరో తెలిస్తే షాకవుతారు. ఎక్కేందుకు ప్రయత్నిస్తే వెంటనే ముసలివారౌతారట.
Kailasa Mountain Mystery: సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న పవిత్ర నివాసం కైలాస పర్వతం. సముద్ర మట్టానికి 6,638 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వతం, ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం (8,848 మీటర్లు) కంటే చిన్నదే. అయినా, ఇప్పటివరకు ఎవరెస్ట్‌ను వేల మంది అధిరోహించారు కానీ, కైలాస పర్వతాన్ని మాత్రం ఎవరూ ఎక్కలేకపోయారు. ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నిస్తే కాలం వేగంగా కరిగిపోయి ముసలివారైపోతారని, అదృశ్య శక్తులు అడ్డుకుంటాయని ప్రతీతి. కానీ చారిత్రక ఆధారాల ప్రకారం, దాదాపు వెయ్యేళ్ల క్రితం ఒకే ఒక్కరు ఈ పవిత్ర శిఖరాన్ని అధిరోహించారు. ఆయనే టిబెట్ దేశానికి చెందిన ప్రసిద్ధ బౌద్ధ యోగి, మహాసిద్ధుడు 'మిలరేప'.
పగతో మొదలైన తాంత్రిక ప్రయాణం
ఈ కథ 11వ శతాబ్దంలో దక్షిణ టిబెట్‌లోని ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైంది. అక్కడ జన్మించిన 'తోపక్' అనే బాలుడే కాలక్రమంలో 'మిలరేప'గా మారారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో, బంధువులు వీరి ఆస్తిని అక్రమంగా లాక్కుని మిలరేపను, ఆయన తల్లిని నానా కష్టాలు పెట్టారు. ఈ అవమానంతో రగిలిపోయిన తల్లి, బంధువులపై పగ తీర్చుకోమని కొడుకును కోరింది. తల్లి మాట ప్రకారం మిలరేప 'ఏంటో' అనే భయంకర తాంత్రికుని వద్ద చేరి, కఠినమైన 'మృత్యు మంత్రాన్ని' నేర్చుకున్నాడు. ఆ శక్తులతో గ్రామంపై భీకరమైన వడగండ్ల వాన కురిపించి, తనను ఇబ్బంది పెట్టిన బంధువులతో పాటు అమాయకులైన 80 మంది ప్రాణాలను బలిగొన్నాడు.
పశ్చాత్తాపం.. ఆధ్యాత్మిక రూపాంతరం
పగ తీరినప్పటికీ, అమాయకుల మరణం మిలరేప మనస్సును తీవ్ర అపరాధభావంతో ముంచెత్తింది. పాప విముక్తి కోసం ఆయన బౌద్ధ సన్యాసి అయిన 'మార్పా' అనే సద్గురువును ఆశ్రయించాడు. గురువు పెట్టిన కఠినమైన శారీరక, మానసిక పరీక్షలన్నింటినీ తట్టుకుని, అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించి మహాసిద్ధుడిగా మారాడు.
కైలాస శిఖరంపై అద్భుత విజయం
క్రీ.శ. 1093లో ఆత్మజ్ఞానిగా మారిన మిలరేప, శివస్వరూపమైన కైలాస పర్వతాన్ని దర్శించాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ ఆయనకు 'నరోవన్' అనే మరో తాంత్రిక తత్వవేత్త ఎదురయ్యాడు. ఇద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన ఒప్పందం కుదిరింది. ఎవరైతే ముందుగా కైలాస శిఖరాన్ని చేరుకుంటారో, వారికే ఈ ప్రాంతంపై ఆధ్యాత్మిక ఆధిపత్యం ఉంటుందని అనుకున్నారు. నరోవన్ తన తాంత్రిక శక్తులతో పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించాడు. కానీ, కొంతదూరం వెళ్లిన తరువాత అక్కడి సూర్యకిరణాల తీవ్రత, అసాధారణ వేడిని తట్టుకోలేక సగం దూరం నుండే వెనక్కి వచ్చేశాడు. కానీ, మిలరేప ఎటువంటి అహంకారం లేకుండా, కేవలం తన అచంచలమైన ఆధ్యాత్మిక సాధన, పరిపూర్ణ ఆత్మజ్ఞాన బలంతో కైలాస పర్వత అగ్రభాగాన్ని చేరుకున్నాడు.
మిలరేప వెల్లడించిన కైలాస రహస్యాలు
కైలాస శిఖరాన్ని అధిరోహించి విజయవంతంగా తిరిగి వచ్చిన మిలరేప, ఆ పర్వతానికి సంబంధించిన కొన్ని నమ్మశక్యం కాని రహస్యాలను ప్రపంచానికి వెల్లడించాడు. భూమిపై నెల రోజుల సమయం కైలాస పర్వతంపై కేవలం ఒక్కరోజుతో సమానమని తెలిపాడు. రాత్రి పగలు మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుంది. పర్వత వాతావరణంలో మానవ శరీరం వేగంగా క్షీణిస్తుంది. కేవలం ఒక్క ఘడియలోనే చేతిగోళ్లు, జుట్టు విపరీతంగా పెరిగిపోయి, మనుషులు ముసలివారిగా మారిపోతారని తెలిపారు. పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టమని, ఎన్నో శక్తులు అడ్డుకుంటాయని, సంపూర్ణ ఆత్మజ్ఞానంతో, అచంచలమైన భక్తితో మాత్రమే దీనిని అధిరోహించడం సాధ్యమౌతుందని అన్నారు.
కైలాస పర్వతం అనేది భౌతిక బలం లేదా ఆధునిక సాంకేతికతతో జయించగలిగేది కాదు. అహంకారాన్ని వదిలేసి, పరిపూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందిన సిద్ధులకు మాత్రమే ఆ శివసన్నిధి లభిస్తుందని మిలరేప జీవితం నిరూపించింది. అందుకే నేటికీ భక్తులు ఆ పర్వతాన్ని ఎక్కే సాహసం చేయకుండా, దాని చుట్టూ ఉండే 54 కిలోమీటర్ల మార్గంలో ప్రదక్షిణ (పరిక్రమ) చేసి స్వామివారి కృపను పొందుతున్నారు. కైలాస పర్వత సానువుల్లోని పర్వత పాదాన్ని మహాశివుని సన్నిధిగా భావించి పూజిస్తారు. అంతేకాదు, ఈ పరిక్రమను ఒక్కరోజులో భక్తి శ్రద్దలతో పూర్తిచేసిన వారికి మోక్షం లభిస్తుందని కూడా చెబుతారు.




