Mettugutta Shiva Temple:వనవాసంలో సీతారాములు పూజించిన శివలింగం - హిడింబి పేర్చిన రాళ్ల రహస్యం

తెలంగాణలోని ఆధ్యాత్మిక గడ్డపై వెలసిన అద్భుతాల్లో హన్మకొండ జిల్లా మడికొండ సమీపంలోని 'మెట్టుగుట్ట' ఒకటి. ఇది కేవలం ఒక కొండ మాత్రమే కాదు, త్రేతాయుగపు రామాయణానికి, ద్వాపరయుగపు భారత గాథలకు సజీవ సాక్ష్యం.

Balachander
Published on: 7 May 2026 9:12 AM IST
Mettugutta Shiva Temple:వనవాసంలో సీతారాములు పూజించిన శివలింగం - హిడింబి పేర్చిన రాళ్ల రహస్యం
X

Mettugutta Shiva Temple: తెలంగాణలోని ఆధ్యాత్మిక గడ్డపై వెలసిన అద్భుతాల్లో హన్మకొండ జిల్లా మడికొండ సమీపంలోని 'మెట్టుగుట్ట' ఒకటి. ఇది కేవలం ఒక కొండ మాత్రమే కాదు, త్రేతాయుగపు రామాయణానికి, ద్వాపరయుగపు భారత గాథలకు సజీవ సాక్ష్యం. సుమారు 165 అడుగుల ఎత్తులో, ప్రకృతి వైచిత్రికి అద్దం పడుతూ నిలబడిన ఈ క్షేత్ర విశేషాలు భక్తులను పరవశింపజేస్తాయి. మరి ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామలింగేశ్వరుడి కొలువు – త్రేతాయుగ గాథ

వనవాస సమయంలో సీతారామచంద్రులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు స్థానిక పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు స్వయంగా ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని, అందుకే ఇక్కడి స్వామికి రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. 12వ శతాబ్దపు కాకతీయుల కాలం నాటి శాసనాలు ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని ఘనంగా చాటుతున్నాయి. ఈ ఆలయంలో మరో విశిష్టత కూడా ఉంది. అదే నవసిద్దులు తపస్సు చేసిన గుహలు. ఈ కొండపై 9 పవిత్ర గుండాలు ఉన్నాయి. వీటిలో పాలగుండం, రామగుండం అత్యంత పవిత్రమైనవి. ఈ గుండాల్లోని నీటితో స్వామికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

హిడింబి 'గచ్చకాయలు' – ద్వంద్వలమ్మ గుండ్లు

మెట్టుగుట్టపై అందరినీ విస్తుగొలిపే దృశ్యం 'ద్వంద్వలమ్మ గుండ్లు'. ఇక్కడ రెండు భారీ బండరాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా కనిపిస్తాయి. దీని వెనుక ఒక ఆసక్తికరమైన జానపద గాథ ఉంది. ద్వాపర యుగంలో భీముడి భార్య హిడింబి, ఈ కొండపై విహరిస్తూ గచ్చకాయలు ఆడుకుంటూ సరదాగా ఈ భారీ శిలలను ఒకదానిపై ఒకటి అమర్చిందని ఇక్కడి జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ కథలు ఇప్పటికీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఆలయాన్ని సందర్శించిన భక్తులు హిడింబి పేర్చిన బండరాళ్లను సందర్శించి కథలను వింటారు. హిడింబి రాళ్లు గాలిలో తేలుతున్నట్లు ఉంటాయి. కేవలం ఓ చిన్న ఆధారంపై నిలబడినట్లు కనిపిస్తాయి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినా... ఎంతటి భారీ గాలులు వీచినా ఈ రాళ్లు చెక్కుచెదరకపోవడం అంతుచిక్కని రహస్యమే.

భక్తుల నమ్మకం

సంతానం లేని దంపతులు ఇక్కడి సిద్ధేశ్వరుడిని దర్శించుకుని మొక్కుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక శక్తులు మేళవించిన మెట్టుగుట్టను దర్శించడం ఒక మరుపురాని అనుభూతి. భక్తితో కొలిచే వారికి ముక్తిని, ప్రకృతి ప్రేమికులకు ఆశ్చర్యకరమైన అనుభూతిని పంచే ఈ క్షేత్రం నిజంగా ఒక ఆధ్యాత్మిక నిధి. వరంగల్‌ను సందర్శించే భక్తులు తప్పకుండా మెట్టుగట్టు క్షేత్రాన్ని తప్పక దర్శించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story