Nag Panchami 2026: నాగపంచమి 2026ః నాగదేవతను ఎప్పుడు పూజించాలి... పూజా సమయం ముహూర్తం వివరాలు ఇవే
ఆగస్టు 17న నాగపంచమి రోజున నాగదేవతను ఎలా ఆరాధించాలి... నాగపంచమి విశిష్టత, సర్పదేవతలను ఆరాధించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Nag Panchami 2026: హిందూ సనాతన సంప్రదాయంలో సర్ప ఆరాధనకు, విశేషించి శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పరమశివుడికి అత్యంత ప్రియమైన శివగణాలుగా, స్వామివారి ఆభరణాలుగా భావించే నాగదేవతలను ఈ రోజున నిష్ఠతో పూజించడం వల్ల జాతకంలోని కాలసర్ప దోషాలు, పితృ దోషాలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. 2026 సంవత్సరంలో ఈ దివ్య పర్వదినం ఆగస్టు 17వ తేదీ సోమవారం నాడు రాబోతోంది.
2026 నాగపంచమి తిథి, శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం శ్రావణ శుక్ల పక్ష పంచమి తిథి ప్రాధాన్యత ఆధారంగా నాగపంచమి పూజను నిర్వహిస్తారు. పంచమి తిథి 2026 ఆగస్టు 16న మధ్యాహ్నం 1.22 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ తిథి 2026 ఆగస్టు 17వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది. కాగా, నాగపంచమిని ఆగస్టు 17వ తేదీ జరుపుకుంటారు. నాగదేవత పూజకు ఆగస్టు 17 ఉదయం 6.46 గంటల నుంచి ఉదయం 9.37 గంటల వరకు అనుకూలంగా ఉన్నది. పూజా సమయం మొత్తం రెండు గంటల 51 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలోపలే నాగపంచమి పూజను పూర్తిచేయాలని పండితులు చెబుతున్నారు.
నాగపంచమి రోజున ఆరాధించవలసిన దేవతలు
నాగపంచమి రోజున నాగ ప్రతిమలకు లేదా పుట్టకు పసుపు, పుష్పాలతో పూజలు చేసి పాలు పోస్తారు. నాగపంచమి రోజున 12 దివ్య నాగ స్వరూపాలను స్మరించుకోవడం లేదా పూజించడం వలన విశేషమైన ఫలితాలు దక్కుతాయి. అనంతుడు, వాసుకి, శేషుడు, కంబళుడు, కర్కోటకుడు, అశ్వతరుడు, ధృతరాష్ట్రుడు, శంఖపాలుడు, కాళియుడు, తక్షకుడు, పింగళుడు వంటి దేవతలను ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక వేత్తల ప్రకారం, ఈ 12 నాగ శక్తులు మన కాలచక్రంలోని 12 మాసాలకు, మానవ శరీరంలోని చైతన్య రహిత శక్తుల సమతుల్యతకు ప్రతీకలుగా నిలుస్తాయి.
నాగపంచమి పూజా ఆధ్యాత్మిక ఫలం
భారతీయ సంస్కృతిలో సర్పం కేవలం భూమిపై నివశించే జీవి మాత్రమే కాదు... సంతాన ప్రాప్తికి, రక్షణకు, భూమి సమృద్ధికి ప్రతీక. ఈ రోజున నాగదేవతలను నిష్ఠతో పూజించి క్షీరాభిషేకం చేయడం వల్ల నాగదోషాల నుంచి విముక్తి లభించి, ఇంట్లో సకల సుఖసంతోషాలు, పరమశివుని పరిపూర్ణ అనుగ్రహం వర్షిస్తాయని పండితులు చెబుతున్నారు.




