Nag Panchami 2026: నాగపంచమి రోజున ఇలా చేసిన వారిదే అదృష్టం... ఒక్కరోజు అక్కడ స్వామి దర్శనం
శ్రావణమాసంలో శుక్లపక్షం పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈరోజున పుట్టలో పాలుపోయడంతో పాటు స్వామివారిని అనేక రీతుల ఆరాధించడం వలన దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Nag Panchami 2026: సనాతన ధర్మంలో పవిత్రమైన శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమి తిథిన జరుపుకునే 'నాగపంచమి' పర్వదినానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. జాతకంలో అత్యంత ఘోరమైన కాలసర్ప దోషం, రాహు-కేతు దోషాలు లేదా నాగ దోషాలతో బాధపడేవారికి ఈ రోజు ఒక దివ్యమైన అవకాశంగా నిలుస్తుంది. పవిత్రమైన ఈ రోజున ఆచరించే చిన్న చిన్న పూజా విధివిధానాలు, పరిహారాలు సమస్త దోషాలను పరిహరించి, జీవితంలో ఐశ్వర్యం, శాంతిని ప్రసాదిస్తాయి. ముఖ్యంగా ఏడాదికి 365 రోజులలో కేవలం నాగపంచమి పర్వదినాన ఒక్క రోజు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరవబడే అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయం.
కాలసర్ప దోష నివారణకు అద్భుత పరిహారాలు
జాతకంలో కాలసర్ప దోషం ఉంటే వివాహ ఆలస్యం, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వంటి అనేక అవరోధాలు ఎదురవుతాయి. నాగపంచమి రోజున క్రింది దివ్య పరిహారాలు చేయడం ద్వారా ఈ బాధల నుండి ఉపశమనం పొందవచ్చు. నాగపంచమి నాడు మహాశివుడిని మనసావాచా ఆరాధిస్తూ మహా మృత్యుంజయ మంత్రాన్ని ఏకాగ్రతతో పఠించాలి. వెండి లేదా రాగితో తయారు చేసిన రెండు నాగ ప్రతిమలను పవిత్ర నదిలో ప్రవహింపజేస్తే నాగ దోషాలు తొలగిపోతాయి. ఉదయం లేదా ప్రదోష సమయంలో రావి చెట్టుకు పవిత్ర జలాన్ని సమర్పించి ఏడు ప్రదక్షిణలు చేయడం ఎంతో పుణ్యప్రదం. పేదలకు నల్లని దుప్పట్లను దానం చేయడం, గోమాతకు గ్రాసం అందించడం వల్ల మృత్యు భయం తొలగి శుభాలు కలుగుతాయి.
పుట్టలో పాలు పోయడం... ఆచారం వెనుక దైవిక సత్యం
నాగపంచమి నాడు పుట్టలో పాలు పోయడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. శతాబ్దాల క్రితం జరిగిన క్షీరసాగర మథనంలో 'వాసుకి' అనే నాగరాజు తాడుగా మారి సముద్ర మథనంలో కీలక పాత్ర పోషించాడు. వ్యవసాయ భూములలో పంటలకు హాని కలిగించే క్రిమి కీటకాలను, ఎలుకలను అదుపు చేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే నాగజాతికి పాలు సమర్పించి కృతజ్ఞతలు తెలపడం మన సంస్కృతిలో భాగం. అంతేకాదు, పాలు స్వచ్ఛతకు ప్రతీక. పరమశివుడి ఆభరణమైన నాగదేవతలకు పాలు సమర్పించడం వల్ల ఆ నీలకంఠుడి కృపాకటాక్షాలు లభిస్తాయి.
శివలింగాభిషేకం....విశిష్ట ఫలితాలు
నాగపంచమి నాడు పరమశివునికి చేసే కొన్ని ప్రత్యేక అభిషేకాలు విభిన్న ఫలితాలను ఇస్తాయి. శివలింగానికి తేనెతో అభిషేకం చేసి నైవేద్యంగా అర్పిస్తే ఆర్థిక కష్టాలు తీరి, విద్యార్థులకు పరీక్షల్లో విజయం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో ఆవుపాలతో అభిషేకించడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. ఉమ్మత్త పువ్వులు, కాయలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అర్పిస్తే కాలసర్ప దోష తీవ్రత తగ్గుతుంది.
ఉజ్జయిని నాగచంద్రేశ్వర ఆలయం ...
మధ్యప్రదేశ్ లోని పవిత్ర ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయ పరిసరాలోని మూడో అంతస్తులో నాగచంద్రేశ్వర స్వామి మందిరం కొలువై ఉంది. ఈ అరుదైన ఆలయాన్ని క్రీస్తు శకం 1050 లో రాజా భోజ్ నిర్మించగా, 1732 లో రనోజి సింధియా పునర్నిర్మించారు. పురాణాల ప్రకారం నాగరాజు తక్షకుడు ఇక్కడ ఘోర తపస్సు చేయగా, పరమశివుడు ప్రసన్నుడై అతనికి అమరత్వాన్ని ప్రసాదించి తన ఆభరణంగా స్వీకరించాడు. ఇక్కడ స్వామివారు 10 పడగల నాగమండపంలో తక్షకునితో కూడి దర్శనమిస్తారు. ఏడాది పొడవునా మూసి ఉండే ఈ ఆలయం కేవలం నాగపంచమి రోజున మాత్రమే 24 గంటల పాటు భక్తుల దర్శనం కోసం తెరుస్తారు. ఈ రోజున శేషనాగ రూపంలో ఉన్న నాగేంద్రస్వామిని, శివలింగాన్ని పంచామృతాలతో, చందనంతో పూజిస్తే సకల పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని నమ్ముతారు.




