Naga Panchami: పెద్దలు చేసిన విధంగా ఆగస్టు 17న నాగపంచమికి ఇలా చేయండి... ఈ దోషాల నుంచి సత్వర విముక్తి పొందండి
ఈ ఏడాది ఆగస్టు 17న వచ్చే నాగపంచమి ఎంతో విశిష్టమైనది. శ్రావణమాసంతో పాటు సోమవారం కూడా కలిసి వచ్చింది. 23 ఏళ్ల తరువాత వచ్చిన ఈ శుభసమయంలో నాగదేవతలను ఆరాధించడం అత్యుత్తమం.
Naga Panchami: సనాతన హైందవ పరంపరలో శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. అందులోనూ శ్రావణ శుక్ల పక్ష పంచమి నాడు జరుపుకునే నాగపంచమి పర్వదినం పితృదోషాలు, కాలసర్ప దోషాలు, సంతాన సమస్యల నుంచి విముక్తిని ప్రసాదించే దివ్యమైన రోజు. ఈ ఏడాది ఆగస్టు 17న రానున్న ఈ పవిత్ర దినాన నాగదేవతలను అర్చిస్తే కుటుంబంలో శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
పూజా ముహూర్తం... విశేషాలు
నాగపంచమి రోజున నాగదేవతల అనుగ్రహం పొందేందుకు సూర్యోదయ కాలంలో పూజ చేయడం అత్యంత శ్రేష్ఠం. ఇక ఆగస్టు 17న ఉదయం 05:51 గంటల నుంచి ఉదయం 08:28 గంటల వరకు మొత్తం 2 గంటల 37 నిమిషాల వ్యవధి పూజకు అత్యంత శుభప్రదమైన సమయం. ఈ రోజున ముఖ్యంగా అనంత, వాసుకి, శేష, పద్మ, కంబళ, కార్కోటక, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళ అనే 12 దివ్య సర్పాలను స్మరిస్తూ పూజించడం వల్ల సకల భయాలు తొలగిపోతాయి.
నాగపంచమి పూజా విధానం ... నియమాలు
నాగపంచమి రోజున తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకుని, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఉపవాస సంకల్పం తీసుకోవాలి. అనంతరం సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి, పరమశివునికి బిల్వపత్రాలతో అర్చించి, గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల సర్పదోష తీవ్రత తగ్గుతుంది. ఆ తరువాత, ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా ఆవుపేడతో లేదా పసుపుతో సర్ప ఆకారాన్ని వర్ణించి, పాలు, పెరుగు, పంచామృతాలతో ప్రక్షాళన చేయాలి. అనంతరం గంధం, కుంకుమ, పుష్పాలు, దర్భలతో అలంకరించి దీపధూపాలు సమర్పించాలి. చివరిగా బియ్యం, పాలు, పండ్లు, పాయసం నైవేద్యంగా నివేదించి, నాగపంచమి కథను శ్రద్ధగా వినాలి. పూజానంతరం 'షోడశోపచార' విధిగా సంపూర్ణం చేసి, యథాశక్తి బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం శ్రేయస్కరం.
మహాకాళేశ్వర్ ఆలయ విచిత్ర రహస్యం
ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ మందిర ప్రాంగణంలోని మూడో అంతస్తులో ఉన్న 'నాగచంద్రేశ్వర ఆలయం' ఏడాది మొత్తంలో కేవలం ఈ నాగపంచమి నాడు మాత్రమే భక్తుల దర్శనం కోసం తెరుచుకుంటుంది. ఆ రోజున స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు ఉజ్జయినీ చేరుకుంటారు. ఇక్కడ నిష్టతో స్వామిని దర్శించుకుంటే నాగదోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయని విశ్వాసం. నాగపంచమి నాడు అత్యంత నిష్ఠతో నాగదేవతలను ఆరాధించి, హారతి సమర్పిస్తే కాలసర్ప దోషాలు, సంతాన లేమి సమస్యలు తొలగిపోయి, నాగదేవతల కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.




