Nagenehalli: పొలిమేర దాటితే మరణిస్తారు...ఆ గ్రామంలో ఉంటే హనుమంతుడే రక్షిస్తాడు...

నాగేనహల్లి గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. వంద ఇళ్లు ఉండే ఈ గ్రామంలో సర్పాలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. పాము కాటేసినా తమకు ఏమీ కాదని ప్రజలు చెబుతుండటం విశేషం.

Balachander
Published on: 25 Aug 2026 8:28 AM IST
Nagenehalli: పొలిమేర దాటితే మరణిస్తారు...ఆ గ్రామంలో ఉంటే హనుమంతుడే రక్షిస్తాడు...
X

Nagenehalli: పాములు కనిపిస్తేనే సాధారణంగా ఎవరికైనా భయంతో ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ఇక పాము కాటు వేస్తే ఆసుపత్రికి పరుగులు తీయడం సహజం. కానీ, కర్ణాటక రాష్ట్రంలోని "నాగేనహళ్లి" గ్రామంలో మాత్రం ఒక అద్భుతమైన, విస్మయపరిచే ఆధ్యాత్మిక వింత నిత్యం కనిపిస్తుంది. ఈ గ్రామంలో మనుషులు, తీవ్రమైన విష సర్పాలు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తాయి. అత్యంత విషపూరితమైన పాములు కాటేసినా సరే, ఆ గ్రామ సరిహద్దుల్లో ఉన్నంత వరకు మనుషులకు ఆ విషం ఎక్కకపోవడం, పొలిమేర దాటి ఆసుపత్రికి వెళ్తే మాత్రం మరణించడం ఇక్కడి అసలు మిస్టరీ. స్థానిక హనుమంతుడి అనుగ్రహం, ఒక సాధువు ఇచ్చిన ఆజ్ఞే ఇందుకు కారణమని భక్తులు బలంగా నమ్ముతారు.

యతీశ్వరుని ఆజ్ఞ

ఈ అద్భుతం వెనుక దశాబ్దాల నాటి ఒక ఆసక్తికరమైన స్థల పురాణం ప్రాచూర్యంలో ఉంది. పూర్వం ఈ గ్రామంలో 'యతీశ్వర' అనే పవిత్ర సాధువు నివసించేవారు. ఆయనకు హనుమాన్ ఆలయ సమీపంలో ఒక అనాథ బాలుడు లభించగా, ఆ బాలుడిని ఎంతో ప్రేమగా 12 ఏళ్ల పాటు పెంచి పెద్ద చేశాడు. ఒకరోజు యతీశ్వర స్వామి భిక్షాటనకు వెళ్లిన సమయంలో ఒక సర్పం కాటు వేయడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోతాడు. తిరిగి వచ్చిన సాధువు తన పెంపుడు కుమారుడి మృతదేహాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి లోనై సర్పజాతి మొత్తానికి శాపం ఇవ్వడానికి సిద్ధపడతాడు.

ఆ సమయంలో పాతాళ లోకం నుండి నాగరాజు ప్రత్యక్షమై సాధువు పాదాలపై పడి క్షమాపణ కోరుతాడు. ఆ బాలుడికి తిరిగి ప్రాణదానం చేస్తాడు. దాంతో శాంతించిన యతీశ్వర స్వామి ఒక నిబంధన విధిస్తారు. ఈ గ్రామంలో ఉన్నంత కాలం ఏ సర్పం కూడా ఇక్కడి ప్రజలకు ప్రాణహాని తలపెట్టకూడదని, ఒకవేళ పొరపాటున కాటేసినా ఆ విషం మనిషి శరీరంపై పనిచేయకూడదని ఆజ్ఞాపిస్తారు. నాగరాజు కూడా ఇందుకు అంగీకరిస్తాడు.

హనుమాన్‌ తీర్థం

ఒకవేళ గ్రామంలో ఎవరికైనా పాము కరిస్తే, వెంటనే కరిచిన పామును పట్టుకుని యతీశ్వర మండపం వద్ద ఉంచుతారు. బాధితుడిని ఊరిలోని హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లి స్వామివారి పవిత్ర తీర్థాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ రాత్రంతా బాధితుడు ఆలయంలోనే జాగరణ చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయానికి హనుమంతుడి దయ వల్ల విషం పూర్తిగా విరిగిపోయి, ఆ వ్యక్తి ఆరోగ్యంగా బయటకు వస్తాడు. ఆధునిక వైద్య విజ్ఞానానికి, సైన్స్‌కు సవాలు విసురుతున్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రం, నమ్మకానికి, దైవిక శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. భయం ఉన్న చోట భక్తి ఉండదని, పరమ భక్తి ఉన్న చోట భయానికి స్థానం లేదని నాగేనహళ్లి గ్రామం నిరూపిస్తోంది.

నాగేనహళ్లి క్షేత్ర నియమాలు

ఈ గ్రామంలో దాదాపు 100 వరకు ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ పాములు స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఎవరికైనా పాటు కరిస్తే 48 గంటలపాటు ఊరి పొలిమేర దాటి పోకూడదు. పొలిమేర దాటితే సైన్స్ కూడా రక్షించలేదని, ప్రాణాలు పోతాయని గ్రామస్తులు చెప్తారు. గ్రామానికి నాలుగు వైపులా సాధువు స్థాపించిన 4 రాతి స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల లోపల ఉన్నంత వరకు సర్ప విషం నిర్వీర్యమవుతుంది. ఇక ఈ గ్రామంలో పాములను చంపడం తీవ్రమైన నేరం. అంతేకాకుండా గ్రామంలో మద్యం తాగడం, మాంసాహారం తీసుకోవడం పూర్తిగా నిషేధం. ఈ నియమాలను గ్రామస్తులు తూచా తప్పకుండా అనుసరిస్తుంటారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story