Nallamala Santhana Gundam: నల్లమలలో అద్భుతమైన సంతాన గుండం...ఇక్కడ స్నానం చేస్తే
పిల్లలు లేని దంపతులకు అపురూపమైన వరంగా మారిన సంతాన గుండం. నల్లమల అడవిలో గుండాల కోనలో ఉన్న ఉన్న ఈ గుండంలో స్నానం చేస్తే గర్భదోషాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది.
Nallamala Santhana Gundam: ప్రతీ స్త్రీ జీవితంలో వివాహంతో పాటు అమ్మా అని పిలిపించుకోవాలనే తపన ఉంటుంది. అమ్మతనం మహిళలకు ఇచ్చిన వరం. అయితే, చాలా మందికి వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగక, నిందలు మోస్తూ మానసిక వేదనను అనుభవిస్తుంటారు. అలాంటి వారికి నల్లమల అడవిలో కొలువైన గుండాల కోన సంతాన గుండం ఓ సంజీవనిలా కనిపిస్తోంది. ఇక్కడ ఈ గుండంలో స్నానం చేస్తే గర్భదోషాలు తొలగిపోయి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాదు, ఇక్కడ కర్కాటేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుంది.
30 అడుగుల జలపాతం... వనమూలికల జలనిధి
ఈ మహిమాన్వితమైన సంతాన గుండం చేరుకోవాలి అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని చిట్వేలి మండలం చేరుకొని అక్కడి నుంచి సుమారు 8 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణం చేయాలి. అడవిలో కొండలు, లోయల గుండా వెళ్లే ఈ ప్రయాణం సాహసంతో కూడుకొని ఉంటుంది. ఇక ఈ గుండానికి చేరుకోగానే ప్రకృతి రమణీయత పరవశింపజేస్తుంది. ఇక్కడి కొండలపై నుంచి ఎత్తైన జలపాతం కిందకు దూకి గుండంలోకి వెళ్తుంది. ఈ నీటికి ఔషధగుణాలు ఉన్నాయని అంటారు. వనమూలికలు, ఔషధ మొక్కలను తాకుతూ నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఈ నీటిలో ఔషధగుణాలుంటాయి.
కర్కటేశ్వర స్వామి క్షేత్ర విశిష్టత... పూజా విధానం
ఈ జలపాతం పక్కనే ఒక చిన్న గుహ ఉంది. అందులో పరమశివుడు "ఎండ్రకాయ" రూపంలో వెలిశాడు. అందుకే ఈయన్ని శ్రీ కర్కటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ సంతానం కోసం వచ్చే దంపతులు ఈ ఆలయంలో కొన్ని నియమాలు పాటించాలి. భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకేసారి ఈ వనమూలికల గుండంలో స్నానం చేయాలి. దీనివల్ల వారి శారీరక, గర్భ దోషాలు తొలగిపోతాయి. స్నానానంతరం గుహ ద్వారం వద్ద స్వామివారికి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. భక్తుల నమ్మకం ప్రకారం, లోపలి నుండి ఎండ్రకాయ బయటకు వచ్చి ఆ నైవేద్యాన్ని ఆస్వాదిస్తే, వారి కోరిక నెరవేరినట్లే. పూజ ముగిసిన తర్వాత, సంతానం కోరుకునే మహిళలు అక్కడ ఉన్న వృక్షాలకు చిన్న చిన్న ఊయలలు కడతారు. ఇలా చేసిన ఏడాదిలోపే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఈ క్షేత్రం దట్టమైన అరణ్యంలో ఉండటం, దీంతో పాటు ఈ ప్రాంతం చిరుతలు తిరిగే అభయారణ్యంలో ఉండటం వలన...ఎవరైనా దారితప్పితే కౄరమృగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా అటవీశాఖ అనుమతి తీసుకొని, స్థానికుల సహాయంతో మాత్రమే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.




