Nandi: కోరిన కోరిక నెరవేరాలంటే...నందీశ్వరుని చెవిలో ఇలా రహస్యంగా చెప్పాలి

శివాలయానికి వెళ్లినప్పుడు నందీశ్వరుని అనుమతి పొంది, నిర్దేశించిన పద్ధతిలో కోరికను విన్నవిస్తేనే అది ఆ భోళాశంకరుడికి నేరుగా చేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

Balachander
Published on: 2 May 2026 2:25 PM IST
Nandi: కోరిన కోరిక నెరవేరాలంటే...నందీశ్వరుని చెవిలో ఇలా రహస్యంగా చెప్పాలి
X

Nandi: శివాలయానికి వెళ్లినప్పుడు నందీశ్వరుని అనుమతి పొంది, నిర్దేశించిన పద్ధతిలో కోరికను విన్నవిస్తేనే అది ఆ భోళాశంకరుడికి నేరుగా చేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శివాలయం అనగానే మనకు ముందుగా స్ఫురణకు వచ్చేది ఆ కైలాసనాథుని వాహనం, ప్రధాన సేవకుడైన నందీశ్వరుడు. ఆలయానికి వెళ్లిన ప్రతి భక్తుడూ నంది చెవిలో ఏదో ఒక రహస్యం చెప్పడం మనం చూస్తుంటాం. అయితే, మనసులోని కోరికను నందీశ్వరుడికి ఎలా నివేదించాలో చాలామందికి తెలియదు. కేవలం ఏదో ఒకటి చెప్పి వచ్చేయడం వల్ల ఫలితం ఉండదు. శాస్త్రోక్తంగా నందికి మీ బాధలను ఎలా చెప్పుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నందిని అనుమతి అడగడం ఎలా?

ఆలయంలోకి వెళ్లగానే నేరుగా నంది చెవిలో కోరిక చెప్పడం సరైన పద్దతి కాదు. ముందుగా నందీశ్వరుడి పృష్ఠభాగాన్ని భక్తితో తాకి మూడుసార్లు "ఓం నమశ్శివాయ" అని జపించాలి. అనంతరం నందీశ్వరుడిని స్మరించుకోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే...శివుడు నిరంతరం ధ్యానముద్రలో ఉంటారు. ఆ ధ్యానానికి భంగం కలగకుండా, మన విన్నపాలను స్వామివారికి సరైన సమయంలో చేరవేయాలంటే అది ఒక్క నందీశ్వరుడికే సాధ్యం. అందుకే శివుడి పంచాక్షరిని జపించి, నందీశ్వరుడిని స్మరించుకొని ఆయన అనుమతి తీసుకోవాలి.

రహస్య విన్నపం - పాటించాల్సిన నియమాలు

నందీశ్వరుడికి కోరికలను విన్నవించుకునే సమయంలో మూడు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మనం చెప్పాలనుకున్న కోరిక ఆయన ఎడమచెవిలోనే చెప్పాలి. ఇది ప్రాచీన సంప్రదాయం. మీ కుడిచేతిని నోటికి అడ్డుగా పెట్టుకోవాలి. మన నోటి నుంచి వచ్చే గాలి లేదా శబ్దం బయటకు వెళ్లకుండా నేరుగా నందీశ్వరునికి మాత్రమే వినిపించేలా ఉండాలి. మూడో రహస్యమేమంటే...మీ కోరిక ఇతరులు ఎవ్వరూ వినకూడదు. బయటకు చెప్పకూడదు. మాటలు నేరుగా నందీశ్వరుని అంతరాత్మను చేరాలి. అలా చేరడం అన్నది మన భక్తిమీద ఆధారపడి ఉంటుంది. మన కోరిక నందీశ్వరుని అంతరాత్మను చేరింది అంటే ఆ శివయ్యకు చేరినట్టే. అప్పుడు మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది.

ఎందుకు ఈ పద్ధతి?

భగవంతుడు భావప్రియుడు. మనం ఎంత ఆడంబరంగా చెప్పామన్నది కాదు, ఎంత భక్తితో చెప్పామన్నదే ముఖ్యం. అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు లేదా కుటుంబ కలహాలు.. ఏవైనా సరే, పూర్తి నమ్మకంతో ఈ పద్ధతిలో నివేదిస్తే ఆ భోళాశంకరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. భక్తికి సరైన ఆచరణ తోడైనప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఈసారి శివాలయానికి వెళ్లినప్పుడు, ఈ చిన్న రహస్యాన్ని పాటించి చూడండి. మీ మనసులోని భారమంతా దిగిపోయి, జీవితంలో శుభ పరిణామాలు ప్రారంభమవ్వడం గమనిస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా...నందీశ్వరుడి చెవిలో మన కోరికను ఎంత రహస్యంగా చెప్పాలో.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story