Navagraha Pradakshina: నవగ్రహాల ప్రదక్షిణ...మన పూర్వీకులు చెప్పిన విధంగా చేస్తేనే ఫలితం
ఆలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తుంటాం. కానీ, ఈ ప్రదక్షిణ మన పూర్వీకులు చెప్పిన విధంగా, శాస్త్రాలు నిర్దేశించిన విధంగా ఉండాలి. మరి ఆ నియమాలేంటో తెలుసుకుందాం.
Navagraha Pradakshina: మనిషి జీవితంలో సుఖదుఃఖాలు సర్వసాధారణం. సుఖం కలిగినపుడు సంతోషంగా ఉంటాం. అదే కష్టం ఎదురైనపుడు నిరాశ చెందుతాం. అయితే, వరసగా కష్టాలు, మానసిక అశాంతి ఎదురౌతుంటే గ్రహదోషాలు ఉన్నట్టుగా చెబుతారు. దీనికోసం ఆలయాల్లోని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలని పెద్దలు చెబుతారు. కానీ, ఈ ప్రదక్షిణలు చేసే విధానం శాస్త్రాలు నిర్దేశించిన విధంగా ఉంటాయి. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా చేస్తే ఎలాంటి ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. నవగ్రహాల చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసినపుడు గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, నవగ్రహాల ఆలయంలోకి ప్రవేశం సూర్యుడి అభిముఖంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
ప్రదక్షిణ సంఖ్య ... పాటించవలసిన నియమాలు
నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసును భగవంతునిపై లగ్నం చేయాలి. శాస్త్రం ప్రకారం ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎలా చేయాలి అనేదానికి ఒక పద్ధతి ఉంది. నవగ్రహాల చుట్టూ మొత్తం 9 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ఒకవేళ ప్రత్యేకంగా రాహు-కేతు దోషాలు ఉన్నవారు వాటి నివారణ కోసం మరో రెండు ప్రదక్షిణలు కలిపి మొత్తం 11 ప్రదక్షిణలు పూర్తి చేయాలి. సమయం లేనివారు కనీసం మూడు ప్రదక్షిణలైనా చేయాలని పండితులు చెబుతున్నారు. ఇక, సూర్యుడికి అభిముఖంగా లోనికి ప్రవేశించి చంద్రుడి వైపు నుండి, అంటే ఎడమ వైపు నుండి మొదలుపెట్టి కుడి వైపుకు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేస్తున్నంత సేపూ "ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః" అనే నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి. వీలైతే ప్రతి గ్రహం ముందు క్షణం ఆగి ఆయా గ్రహ మంత్రాన్ని స్మరించడం విశేష ఫలితాన్నిస్తుంది.
ప్రదక్షిణ తర్వాత చేయకూడని తప్పులు ఇవే!
సాధారణంగా నవగ్రహాలు శివాలయాల ఈశాన్య మూలలో కొలువై ఉంటాయి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత చాలామంది చేసే అతిపెద్ద తప్పు... విగ్రహాలను తాకడం. నవగ్రహ రూపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులతో తాకరాదు. అలాగే, ప్రదక్షిణ ముగిసిన వెంటనే ఆ గ్రహాలకు వీపు చూపకుండా, భయభక్తులతో కొద్దిగా వెనుకకు నడుస్తూ బయటకు రావాలి. అన్నింటికంటే ముఖ్యమైన నియమం ఏమిటంటే... నవగ్రహ ప్రదక్షిణ అయిపోయాక చాలామంది కాళ్లు కడుక్కుంటుంటారు, అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ గ్రహాల నుండి వెలువడే కిరణాల సానుకూల శక్తి మన శరీరంపై ఉంటుంది. ప్రదక్షిణ అనంతరం నేరుగా వెళ్లి ఆలయంలోని మహాదేవుడిని దర్శించుకుంటే సర్వగ్రహ దోషాలు పటాపంచలవుతాయి.




