October 2026 Festivals: అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు...శుభ ముహూర్త సమయాలు ఇవే
అక్టోబర్ 2026 పండుగలు, వ్రతాలు, నవరాత్రులు, దసరా తేదీలతో పాటు వాహనం, ఆస్తి, నామకరణం, వ్యాపార ప్రారంభానికి శుభ ముహూర్తాలు, ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలను తెలుసుకుందాం.
October 2026 Festivals: అక్టోబర్ 2026 అంటే పండుగల సందడి మొదలయ్యే నెల. ముఖ్యంగా దసరా, నవరాత్రుల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. పూజలు, వ్రతాలు, దేవాలయ దర్శనాలతో పాటు కొత్త పనులు ప్రారంభించేందుకు శుభ సమయాలను చూసుకునే వారు కూడా ఈ నెల క్యాలెండర్‌పై ఆసక్తి చూపుతారు.
అక్టోబర్‌లో పండుగలు
నెల ప్రారంభంలోనే అక్టోబర్ 2న గాంధీ జయంతి వస్తుంది. అక్టోబర్ 3న కాలాష్టమి, మహాలక్ష్మీ వ్రతం ముగింపు వంటి ఆధ్యాత్మిక సందర్భాలు ఉన్నాయి. అక్టోబర్ 6న ఇందిరా ఏకాదశి, 7న మాఘ శ్రాద్ధం, 8న మాసిక శివరాత్రి, ప్రదోష వ్రతం జరగనున్నాయి. అక్టోబర్ 10న అమావాస్యతో మహాలయ పితృపక్షం ముగుస్తుంది. పెద్దలకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు నిర్వహించే వారికి ఈ రోజు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాతి రోజైన అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇదే రోజున చంద్రదర్శనం, అగ్రసేన జయంతి, శరదృతువు ప్రారంభం కూడా ఉన్నాయి.
నవరాత్రుల్లో రోజులు గడిచే కొద్దీ పండుగ వాతావరణం మరింత పెరుగుతుంది. అక్టోబర్ 14న వరద చతుర్థి, 15న లలిత పంచమి, 16న షష్ఠి, సరస్వతి ఆవాహనం ఉంటాయి. అక్టోబర్ 17న దుర్గా పూజ, సరస్వతి పూజతో పాటు తులా సంక్రాంతి వస్తుంది. అక్టోబర్ 18న సరస్వతి బలిదానం, 19న సరస్వతి విసర్జన, దుర్గాష్టమి వ్రతం, మహానవమి నిర్వహిస్తారు. ఆ తర్వాత వచ్చే విజయదశమి దసరా పండుగకు ముగింపు వేడుకగా నిలుస్తుంది. అయితే, కొన్ని సంప్రదాయాల ప్రకారం అక్టోబర్ 21న విజయ దశమి జరుపుకుంటారు. ఇక అక్టోబర్ 22న భారత్ మిలాప్, పాపాంకుశ ఏకాదశి, 23న ప్రదోష వ్రతం ఉన్నాయి. నెల చివరి వారంలో అక్టోబర్ 25న శరద్ పౌర్ణమి, కాజాగ్ర పూజ, సత్య వ్రతం, 26న కార్తీక స్నానం ప్రారంభం అవుతుంది. అదే రోజున వాల్మీకి జయంతి, పౌర్ణమి వస్తాయి. అక్టోబర్ 29న రోహిణి వ్రతం, సంకష్టి గణేశ్ చతుర్థి, 30న కర్వా చౌత్ ఉన్నాయి.
వాహనం కొనాలనుకుంటున్నారా?
అక్టోబర్‌లో కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకునేవారికి 21, 22, 25, 28, 30 తేదీలు శుభ ముహూర్తాలుగా చెప్పవచ్చు. సంప్రదాయం ప్రకారం వాహనాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందు శుభ సమయాన్ని చూసుకోవడం ఆనవాయితీ.
ఇంటి స్థలం కొనుగోలుకు..
కొత్త ఇల్లు, స్థలం లేదా ప్రాపర్టీ కొనుగోలు చేసే వారికి 12, 13, 19, 20, 26, 27 తేదీలు అనుకూలమైన రోజులుగా పేర్కొన్నారు. అయితే రిజిస్ట్రేషన్, ఒప్పందం వంటి ముఖ్యమైన పనులకు స్థానిక పంచాంగం ప్రకారం ఖచ్చితమైన ముహూర్తాన్ని పరిశీలించడం మంచిది.
వివాహం, గృహప్రవేశం విషయానికి వస్తే..
అక్టోబర్ 2026లో వివాహానికి అనుకూలమైన శుభ ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. వివాహాలతో పాటు గృహప్రవేశాలకు కూడా అనుకూలమైన తేదీలు లేవని పెద్దలు చెబుతున్నారు. అక్టోబర్ 10 వరకు పితృపక్షాలు, నవంబర్ వరకు చాతుర్మాస్యం ఉండటంతో గృహప్రవేశాలకు అనుకూలమైన ముహూర్తాలు లేవు.
నామకరణం, వ్యాపార ప్రారంభం
పిల్లల నామకరణానికి 2, 6, 10, 14, 18, 22, 26 తేదీలు శుభ దినాలుగా ఇచ్చారు. కొత్త వ్యాపారం ప్రారంభించేవారికి అక్టోబర్‌లో పలు అనుకూల తేదీలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇక, ముఖ్యంగా 17, 18, 29 తేదీలను వ్యాపార ప్రారంభానికి అనుకూలమైన తేదీలుగా చెబుతారు. మొత్తంగా చూస్తే అక్టోబర్ 2026లో పండుగలు, వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వాహనం, ఆస్తి, నామకరణం, వ్యాపార ప్రారంభం వంటి ముఖ్యమైన పనులకు సంబంధించిన ముహూర్తాలపై కూడా ఆసక్తి ఉంటుంది. ఏ శుభకార్యమైనా తేదీ మాత్రమే కాకుండా ప్రాంతం, తిథి, నక్షత్రం, కుటుంబ ఆచారం ఆధారంగా ఖచ్చితమైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం సంప్రదాయంగా పాటిస్తారు.




