Badrinath: చార్‌ధామ్‌ యాత్ర చేస్తున్నారా... ఒక్క తులసి ఆకునైనా ఇలా సమర్పించండి... జీవితంలో తిరుగుండదు

చార్‌ధామ్‌ యాత్ర చేసేవారు తమ వెంట తప్పనిసరిగా తులసి దళాలను తీసుకెళ్లాలి. బదరీనాథ్‌లో ఇలా తులసీదళాలు సమర్పిస్తే...సమస్త దోషాలు తొలగిపోతాయి.

Balachander
Published on: 4 Jun 2026 8:42 AM IST
Badrinath: చార్‌ధామ్‌ యాత్ర చేస్తున్నారా... ఒక్క తులసి ఆకునైనా ఇలా సమర్పించండి... జీవితంలో తిరుగుండదు
X

Badrinath: ఇప్పటికే చార్‌ధామ్‌ యాత్ర మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్‌, బదరీనాథ్‌లను దర్శించుకుంటున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో ఈ వరసలోనే ఆలయాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే, ఈ యాత్రలో అత్యంత ముఖ్యమైనది బదరీనాథ్‌. ఇక్కడే నరనారాయణులు కొలువై ఉంటారు. బదరీనాథుడిని సందర్శించే భక్తులు తమ వెంట తప్పనిసరిగా తులసి ఆకులను తీసుకొని వెళ్లాలని చెబుతారు. స్వామివారికి మీరు ఎన్ని రకాలైన పూజలు చేయించినా... ఎన్ని రకాలైన సుగంధ పరిమళభరితమైన పుష్పాలు సమర్పించినా...తులసి లేకుంటే ఆ పూజ నిరుపయోగమే. ఏమీ ఇవ్వకపోయినా తులసీదళాన్ని స్వామివారికి సమర్పిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. జీవితంలో ఏ లోటు లేకుండా చూసుకుంటాడని చెబుతారు.

మహాశివుడు...నరనారాయణులు

ఒకప్పుడు ఈ బదరీ పర్వత ప్రాంతంలో మహాశివుడు కొలువై ఉండేవాడు. పార్వతీదేవితో కలిసి ఈ ప్రాంతంలో ఏకాంతంగా గడిపేవారని చెబుతారు. అయితే, ఓసారి బాలుడి రూపంలో ఉన్న శ్రీహరిని చూసి పార్వతీదేవి దగ్గరకు తీసుకొని ముద్దు చేస్తుంది. అప్పటి నుంచి ఆ బాలుడు అక్కడే ఉండేందుకు ఆసక్తి చూపుతాడు. పార్వతీదేవి కూడా బాలుడితో ఆటలాడుతూ ఉంటుంది. అయితే, దీనిని గమనించిన మహాశివుడు బాలుడు రూపంలో వచ్చింది ఆ నారాయణుడేనని గుర్తించి బాలుడికి ఇష్టమైన బదరీప్రాంతంలోనే ఉండమని అనుగ్రహించి మహాశివుడు అంతకంటే ఎత్తైన కేదార్నాథ్‌కు వెళ్లిపోతాడు. ఆ విధంగా నరుడి రూపంలో వచ్చిన నారాయణుడి గుర్తుగా ఈ క్షేత్రంలో నరనారాయణులను పూజిస్తారు.

తులసిదళం సమర్పణ

ఆగమశాస్త్రం ప్రకారం వైష్ణవ పూజలో తులసీదళం తప్పనిసరిగా వినియోగించాలి. తులసి లేని పూజ నిరుపయోగమని చెబుతారు. తులాభారంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తులసీదళం వేయగానే తూగిపోతాడు. తులసి మహిమ అలాంటిది. తులసిని శ్రీమహావిష్ణువు కుమార్తెగా కూడా చెబుతారు. చార్‌ధామ్‌ యాత్రలో తులసికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్‌ ఆలయాలను సందర్శించే సమయంలో తులసిని తీసుకెళ్లకున్నా... బదరీనాథ్‌ క్షేత్రాన్ని దర్శించుకునేవారు తప్పకుండా తులసీదళం తీసుకొని వెళ్లాలి. ఇలా తులసిని సమర్పిస్తే యాత్రలో ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఆయన మనల్ని ఇంటికి చేరుస్తాడు. సంసారసాగరాన్ని ఈదేందుకు కావలసిన శక్తిని సమకూరుస్తాడు. కష్టాల్లో ఏదో రూపంలో తోడుంటాడు. మనం ఇంట్లో నిర్వహించే నిత్యపూజలో తులసీదళాన్ని వినియోగించలేకపోయినా...ఒక్కసారైనా బదరీనాథ్‌ను సందర్శించి స్వామివారికి తులసిని సమర్పిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story