Palani: సంతానాన్ని ప్రసాదించే సుబ్రహ్మణ్యుడి కావడి ఉత్సవం...పళనిలో చూసి తీరాల్సిందే
సుబ్రహ్మణ్యుడు అంటే గుర్తుకు వచ్చేది పళని. సంతానంలేని దంపతులకు ఈ క్షేత్రం అద్భుతమైన వరాలను ఇస్తుంది. కావడి సమర్పిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.
Palani: తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో కొలువైన పళని పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్యస్వామి ఆరు పవిత్ర పడైవీడులలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఇక్కడ స్వామివారిని దర్శించి, భక్తిశ్రద్ధలతో 'కావడి' మోస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, సకల కోరికలు ఈడేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
పళని ధామం ... పురాతన నవపాషాణ మూర్తి విశేషాలు
పళని కొండపై వెలసిన బాలసుబ్రహ్మణ్యుని మూలవిరాట్టు అత్యంత అరుదైనది, మహిమాన్వితమైనది. క్రీస్తుపూర్వం 3,000 సంవత్సరాల క్రితం సిద్ధ భోగర్ మహర్షి నవపాషాణాలు అత్యద్భుతంగా సమ్మేళనం చేసి ఈ దివ్య విగ్రహాన్ని నిర్మించారు. అయితే, కాలక్రమేణా ఆదరణ కోల్పోయిన ఈ నవపాషాణ మూర్తిని తమిళ రాజు చేరమాన్ పెరుమాళ్ గుర్తించి, పళని కొండపై పునఃప్రతిష్ఠించారు. ఇక, ఇక్కడ స్వామివారు దాదాపు 10 ఏళ్ల పదేళ్ల బాలుడిగా, కేవలం కౌపీనం ధరించి, చేతిలో జ్ఞానదండంతో దర్శనమిస్తారు. భౌతిక సుఖాలను త్యజించి నన్ను శరణు వేడితే ముక్తి లభిస్తుంది అనే వేదాంత సత్యాన్ని ఈ రూపం మనకు ప్రబోధిస్తుంది. బాలుడి రూపంలో దర్శనమిస్తే పళని సుబ్రహ్మణ్యుడిని దర్శించుకుంటే ఈతిబాధలు తొలగిపోతాయని నమ్ముతారు.
16 గంటల దివ్య దర్శనం ... పవిత్ర పంచామృతం
పళని కొండపై భక్తుల కోసం స్వామివారు రోజుకు 16 గంటల పాటు సుదీర్ఘంగా దర్శనభాగ్యం కల్పిస్తారు. ఇక్కడ స్వామివారి నవపాషాణ మూర్తికి నిత్యం ఆవు పాలు, నెయ్యి, తేనె, అరటిపళ్ళు, కలకండలతో పంచామృత అభిషేకం చేస్తారు. నవపాషాణాల మూలికా స్పర్శ వల్ల ఈ పంచామృతం అమృతంతో సమానమైన ఔషధ గుణాలను పొందుతుంది. దీనిని స్వీకరిస్తే సకల రోగాలు నయమవుతాయి. కొన్ని వందల సంవత్సరాలుగా స్వామివారికి ఇలాంటి పంచామృతంతో అభిషేకం చేస్తున్నారు. ఈ దివ్యమైన ప్రసాదం కోసమే భక్తులు పళని కొండకు వస్తారు.
సంతాన ప్రాప్తినిచ్చే కావడి ఉత్సవం
పళనిలో నిర్వహించే ఉత్సవాలలో 'కావడి ఉత్సవం' అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు తమ భుజాలపై సుబ్రహ్మణ్యుని కావడి మోస్తూ, నామస్మరణ చేస్తూ కొండపైకి చేరుకుంటారు. ముఖ్యంగా పుష్యమాసంలోనూ, అదేవిధంగా ఆషాఢంలోనూ ఇక్కడ కావడి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. లక్షలాదిమంది భక్తులు కొండకు చేరుకొని స్వామికి కావడి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు, వైకాశి, అగ్ని నక్షత్రం రోజున కూడా విశేషమైన పూజలు, అలంకారాలు జరుగుతాయి. సంతానంలేని దంపతులు నియమనిష్టలతో పళని వచ్చి, స్వామివారిని దర్శించుకొని కావడి సమర్పిస్తే, ఆ స్వామివారి దివ్యానుగ్రహంతో సంతానం కలుగుతుందని క్షేత్ర పురాణం చెబుతోంది.




