Palani Subramanya Swamy: పళని సుబ్రహ్మణుడి రహస్యం.. స్వామివారి విగ్రహం అంతా ఔషదమే

Palani Subramanya Swamy: సుబ్రహ్మణ్యస్వామి అంటే మనకు గుర్తుకు వచ్చేది తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో వెలసిన పళని సుబ్రహ్మణ్యుడు.

Balachander
Published on: 15 April 2026 7:58 AM IST
Palani Subramanya Swamy
X

Palani Subramanya Swamy: పళని సుబ్రహ్మణుడి రహస్యం.. స్వామివారి విగ్రహం అంతా ఔషదమే

Palani Subramanya Swamy Mystery: సుబ్రహ్మణ్యస్వామి అంటే మనకు గుర్తుకు వచ్చేది తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో వెలసిన పళని సుబ్రహ్మణ్యుడు. ఈ దండాయుధపాణి క్షేత్రం కేవలం భక్తికి నిలయం మాత్రమే కాదు, అది ఒక అద్భుత వైద్య రహస్యం కూడా. సుబ్రహ్మణ్య స్వామి ఆరు దివ్య క్షేత్రాలలో పళని అత్యంత విశిష్టమైనది. ఇక్కడి విగ్రహం రాతితో చేసినది కాదు, నవపాషాణాలతో రూపుదిద్దుకున్న ఒక అపురూప ఔషధ గని.

సిద్ధ భోగర్ సృష్టించిన అద్భుతం

సుమారు 5,000 ఏళ్ల క్రితం, సిద్ధ పురుషుడైన భోగర్ తన యోగశక్తితో తొమ్మిది రకాల విషపూరిత మూలికలను కలిపి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. సామాన్యంగా విషం ప్రాణాలు తీస్తుంది, కానీ సిద్ధుల పరిభాషలో ఈ తొమ్మిది పాషాణాలను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి కలిపితే, అది మృత్యుంజయ ఔషధంగా మారుతుంది. పూర్వం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తే వారికి స్వామివారి తొడ భాగం నుంచి ఔషధాన్ని తీసి ఇచ్చేవారు. ఎన్నోరకాలైన జబ్బుల నుంచి ఈ నవపాషాణం విముక్తి కల్గించేది. దీంతో తొడభాగం కొంతమేర అరిగిపోవడంతో అప్పటి నుంచి నవపాషాణం నేరుగా ఇవ్వడం నిలిపివేశారు.

అభిషేకమే అమృతం

పళని దర్శనం అంత సామాన్యమైనది కాదు. అందరికీ ఆయన అనుమతించడు. స్వామివారి అనుజ్ఞతోనే పళని వెళ్తుంటారు. ఇక పళనిలో స్వామివారు 16 గంటల పాటు భక్తులకు ఇస్తుంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, స్వామివారి విగ్రహానికి చేసే పంచామృత అభిషేకం. పాలు, నెయ్యి, తేనె, అరటిపండు, బెల్లంతో చేసే ఈ అభిషేక ద్రవ్యాలు విగ్రహాన్ని తాకినప్పుడు, ఆ నవపాషాణాలలోని ఔషధ గుణాలు ఆ ద్రవంలో కలుస్తాయి. అందుకే ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే మొండి వ్యాధులు సైతం నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

రూపం వెనుక ఉన్న సందేశం

ఇక్కడ స్వామివారు పదేళ్ల బాలుడిగా, తలపై జుట్టు లేకుండా, కేవలం కౌపీనం మాత్రమే ధరించి, చేతిలో దండం పట్టుకుని దర్శనమిస్తారు. ఈ రూపం వెనుక ఓ మర్మం దాగుంది. అన్నీ వదిలేసి, నిష్కల్మషమైన మనసుతో నా దగ్గరకు రా... నీ భారమంతా నేను మోస్తాను అన్నట్టుగా ఉంటారు. ఇది ఓ విధంగా వైరాగ్యాన్ని అందించడమే. అగ్ని నక్షత్రం, తైపూసం వంటి ఉత్సవాల సమయంలో లక్షలాదిమంది భక్తులు కావడి మోస్తూ పళనికి వస్తారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ సమయంలో పళనిలో ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఉంటారు.

చాలా కాలం క్రితం ఈ విగ్రహం నిర్లక్ష్యానికి గురై పొదల్లో కలిసిపోయింది. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించే చేరమాన్‌ అనే రాజుకు స్వామివారు కలలో కనిపించి ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించడంతో, ఆ రాజు ఆలయాన్ని పునరుద్దరించారు. ఇక్కడ విశేషం ఏమంటే ఎన్నో వందల సంవత్సరాలుగా ఇక్కడి దండాయుధపాణికి అభిషేకం చేస్తూనే ఉన్నారు. ఎన్నివేల లీటర్ల అభిషేక ద్రవ్యాలు పోస్తున్నా నవపాషాణ విగ్రహం సుమంతైనా అరిగిపోలేదు. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే శరీరానికి నూతన శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story