Papankusha Ekadashi: పాపాంకుశ ఏకాదశి విశిష్టత...ఆరోజున ఏం చేయాలంటే

పాపాంకుశ ఏకాదశి 2026 అక్టోబర్ 22న జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు విశిష్టత, వ్రత కథ, పూజా విధానం, విష్ణుమూర్తి మంత్రాలు, ఉపవాస నియమాలు, పారణ సమయం గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 15 Oct 2026 9:44 AM IST
Papankusha Ekadashi: పాపాంకుశ ఏకాదశి విశిష్టత...ఆరోజున ఏం చేయాలంటే
X

Papankusha Ekadashi: మనిషి చేసిన తప్పులను తెలుసుకుని, మంచిమార్గంలో నడవాలని నిర్ణయించుకోవడానికి వయసుతో సంబంధం లేదు. మార్పు కోరుకునే మనసే అందుకు మొదటి అడుగు. ఈ సత్యాన్ని చాటిచెప్పే పర్వదినమే పాపాంకుశ ఏకాదశి. ఆశ్వయుజ మాస శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పద్మనాభ స్వామి రూపంలో ఆరాధిస్తారు. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి లభించి, మనశ్శాంతి కలుగుతుందని హిందూ సంప్రదాయంలో విశ్వసిస్తారు. 2026లో పాపాంకుశ ఏకాదశి అక్టోబర్ 22, గురువారం నాడు జరుపుకుంటారు.

పాపాంకుశ ఏకాదశి ఎప్పుడు?

ఆశ్వయుజ మాస శుక్లపక్ష ఏకాదశి తిథికి పాపాంకుశ ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం, ఉపవాసం ఉండటం, నామస్మరణ చేయడం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. 2026 పాపాంకుశ ఏకాదశి తిథి వివరాలు ఇవి. ఏకాదశి తిథి ప్రారంభమౌతుంది. అక్టోబర్ 21, మధ్యాహ్నం 2:11 గంటలకు కొనసాగుతుంది. ఇక అక్టోబర్‌ 22 మధ్యాహ్నం 2.47 గంటలకు తిథి ముగుస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని అక్టోబర్‌ 22 గురువారంనాడు ఆచరిస్తారు. ఇక వ్రతం ఆచరించిన వారికి పారణ సమయం అక్టోబర్ 23న ఉదయం 6:27 నుంచి 10:12 గంటల మధ్యగా సూచించబడింది. ఖచ్చితమైన సమయం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు తమ ప్రాంతంలోని పంచాంగాన్ని పరిశీలించి పారణ సమయాన్ని నిర్ధారించుకోవాలి.

పాపాంకుశ ఏకాదశి వ్రత కథ

పురాణ సంప్రదాయం ప్రకారం, ఒకసారి పాండవుల్లో ధర్మరాజైన యుధిష్ఠిరుడు ఆశ్వయుజ శుక్లపక్ష ఏకాదశి మహిమను వివరించమని శ్రీకృష్ణుడిని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ వ్రతం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక కథను వివరించినట్లు చెబుతారు. వింధ్య పర్వత ప్రాంతంలో ఒక వేటగాడు నివసించేవాడు. అతడు తన జీవితమంతా హింస, దోపిడీ వంటి చెడు పనులకు పాల్పడుతూ గడిపాడు. ఇతర జీవుల పట్ల దయ చూపకుండా తనకు తోచిన విధంగా ప్రవర్తించేవాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అతడి జీవితానికి చివరి ఘడియలు సమీపించాయి. యమదూతలు తనను తీసుకెళ్లడానికి వస్తారని తెలుసుకున్న వేటగాడు భయంతో వణికిపోయాడు. తాను చేసిన పనులన్నీ గుర్తుకొచ్చాయి. జీవితమంతా తప్పులు చేస్తూ గడిపిన తనకు మరణం తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన చెందాడు. అతడి పరిస్థితిని గమనించిన అంగీరస మహర్షి కరుణతో ముందుకు వచ్చారు. తన జీవితంలో ఎన్నో పాపాలు చేశానని, వాటి నుంచి బయటపడే మార్గం చూపించాలని వేటగాడు మహర్షిని వేడుకున్నాడు.

అప్పుడు అంగీరసుడు ఆశ్వయుజ శుక్లపక్షంలో వచ్చే పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించాలని సూచించినట్లు కథనం చెబుతుంది. మహర్షి చెప్పిన విధంగా వేటగాడు వ్రతాన్ని ఆచరించి, శ్రీహరిని ప్రార్థించాడు. ఈ వ్రత ప్రభావంతో అతడికి పాపవిముక్తి, మోక్షం లభించాయని పురాణ విశ్వాసం. ఈ కథ చెప్పే సందేశం స్పష్టమైనది. గతంలో తప్పులు చేసినా, వాటిని గుర్తించి పశ్చాత్తాపంతో మంచిమార్గంలో నడవడానికి ప్రయత్నించడం ముఖ్యం.

పాపాంకుశ ఏకాదశి రోజున ఏం చేయాలి?

ఈ పర్వదినాన ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లోని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. శ్రీమహావిష్ణువు చిత్రపటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి పూజించాలి. సంప్రదాయం ప్రకారం నీటితో అభిషేకం చేసి, వీలుంటే పంచామృతంతో అభిషేకం నిర్వహించవచ్చు. తులసి దళాలను సమర్పించి, విష్ణు సహస్రనామం లేదా ఏకాదశి వ్రత కథను చదవడం మంచిది. ఉపవాసం ఉండగలిగేవారు తమ ఆరోగ్యానికి తగిన విధంగా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కఠిన ఉపవాసానికి బదులుగా భక్తితో ప్రార్థన చేయవచ్చు. సాయంత్రం శ్రీమహావిష్ణువుకు హారతి ఇచ్చి, తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకోవాలి. మరుసటి రోజు పంచాంగం ప్రకారం పారణ చేయాలి.

పఠించాల్సిన విష్ణు మంత్రాలు

పాపాంకుశ ఏకాదశి రోజున శ్రీహరిని స్మరిస్తూ ఈ మంత్రాలను జపించవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం విష్ణవే నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మీ నారాయణాయ నమః అని స్వామివారి నామస్మరణ చేయవచ్చు. ఏదైనా ఒక నామాన్ని తీసుకొని స్మరించడం మంచిది.

పాపాంకుశ ఏకాదశి ఆధ్యాత్మిక సందేశం

పాపాంకుశ ఏకాదశి కేవలం ఉపవాసానికి సంబంధించిన పర్వదినం మాత్రమే కాదు. మన ప్రవర్తనను సమీక్షించుకుని, ఇతరులకు హాని కలిగించే పనులకు దూరంగా ఉండాలని గుర్తుచేసే సందర్భం కూడా. దయ, నిజాయతీ, క్షమాగుణం, సేవాభావం వంటి విలువలను జీవితంలో పాటించడం ద్వారా ఈ పర్వదిన సందేశాన్ని ఆచరణలో పెట్టవచ్చు. మహావిష్ణువుపై విశ్వాసంతో పాటు మంచి పనులు చేయాలనే సంకల్పం కలిగి ఉండటమే ఈ వ్రతంలోని అంతరార్థం. భక్తిశ్రద్ధలతో పాపాంకుశ ఏకాదశిని ఆచరించి, కుటుంబంలో శాంతి, జీవితంలో సత్ప్రవర్తన కలగాలని పద్మనాభ స్వామిని ప్రార్థిస్తారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.