Tiger and Deer: మన ఆలోచనలను పూర్తిగా మార్చేసే చిన్న కథ...ఈ రెండింటిలో మీరెవరో నిర్ణయించుకోండి

సకారాత్మక, నకారాత్మక శక్తులు మనిషిని ఏ విధంగా నడిపిస్తాడో జింక పులి కథ స్పష్టం చేస్తోంది.

Balachander
Published on: 27 May 2026 10:11 AM IST
Tiger and Deer: మన ఆలోచనలను పూర్తిగా మార్చేసే చిన్న కథ...ఈ రెండింటిలో మీరెవరో నిర్ణయించుకోండి
X

Tiger and Deer: పురాణాలు, ఉపనిషత్తుల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి. అందులో ఒకటి యద్బావం తద్భవతి.. అంటే మన ఆలోనలే మనల్ని సృష్టిస్తాయి...నియంత్రిస్తాయి అని. ప్రతి మనిషిలోనూ రెండు రకాలైన శక్తులు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. అందులో ఒకటి సకారాత్మకశక్తి...రెండోది నకారాత్మక శక్తి. ఈ రెండింటిలో దేనిని మనం ప్రోత్సహిస్తే అది మన జీవితాన్ని శాసిస్తుంది. దీనిని జింక పులి కథ ద్వారా తెలుసుకుందాం.

జింకదే పైచేయి... కానీ విజయం పులిదే ఎందుకు?

ప్రకృతి సృష్టిలో ప్రతి ప్రాణికి నిర్ధిష్టమైన వేగం ఉంటుంది. ఇందులో అడవుల్లో నివశించే జింకలకు వేగం ఎక్కువ. జింక సరాసరి గంటలకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. కానీ, పులి గంటకు కేవలం 60 కిలోమీటర్ల వేగంతోనే పరిగెత్తగలదు. అదీ కొంతదూరం వరకు మాత్రమే. పులికంటే జింక 20 కిలోమీటర్ల వేగం ఎక్కువ. ఇలా చూసుకుంటే జింకను పులి ఎన్నటికీ పట్టుకోలేదు. కానీ, నిజజీవితంలో సుమారు 90 శాతం జింకలు పులికి ఆహారంగా మారుతుంటాయి. దీనికి కారణం వాటి మానసిక బలహీనత.

జింక పరిగెడుతున్నప్పుడు, దాని మనస్సులో భయం అనే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. వెనుక వస్తున్న పులి నన్ను పట్టుకుంటుందేమో, అది ఎంత దూరంలో ఉంది? అని పదే పదే వెనక్కి తిరిగి చూస్తుంది. అలా చూసిన ప్రతిసారీ దాని వేగం తగ్గిపోతుంది. మళ్లీ వేగాన్ని అందుకోవడానికి సమయం పడుతుంది. ఈ లోపు పులి దాన్ని పట్టేస్తుంది. కానీ, పులి ఆలోచన అలా కాదు. దాని లక్ష్యం ఒక్కటే. జింకను పట్టుకోవడం. ఎక్కడా వెనక్కి తిరిగి చూడదు. తన శక్తిని వృధా చేసుకోదు.

ఆధ్యాత్మిక అంతరార్థం ... మన జీవితానికి అన్వయం

ఈ కథను మన నిత్య జీవితానికి అన్వయించుకుంటే, చాలామంది మనుషులు జింకల లాగే జీవిస్తున్నారు. భగవంతుడు మనకు ఎన్నో శక్తులు, ప్రతిభను ఇచ్చాడు. కానీ సమాజంలో మనల్ని వెనక్కి లాగే నకారాత్మక మాటలను, గతాన్ని తలచుకుంటూ పదే పదే వెనక్కి తిరిగి చూస్తుంటాం. దీనివల్ల మన ప్రగతి వేగం తగ్గిపోతుంది. మనల్ని విమర్శించే శక్తులు ఎప్పుడూ మన వెనుకే ఉంటాయి. వాటి వైపు తిరిగి చూస్తే మన పతనం ఖాయం. అదే పులి లాగా, సద్గురువులు చూపిన మార్గంలో కేవలం లక్ష్యం వైపు మాత్రమే అడుగులు వేస్తే, విజయం మన సొంతమవుతుంది. మీ అంతరంగంలో భయాన్ని పెంచి జింకలా మారుతారా? లేదా ఏకాగ్రతను పెంచి పులిలా గెలుస్తారా? నిర్ణయం మీదే!

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story