Power of Silence: పూర్వీకులు చెప్పిన మౌనం రహస్యం... నేటి యువత ఒత్తిళ్లు జయించేందుకు అవకాశం
మౌనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. పూర్వీకులు చెప్పిన మౌనం రహస్యం, యువత జీవితంలో దాని ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
Power of Silence: ఈరోజుల్లో కాసేపు మౌనంగా ఉండమంటే మావల్ల కాదుబాబోయ్ అనేస్తుంటారు. ఏదో బలవంతంగా మౌనంగా ఉందామని ప్రయత్నిస్తే...వెంటనే మొబైల్ ఫోన్ మోగడమో లేదంటే ఏదైనా వాట్సప్ మెసేజ్ రావడమో జరుగుతుంది. దీంతో మౌనాన్ని పక్కనపెట్టి బుల్లిపెట్టెలోకి దూరిపోయి గంటల తరబడి ఉండిపోతారు. మనిషి ఒత్తిడికి గురవ్వడానికి, సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడానికి ఈ బుల్లిపెట్టే కారణం. కానీ, మన పూర్వీకులు ఎందుకు ఆరోగ్యంగా, ఒత్తిడి లేకుండా, సమస్యలు ఉన్నా పెద్దవిగా చేసుకోకుండా హాయిగా జీవించారో తెలుసా...కారణం మౌనం. పూర్వం రోజుల్లో మౌనంగా ఉండేందుకు కొంత సమయం కేటాయించుకునేవారు. ఆ మౌనంలోనే మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయి... జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. మౌనం వలన ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.
కష్టమైనా ప్రయత్నించాలి
ఆధునిక కాలంలో కమ్యునికేషన్ చాలా ముఖ్యం. దీనిని కాదనలేం. కానీ, కమ్యునికేషన్‌తో పాటు మనతో మనం ఉండాలి అన్నా, ఒత్తిడి నుంచి మనం బయటపడాలన్నా మౌనం కూడా చాలా ముఖ్యమైదే. మౌనంగా ఉండటం వలన ప్రతికూల ఆలోచనలు తగ్గిపోయి సానుకూల ఆలోచనలు పెరుగుతాయని తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులే చెబుతున్నారు. ఇక ఆధ్యాత్మిక పరంగా మౌనం ఎంత ముఖ్యమైనదో తెలిస్తే అస్సలు వదలరు. మౌనంగా ఉండటం అంటే మాట్లాడకుండా ఉండటం అని అర్థం కాదు. మనసు, ఆలోచనలు, స్పందనలు అన్నింటినీ నియంత్రిండాన్నే మౌనం అని చెబుతారు. ఇలా మూడింటిని నియంత్రించడం అంటే కష్టమే. కానీ, ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
యోగశాస్త్రాల్లో చెప్పిన మౌనం
మన పూర్వీకులు, మునులు, ఋషులు, పురాణ పురుషులు మనకు ఉపనిషత్తులు, యోగశాస్త్రాలు, భగవద్గీత వంటి వెలకట్టలేని ఆస్తిని ఇచ్చారు. ఇందులో మౌనం గురించి ఎంతో గొప్పగా చెప్పబడింది. మౌనాన్ని ఆత్మజ్ఞానికి మార్గంగా పేర్కొన్నారు. మాటల శబ్దం అనేది బయటి ప్రపంచానికి సంబంధించినది. ఈ బయటి ప్రపంచంతో ముడిపడిన మాటలను నియంత్రించడానికి మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు క్రమంగా ధ్యానంగా మారుతుంది. ధ్యానంపై ధ్యాస పెరిగే కొలది మన లోపలి అంతరంగాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సాధారణంగా మన మాటలు మన ఆలోచలకు అడ్డుపడుతుంటాయి. కానీ, మౌనం మనస్సును స్థిరపడేలా చేస్తుంది. ఫలితంగా భావోద్వేగాలు తగ్గుముఖం పడతాయి. మౌనంలో పరమతత్వాన్ని అనుభవించవచ్చు. మౌనంగా ఉండటం వలన వాగ్దోషాలు తొలగిపోతాయి. అరుదుగా, పొదుపుగా వాడే మన మాటలు సత్యంగా మారతాయి. మాటకు విలువతో పాటు బలం కూడా చేకూరుతుంది. బలమైన మన ఆలోచనలు బలహీనమైన మానసిక ఒత్తిడిని తగ్గించేస్తాయి. మౌనం ఎంత గొప్పదో తెలియాలంటే తప్పకుండా మనం రమణ మహర్షి జీవితాన్ని చదవాలి. అరుణాచలంలో రమణుల ఆశ్రమంలో కొంతకాలం గడిపిరావాలి. మౌనంగా ఉండేందుకు, మనసును అదుపులో ఉంచుకునేందుకు అక్కడికి వచ్చేవారి అనుభవాలను తెలుసుకోవాలి. మౌనంగా ఉండటం నేర్చుకుంటే ఎంత ఎత్తుకైనా యువతరం ఎదగొచ్చు.




