Pratyangira Devi Miracle: ఈ అమ్మవారికి ఎండుమిరపకాయలతో హోమం... ఎలాంటి శతృవైనా మసికావాల్సిందే

భయంకరమైన క్షుద్ర శక్తుల నుండి రక్షణ పొందాలన్నా, శత్రువుల పీడ విరగడవ్వాలన్నా భక్తులు నమ్మే ఏకైక శక్తి స్వరూపిణి శ్రీ ప్రత్యంగిరా దేవి.

Balachander
Published on: 13 May 2026 9:05 AM IST
Pratyangira Devi Miracle: ఈ అమ్మవారికి ఎండుమిరపకాయలతో హోమం... ఎలాంటి శతృవైనా మసికావాల్సిందే
X

Pratyangira Devi Miracle: భయంకరమైన క్షుద్ర శక్తుల నుండి రక్షణ పొందాలన్నా, శత్రువుల పీడ విరగడవ్వాలన్నా భక్తులు నమ్మే ఏకైక శక్తి స్వరూపిణి శ్రీ ప్రత్యంగిరా దేవి. అమ్మవారికి నిర్వహించే 'ఎండుమిరపకాయల హోమం' ఆధ్యాత్మిక జగత్తులో ఒక అద్భుతం. అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని నేరుగా దర్శించుకోవాలంటే వణికిపోతాం. అమ్మను శాంతపరిచేందుకు నిమ్మకాయల దండను మెడలో వేస్తాం. అమ్మవారి దయ ఉంటే అసాధ్యమంటూ ఉండదని అంటారు.

అమ్మవారి ఆవిర్భావం - లక్ష సింహ ముఖాల శక్తి

పురాణాల ప్రకారం, విష్ణుమూర్తి సుదర్శన చక్రం, శివుని త్రిశూలం కూడా ఒకానొక రాక్షసుడిని సంహరించలేక విఫలమైనప్పుడు, ఆదిపరాశక్తి లక్ష సింహ ముఖాలతో, భగభగమండే కేశాలతో 'ప్రత్యంగిరా' రూపంలో ఆవిర్భవించింది. శత్రువులకు ఊపిరాడకుండా చేసే ఈ తల్లిని 'నికుంభిల' అని కూడా పిలుస్తారు. రామాయణ కాలంలో ఇంద్రజిత్తు ఈ అమ్మవారిని ఉపాసించేవాడని, ఆ యజ్ఞం భగ్నం కావడం వల్లే లక్ష్మణుని చేతిలో అతను హతమయ్యాడని రామాయణం చెబుతోంది.

ఎండుమిరపకాయల హోమం

ఎండుమిరపకాయలను నిప్పుల్లో వేస్తే ఎంత ఘాటు వస్తుందో చెప్పక్కర్లేదు. కానీ, ప్రత్యంగిరా దేవి అమ్మవారి హోమంలో వెల సంఖ్యలో ఎండు మిరపకాయలను హోమద్రవ్యంగా వినియోగిస్తారు. ఎన్ని మిరపకాయలు వేసినా ఘాటు రాదు. సాధారణ కట్టెపుల్లలు ఏ విధంగా హోమంలో వేస్తారో ఆ విధంగానే ఎండు మిరపకాయలను వేస్తారు. ఎంత ఎక్కువగా వేస్తే అంత హోమఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఈ హోమాన్ని అమావాస్య రోజున నిర్వహిస్తారు. అమావాస్య రోజున నిర్వహించే హోమంలో ఎండుమిరపకాయలతో పాటు తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు వంటి రాజద్రవ్యాలను వినియోగిస్తారు. వీటితో హోమం నిర్వహించడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది.

ప్రసిద్ధ ఆలయాలు - క్షుద్ర శక్తుల నివారణ

తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని అయ్యావరే అటవీ ప్రాంతంలో ఉన్న ప్రత్యంగిరా ఆలయం అత్యంత శక్తిమంతమైనది. ఇక్కడికి ప్రతిరోజూ వందల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారికి హోమం నిర్వహిస్తే శతృవుల బాధ తొలగిపోతుందని నమ్మకం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మవారికి ఆలయాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌ నగర్‌లోని కొత్తపేటలో కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరా అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ కూడా ప్రతి అమావాస్య లేదా ఇతర రోజుల్లో హోమం నిర్వహిస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కూడా ప్రత్యంగిరా దేవి ఆలయం ఉన్నది.

అమ్మవారు ఉగ్ర స్వరూపిణి అయినప్పటికీ, తనను నమ్మిన బిడ్డలకు మాత్రం కల్పవల్లి. శత్రు భయం ఉన్నవారు, సంతానం లేనివారు, అనారోగ్యంతో బాధపడేవారు అమావాస్య నాడు అమ్మవారిని స్మరిస్తే చాలు. కోరిన వన్నీ ఇస్తుంది. అమ్మవారి దయ ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడపవచ్చని పండితులు చెబుతున్నారు. కుంభకోణం వెళ్లినవారు తప్పకుండా అయ్యావరే ప్రాంతంలోని ప్రత్యంగిరా దేవిని తప్పక దర్శించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story