Pratyangira Homa: భయపెట్టే రూపమే కానీ... ఊహించని విజయాలకు మార్గం... ప్రత్యంగిరా హోమం

ప్రత్యంగిరా దేవి రూపం చూపరులకు అత్యంత భయంకరంగా ఉంటుంది. అమ్మవారిని ఆరాధించేవారికి అసాధ్యం అంటూ ఉండదని పండితులు, భక్తులు చెబుతున్నారు. ఆ విశేషాలను చూద్దాం.

Balachander
Published on: 25 July 2026 1:33 PM IST
Pratyangira Homa: భయపెట్టే రూపమే కానీ... ఊహించని విజయాలకు మార్గం... ప్రత్యంగిరా హోమం
X

Pratyangira Homa: ఘోరమైన క్షుద్ర శక్తుల భయం నుంచి విముక్తిని ప్రసాదిస్తూ, అసాధ్యమైన విజయాలను సుసాధ్యం చేసే మహా ఉగ్రస్వరూపిణి శ్రీ ప్రత్యంగిరా దేవి. లక్ష సింహ ముఖాలు, భగభగమండే కేశాలు, త్రినేత్రాలతో అవతరించిన ఈ ఆదిపరాశక్తిని ఆరాధిస్తే సకల శత్రు బాధలు, ఏలినాటి శని దోషాలు తక్షణమే తొలగిపోతాయి.

హోమ గుండంలో ఎండుమిరపకాయల వింత!

ప్రత్యంగిరా దేవి హోమ క్రతువు అత్యంత విచిత్రమైనది, అద్భుతమైనది. అమావాస్య నాడు అమ్మవారికి నిర్వహించే హోమంలో ముఖ్యమైన ద్రవ్యంగా ఎండుమిరపకాయలను వినియోగిస్తారు. కేజీల కొద్దీ ఎండుమిరపకాయలను హోమగుండంలో వేసినప్పటికీ, అక్కడ ఉన్న భక్తులకు కనీసం ఒక్క ఘాటు వాసన కూడా తగలకపోవడం ఈ క్షేత్రాల ప్రత్యేకత. తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు, శొంఠి వంటి రాజద్రవ్యాలతో ఈ హోమం జరుగుతుంది.

పురాణ కథ ... ఇంద్రజిత్తు మరణ రహస్యం

అధర్వణ వేదంలో 'అధర్వణ భద్రకాళి'గా, 'నికుంభిల'గా పేర్కొనబడిన ఈ తల్లిని శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు ఆరాధించి విజయాలు సాధించారు. ఈ దేవిని నికుంభిల రూపంలో ఉపాసించి, ప్రతి యుద్ధానికి ముందు యజ్ఞం చేసేవాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు. అయితే, రామరావణ యుద్ధ సమయంలో కూడా ఇంద్రజిత్తు ఈ యజ్ఞాన్ని ప్రారంభించగా, విభీషణుడి సూచన మేరకు వానరులు ఆ యజ్ఞాన్ని సగంలోనే ధ్వంసం చేశారు. అమ్మవారి హోమం తలపెట్టినపుడు ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు చేయాల్సిందే. కానీ, ఇంద్రజిత్తు మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో ఆరోజే ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో హతమయ్యాడు.

ప్రసిద్ధ ప్రత్యంగిరా దేవి ఆలయాలు

ఉగ్రరూపిణి కావడంతో దేశంలో ఈ దేవికి ఐదు ప్రధాన ప్రాంతాలలో మాత్రమే విశేష ఆలయాలు ఉన్నాయి. ఒకటి కుంభకోణం సమీపంలోని అయ్యావరే అనే అటవీప్రాంతంలో నికుంభిల దేవి ఆలయం ఉంది. ఇక కర్ణాటకలోని హోసూరు, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలోనూ అమ్మవారికి ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్‌ దిల్‌షుఖ్‌నగర్‌ సమీపంలో కుర్తాళం పీఠంలో కూడా శ్రీ ప్రత్యంగిరా దేవికి ఆలయం ఉండటం విశేషం. అయితే, అమ్మవారి క్షేత్రాలను దర్శించి అమావాస్య, ఆదివారాల్లో ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొంటే సంతాన ప్రాప్తి, దారిద్య్ర నివారణ, పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story