Trishund Ganpati: పూణేలో అత్యంత అరుదైన వినాయకుడు...జీవితంలో ఈ మూడింటిని రక్షణ

మనదేశంలో అత్యంత అరుదైన ఆలయాల్లో ఒకటి త్రిసూంద్‌ గణపతి ఆలయం. ఇక్కడ స్వామివారు మూడు తొండాలు, ఆరు చేతులతో దర్శనం ఇస్తారు.

Balachander
Published on: 23 July 2026 9:59 AM IST
Trishund Ganpati: పూణేలో అత్యంత అరుదైన వినాయకుడు...జీవితంలో ఈ మూడింటిని రక్షణ
X

Trishund Ganpati: మహారాష్ట్రలోని పూణే నగరంలో అత్యంత అరుదైన, విస్మయపరిచే 'త్రిసూంద్ గణపతి' ఆలయం వెలసింది. సాధారణంగా ఏక తొండంతో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుడు, ఇక్కడ ఏకంగా 3 తొండాలు, 6 చేతులతో, నెమలి వాహనారూఢుడై అభయమివ్వడం భారతదేశంలోనే ఎక్కడా లేని అరుదైన ఆధ్యాత్మిక అద్భుతం. ఈ స్వామిని దర్శించుకుంటే జీవితంలో ఎదురయ్యే మూడు ప్రధాన గండాలు, తీవ్రమైన కష్టాల నుండి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం.

16 ఏళ్ల నిర్మాణం ... త్రిముఖ రూపం

ఇండోర్ సమీపంలోని ధంపూర్ ప్రాంతానికి చెందిన భీమ్జిగిరి గోసావి అనే గణపతి భక్తుడు 1754 లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. సుమారు 16 సంవత్సరాల కఠిన పరిశ్రమ తర్వాత 1770 లో విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయింది. అంతేకాదు, సాధారణంగా గణేశునికి ఎలుక వాహనంగా ఉంటుంది. కానీ ఇక్కడ నెమలిపై కొలువై ఉండటం, ఇండో-రాజస్థానీ, మాల్వా, దక్షిణ భారత నిర్మాణ శైలుల కలయికతో నల్లని బసాల్ట్ రాతితో ఆలయం నిర్మించబడటం ప్రధాన ఆకర్షణ. వీటితో పాటు గర్భగుడి గోడలపై సంస్కృతం, పర్షియన్ భాషలలో శాసనాలతో పాటు భగవద్గీత శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. ఓ గోడపై సైనికుడు ఖడ్గమృగాన్ని ఇనుప గొలుసులతో బంధిస్తున్న శిల్పం భారతదేశంలో మరెక్కడా కనిపించదు. ఇలాంటి అరుదైన ఘట్టాలు, శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

గురుపూర్ణిమ వేడుక

ఆలయ క్రింది భాగంలో ఏడాది పొడవునా నీటితో నిండి ఉండే ఒక పవిత్రమైన కొలను ఉంది. ప్రతి సంవత్సరం గురుపూర్ణిమ రోజున మాత్రమే ఈ కొలనులోని నీటిని పూర్తిగా తొలగించి, విగ్రహం క్రింద ఉన్న గదిలో వెలసిన ఆలయ నిర్మాణకర్త మహంత్ శ్రీ దత్తగురు గోసావి మహారాజ్ సమాధికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇలా ఏడాదికి ఒకసారి కొలనులోని నీటిని తొలగించి దాని కింద ఉండే నిర్మాణ కర్తకు పూజలు చేయడం బహుశా ఈ త్రిసూంద్ గణపతి ఆలయంలో మాత్రమే కనిపిస్తుంది. ఈ గణపతిని దర్శించుకున్న భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించడమే కాకుండా, మన దేశపు ప్రాచీన శిల్పకళా ప్రతిభకు ప్రాణసమానమైన సాక్ష్యంగా నిలుస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story