18 Mahapuranas: పురాణాల గురించి ఈ తరంవారు ఏం తెలుసుకోవాలి... పురాణాలు కల్పితమా? వాస్తవమా?

అష్టాదశ పురాణాల గురించి ఈ తరం వారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ పురాణం దేని గురించి తెలియజేస్తుందో తెలుసుకోవాలి.

Balachander
Published on: 19 Aug 2026 9:40 AM IST
18 Mahapuranas: పురాణాల గురించి ఈ తరంవారు ఏం తెలుసుకోవాలి... పురాణాలు కల్పితమా? వాస్తవమా?
X

18 Mahapuranas: సనాతన సంస్కృతిలో వేదాలు ప్రమాణాలైతే, ఆ వేదాలలోని పరమ సత్యాన్ని కథల రూపంలో సామాన్యుడికి సైతం బోధించే దివ్య గ్రంథాలే 'పురాణాలు'. ఈనాటి ఆధునిక ప్రపంచంలో "పురాణాలు కల్పితమా? వాస్తవమా?" అనే సందేహం చాలామందిలో మెదులుతోంది. అయితే పురాణాలు కల్పిత కథలు కావు. 'పురా అపి నవం' అంటే ఎంత ప్రాచీనమైనవో, అంత నిత్య నూతనమైనవి అని అర్థం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను ఏకకాలంలో దర్శించగల మహాజ్ఞాని వేదవ్యాసుడు మానవజాతి కలకాలం ధర్మమార్గంలో నడవడానికి 18 మహా పురాణాలను రచించారు.

అష్టాదశ పురాణాల సంక్షిప్త విజ్ఞాన సర్వస్వం

1,400 శ్లోకాలు ఉన్న మత్స్య పురాణం మత్స్యావతార వైభవాన్ని, కార్తికేయ, సావిత్రుల చరిత్రలను, కాశీ, ప్రయాగ క్షేత్ర మహత్యాలను వివరిస్తుంది. ఇక 900 శ్లోకాలతో నిండిన మార్కండేయ పురాణం అత్యంత సంక్షిప్తమైన ఈ పురాణంలో దుర్గాసప్తశతి, చండీ హోమాలు, విష్ణు, శివారాధనల విశేషాలు ఉన్నాయి. అదేవిధంగా 18వేల శ్లోకాలున్న భాగవత పురాణం శ్రీకృష్ణుని దివ్య లీలలు, దశావతార చరిత్రలతో భక్తిరసాన్ని పండించే మహోన్నత గ్రంథంగా గుర్తింపు పొందింది. ఇక 14,500 శ్లోకాలు కలిగిన భవిష్య పురాణం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను, సూర్యోపాసనను, వర్ణాశ్రమ ధర్మాలను తెలియజేస్తుంది. అదేవిధంగా 10వేల శ్లోకాలు కలిగిన బ్రహ్మ పురాణం లేదా ఆదిపురాణంలో కశ్యప, మార్కండేయుల చరిత్రలు, ధర్మాధర్మ వివేచన ఉంటాయి.

ఇక 12వేల శ్లోకాలు కలిగిన బ్రహ్మాండ పురాణంలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రం అంతర్భాగంగా ఉంటుంది. గాంధర్వ, ఖగోళ శాస్త్రాల ప్రస్తావన ఇందులో ఉంది. అదేవిధంగా 18వేల శ్లోకాలు కలిగిన బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి, శ్రీకృష్ణుల చరిత్రతో పాటు ప్రకృతి, పంచశక్తుల (దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ) వైభవాన్ని తెలుపుతుంది. అదేవిధంగా 24వేల శ్లోకాలు కలిగిన వరాహ పురాణం వెంకటాచల వైభవం, శ్రీనివాసుని పూజా విధానాలు, వ్రతాల గురించి భూదేవికి శ్రీహరి వివరించిన కథనం ఉంటుంది. 10వేల శ్లోకాలు కలిగిన వామన పురాణం శివలింగ ఆరాధన, శివపార్వతుల కళ్యాణం, ఋతు వర్ణనలను సవివరంగా వివరిస్తుంది. 24వేల శ్లోకాలు కలిగిన వాయు పురాణం మహాశివుని మహత్యం, కాలమానాలు, ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని అందిస్తుంది. ఇక 23వేల శ్లోకాలు ఉన్న విష్ణు పురాణాన్ని మైత్రేయునికి పరాశరుడు బోధించాడు. ఈ గ్రంథంలో ప్రహ్లాద, ధ్రువుల నమ్మశక్యం కాని భక్తి మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా 15,400 శ్లోకాలు కలిగిన అగ్ని పురాణం ఇది ఒక నిఘంటువు వంటిది. ఇందులో ఆయుర్వేదం, జ్యోతిష్యం, రాజనీతి, వ్యాకరణాలు నిక్షిప్తమై ఉన్నాయి.

25వేల శ్లోకాలు కలిగిన నారద పురాణంలో వేదపాదస్తవము, వారణాసి, బదరి వంటి పవిత్ర తీర్థక్షేత్రాల ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. 81 వేల శ్లోకాలు కలిగిన స్కంద పురాణం శివచరిత్ర, కేదార-కాశీ ఖండాలు, సత్యనారాయణ వ్రత మహత్యం కలిగి ఉన్న విస్తృతమైన పురాణంగా ప్రసిద్ది పొందింది. ఇక లింగ పురాణం పరమశివుని ఉపదేశాలు, మహిమలు, దేవాలయారాధనల విధులను సవివరంగా తెలియజేస్తుంది. అలాగే 19వేల శ్లోకాలు కలిగిన గరుడ పురాణం జీవి జనన మరణ చక్రం, పాపపుణ్యాల ఫలాలు, నరక వర్ణనలు, దానధర్మాల ప్రాధాన్యతను వివరిస్తుంది. ఇక 17వేల శ్లోకాలు కలిగిన కూర్మ పురాణం వరాహ, నారసింహ అవతార విశేషాలను, శివారాధనా నియమాలను విశదీకరిస్తుంది. ఇకపోతే 85 వేల శ్లోకాలు కలిగిన పద్మ పురాణం అన్ని పురాణాలలోనే అత్యంత పెద్దది. భగవద్గీతా సారం, గాయత్రీ చరిత్ర, అశ్వత్థ వృక్ష మహిమలను అందిస్తుంది.

ఈ అధునాతన కాలంలో అష్టాదశ పురాణాల శ్లోకాలన్నీ పూర్తిగా చదవడం సాధ్యపడకపోయినా, ఏ పురాణంలో ఏ దివ్య జ్ఞానం దాగి ఉందో తెలుసుకోవడం ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ తరంవారు కనీసం ఏ పురాణం దేనిగురించి తెలియజేస్తుందో తెలుసుకుంటే...దానికి అనుగుణంగా వారి పూజా విధానాలు, వారి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story