Puri Bedi Hanuman Temple Mystery: పూరి బేడి ఆంజనేయుడి రహస్యం..సముద్రం ముందుకు రాకపోవడానికి ఇదే కారణం
Puri Bedi Hanuman Temple Mystery: ఒడిశాలోని పూరి జగన్నాథుడి క్షేత్రాన్ని దర్శించుకున్న తరువాత మనం వెనక్కి వచ్చేస్తుంటాం.
Puri Bedi Hanuman Temple Mystery
Puri Bedi Hanuman Temple Mystery: ఒడిశాలోని పూరి జగన్నాథుడి క్షేత్రాన్ని దర్శించుకున్న తరువాత మనం వెనక్కి వచ్చేస్తుంటాం. కానీ, ఇక్కడ స్వామివారి పరమ భక్తుడైన హనుమంతుడి ఆలయాన్ని కూడా తప్పక దర్శించాలి. ఆంజనేయుడిని బంగారు గొలుసులతో బంధించిన వింత ఆలయం ఇక్కడ ఉంది. అదే బేడీ ఆంజనేయ స్వామి దేవాలయం. సముద్రుడు ఆలయంలోకి రాకుండా అడ్డుకోవడమే ఈ బంధనం వెనుక ఉన్న అసలైన పరమార్థం.
సముద్రుడి కోరిక.. భక్తులకు కష్టం
పురాణాల ప్రకారం, జగన్నాథుడి వైభవాన్ని చూసి సముద్రుడు పరవశించిపోయాడు. స్వామిని దర్శించుకోవాలనే ఆరాటంతో అలల రూపంలో ఆలయంలోకి ప్రవేశించేవాడు. సముద్రుడు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో సామాన్య భక్తులకు, ఆలయ ప్రాంగణానికి తీవ్ర ఇబ్బంది కలిగేది. ఎన్నోసార్లు భక్తులు ఈ సముద్రంలో కొట్టుకుపోయారు. ఆలయం దెబ్బతిన్నది. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేయించినా సముద్రుడి రాకతో మరలా మరలా అలానే జరుగుతున్నది. దీంతో ఆ స్వామివారికి మొరపెట్టుకున్నారు. భక్తుల మొర ఆలకించిన జగన్నాథుడు, సముద్రుడిని నిలువరించే బాధ్యతను తన నమ్మకస్థుడైన హనుమంతుడికి అప్పగించాడు.
హనుమంతుడిని బోల్తా కొట్టించిన సముద్రుడు
జగన్నాథుడు అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుని అవతారమే కదా. జగన్నాథుడిలో స్వామివారిని చూసుకుంటూ... ఆయన ఆజ్ఞమేరకు హనుమంతుడు అహోరాత్రులు సముద్ర తీరానా కాపలా ఉన్నాడు. హనుమంతుడిని దాటి ముందుకు వెళ్లడం సముద్రుడికి అసాధ్యం. ఆయన తలచుకుంటే సముద్రుడిని చుక్కలా మార్చేసి అమాంతం మింగేయగలడు. అందుకే సముద్రుడు ఓ ఉపాయం ఆలోచించాడు. "హనుమా! లోక బాంధవుడైన జగన్నాథుడిని దర్శించుకోకుండా ఇక్కడే ఉంటే నీ భక్తికి అర్థమేముంది? ఒక్కసారి లోపలికి వెళ్లి ఆ నీలమేఘశ్యాముడిని కళ్లారా చూసి రా" అని భక్తి పేరుతో ప్రేరేపించాడు. దేనికి లొంగని హనుమయ్య భక్తికి, భక్తితో కూడిన మాటలకు లొంగిపోతాడు. ఆ మాటలకు లోనైన హనుమంతుడు, కాపలా వదిలి ఆలయంలోకి వెళ్లేవాడు. హనుమయ్య కదిలిన ప్రతిసారీ ఆయన వెంటే సముద్రుడు కూడా ఉప్పొంగుతూ గర్భాలయం వరకు వచ్చేవాడు.
బంగారు గొలుసుల బంధం
ఈ పరిణామం వల్ల ఆలయానికి ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన జగన్నాథుడు, హనుమంతుడి భక్తిని మెచ్చుకుంటూనే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. హనుమంతుడు తన స్థానాన్ని వదిలి కదలకుండా ఉండేందుకు ఆయన చేతులకు, కాళ్లకు బంగారు సంకెళ్లు (బేడీలు) వేయించాడు. అప్పటి నుంచి హనుమంతుడు ఆ బేడీలతో అక్కడే అలానే ఉండిపోయాడు. స్వామివారిని మనసులోనే తలచుకుంటూ స్థిరంగా ఉన్నాడు. హనుమయ్య స్థిరంగా ఉండటంతో సముద్రుడు కూడా ముందుకు రాలేక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. నేటికీ మనం తీరం వరకు ఉప్పొంగుతూ వచ్చి ఒక్కసారిగా తిరిగి వెనక్కి వెళ్లే సముద్రుడిని పూరీలో చూడొచ్చు. ఇక బేడీ ఆంజనేయుడి ఆలయం పూరి జగన్నాథుడి ఆలయానికి పశ్చిమ దిశలో సముద్ర తీరానికి సమీపంలో ఉంది. ఇక్కడ స్వామివారు నిటారుగా నిలబడి చేతులు కట్టుకొని సంకెళ్లతో బంధీ అయ్యి దర్శనం ఇస్తాడు.
జగన్నాథుడి ప్రేమ బంధనానికి లోబడి హనుమయ్య సముద్రుడిని నిలువరిస్తున్నాడని భక్తుల నమ్మకం. సముద్రపు అలలు ఎంత ఉదృతంగా వచ్చినా అవి ఆలయం దరిదాపులకు కూడా రావు. భక్తుడి భక్తికి, భగవంతుడి రక్షణకు ఈ 'బేడీ ఆంజనేయుడు' ఒక నిలువెత్తు నిదర్శనం.




