Puri Jagannath Rath Yatra 2026: పూరీ జగన్నాథుని యాత్రకు ప్లాన్ చేస్తున్నారా... ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి
Puri Jagannath Rath Yatra 2026: ఈ ఏడాది ఆషాఢంలో జరిగే రథయాత్రకు సర్వం సిద్దమౌతున్నది. పూరీ జగన్నాథుడిన రథాలు సిద్దమౌతున్నాయి. ఈ యాత్రలో పాల్గొని రథాన్ని లాగాలనుకునే భక్తులు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
Puri Jagannath Rath Yatra 2026: అషాఢంలో జరిగే అత్యంత శుభకరమైన దైవకార్యక్రమం పూరీ జగన్నాథుని రథయాత్ర. జులై 16న ప్రారంభమై జులై 27వ వరకు జరుగుతుంది. ఈ యాత్రలో పాల్గొని రథాన్ని లాగేందుకు లక్షలాదిమంది భక్తులు పూరీకి చేరుకుంటారు. రథయాత్ర జరిగే ప్రదేశంలో ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఉంటాయి. కానీ, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వందలాది సంవత్సరాలుగా యాత్ర సంపూర్ణమౌతుంది అంటే దానికి ఆ పూరీ జగన్నాథుని చల్లని చూపులే కారణమని పండితులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది రథయాత్రకు వెళ్లాలని అనుకునేవారు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
సిద్దమౌతున్న పూరీ రథాలు
పూరీ జగన్నాథుడి సన్నిధిలో అన్ని ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలే ఉంటాయి. ఇందులో ప్రధానమైనది ఆయన రూపం. అసంపూర్ణంగా ఉన్న రూపంలో ఆయన భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. కానీ, ఆషాఢంలోని తొమ్మిది రోజులపాటు స్వామివారు తన సోదరి సోదరుడితో కలిసి తన దర్శనం కాలేని భక్తుల వద్దకు తానే వెళ్లి కనిపించేందుకు రథంలో ఊరెరుగుతారు. 15 రోజుల అనారోగ్యం నుంచి బయటపడిన తరువాత నవ యవ్వనంతో స్వామివారు అలంకృతుడై రథాన్ని అధిరోహిస్తారు. భగవంతుడి ముందు రాజు, పేద అందరూ సమానమే. ఈ సమానత్వాన్ని తెలిపేందుకే పూరీ సంస్థానానికి చెందిన రాజు బంగారు చీపురుతో స్వామివారి రథాన్ని ఊడుస్తారు. ఈ తంతు కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ముగ్గురి కోసం తయారు చేసే మూడు రథాలు విభిన్నంగా, విభిన్నమైన రూపాల్లో ఉంటాయి. ప్రతి ఏడాది ఈ ఉత్సవం కోసం తయారు చేసే రథాలు ప్రత్యేకమనే చెప్పాలి. ఏ దేవాలయంలోనూ ఒకసారి తయారు చేసిన రథాన్నే ప్రతి ఏడాది ఉత్సవాల్లో ఉపయోగిస్తారు. ఒక్క పూరీలో తప్ప.
పాటించవలసిన నియమాలు
ఇక యాత్రలో పాల్గొనాలని అనుకునే భక్తులు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. రథయాత్రలో ఎవరైనా సరే మీకు స్వామివారి మహా ప్రసాదాన్ని అందిస్తే దానిని మహాభాగ్యంగా స్వీకరించాలి. తిరస్కరించడంగాని, కిందవేయడం గాని చేయకూడదు. స్వయంగా శ్రీమహాలక్ష్మీదేవినే ఈ యాత్ర కోసం మహా ప్రసాదాన్ని దగ్గరుండి తయారు చేయిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇటువంటి ప్రసాదం దొరకడమే అదృష్టం. నేలపాలు చేస్తే జీవితంలో కష్టాల సునామీని ఎదుర్కోవలసి వస్తుంది. ఇక రథం తాడు దొరికితే అంతకన్నా మహాభాగ్యం మరొకటి ఉండదు. జీవితానికి లభించే అరుదైన అవకాశం. ఆ సందర్భాన్ని ఎవరూ కూడా వదులుకోకూడదు. తాడు లాగే సమయంలో, లాడు దొరికించుకోవడం కోసం చేసే ప్రయత్నంలోనూ ఎవరినీ దూషించడం గాని, నిందించడం గాని చేయకూడదు. పూరీ రథయాత్రలో పాల్గొనే భక్తులు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. రథం ప్రయాణించే మార్గంలో చెప్పులు వేసుకొని ఉండకూడదు. రథయాత్రలో పాల్గొనే భక్తులకు సేవ చేయడం వలన పలు దోషాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. రథయాత్ర జరిగే సమయంలో స్వామివారి నామాన్ని మనసులో తలచుకుంటూ సేవా, ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం వలన మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.




