Puri Jagannath idols mystery: పూరి జగన్నాథుని రహస్యంః 12 ఏళ్ల తరువాత విగ్రహాలను ఏం చేస్తారంటే

Puri Jagannath idols mystery: పూరి జగన్నాథుడి ఆలయం గురించి వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రథయాత్ర.

Balachander
Published on: 16 April 2026 1:08 PM IST
Puri Jagannath idols mystery
X

Puri Jagannath idols mystery: పూరి జగన్నాథుని రహస్యంః 12 ఏళ్ల తరువాత విగ్రహాలను ఏం చేస్తారంటే

Puri Jagannath: పూరి జగన్నాథుడి ఆలయం గురించి వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రథయాత్ర. కానీ ఈ ఆలయంలో జరిగే మరొక విశేషం గురించి చాలా మందికి తెలియదు. అదే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే విగ్రహ మార్పు తంతు. ఇది భక్తులను ఆశ్చర్యానికి గురిచేసే ఆధ్యాత్మిక రహస్యం.

పూరీ జగన్నాథుని రహస్యం - 12 ఏళ్ల విగ్రహ మార్పిడి వెనుక అసలు కథ!

ఆషాఢమాసంలో పూరి జగన్నాథ ఆలయంలో రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్ర కోసం ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేస్తారు. రథయాత్రకు 42 రోజుల ముందు నుంచే రథాల తయారీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సుమారు 200 మంది నిపుణులు ఎటువంటి ఇనుమును ఉపయోగించకుండా కేవలం కలపతోనే ఈ రథాలను తయారు చేస్తారు. రథయాత్ర పూర్తయిన తరువాత వాటిని విడదీస్తారు. రథాల తయారీకి సుమారు 4000 వరకు కలప ముక్కలు అవసరమౌతాయి. ఈ ముక్కలను విడదీసి స్వామివారి మహాప్రసాదం వండేందుకు వినియోగిస్తారు. స్వామివారి ఆలయంలో ఎక్కడా కూడా ఎలక్ట్రిక్‌ లేదా గ్యాస్‌ ఉపయోగించి మహాప్రసాదం తయారు చేయరు. ఇలా కట్టెలతో వండిన మహాప్రసాదాన్ని స్వీకరించడాన్ని భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు.

నవకలేబర ఉత్సవం - బ్రహ్మ పదార్థం

పూరీలో జరిగే మరో గొప్ప బ్రహ్మండమైన ఉత్సవం నవకలేబర ఉత్సవం. ఇది పుష్కరానికి ఒకమారు జరుగుతుంది. విగ్రహాల మార్పిడి అత్యంత రహస్యంగా జరుగుతుంది. రథాల తయారీకోసం కలపను సేకరించిన విధంగానే పూరి జగన్నాథుని విగ్రహాల తయారీ కోసం కూడా భగవంతుడు సూచించిన విధంగానే కలపను సేకరిస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో ఆలయ శిల్పులు కొయ్య విగ్రహాలను తయారు చేస్తారు. ఇలా విగ్రహాలు తయారయ్యాక పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి బ్రహ్మపదార్ధాన్ని మారుస్తారు. ఆ సమయంలో పూరి నగరం మొత్తం మూగబోతుంది. రాత్రి సమయంలో నిర్వహించే ఈ తంతుకోసం నగరం పూర్తిగా చీకటిమయం అవుతుంది. బ్రహ్మపదార్థాన్ని మార్చే అర్చకుడు కళ్లకు గంతలు, చేతులకు తొడుగులు వేసుకుంటారు. బ్రహ్మపదార్థాన్ని మార్చే ప్రక్రియ మొత్తం స్వామివారే చూసుకుంటారని నమ్మకం. ఇప్పటి వరకు ఈ బ్రహ్మపదార్థాన్ని ఎవరు చూసిన, తాకిన దాఖలాలు లేవు.

విగ్రహాల అంత్యక్రియలు

ఇక్కడ విశేషమేమంటే...పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి బ్రహ్మపదార్థాన్ని మార్చిన తరువాత కొత్త విగ్రహానికి జీవం వస్తుంది. విగ్రహంగా ఉన్నప్పుడు చూసిన దానికంటే బ్రహ్మపదార్ధం మార్చిన తరువాత చూసిన విగ్రహానికి చాలా తేడా ఉంటుంది. విగ్రహంలో జీవశక్తి ఉట్టిపడుతుంది. నిజంగానే స్వామివారు అక్కడ కూర్చొని ఉన్నారా అనిపిస్తుంది. ఇక బ్రహ్మపదార్థం మార్చిన తరువాత పాత విగ్రహంలో కళ తగ్గిపోతుంది. మనిషి మరణిస్తే ఏ విధంగా మారిపోతాడో అదేవిధంగా విగ్రహంలో కూడా జీవకళ కోల్పోతుంది. ఇలా జీవకళ కోల్పోయిన విగ్రహానికి ఉత్తర క్రియలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని కోయిలి వైకుంఠం అనే ప్రాంతంలో శాస్త్రోక్తంగా భూమిలో నిక్షిప్తం చేస్తారు. ఉత్తర క్రియలు పూర్తయ్యే వరకు ఆలయంలోకి ఎవరిని అనుమతించరు. పునర్జన్మ సిద్దాంతానికి మూలం ఈ నవకలేబర ఉత్సవం. దైవం మానవ రూపంలో ఉన్నప్పుడు ప్రకృతి నియమాలకు లోబడి ఉంటారని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story