Puri Rath Yatra Secrets: రథయాత్ర రోజున పూరీలో జరిగే అద్భుతం ఇదే... రథంలో ఎంత బంగారం ఉంటుందో తెలుసా?
పూరి రథయాత్ర జరిగే రోజున పూరీ ఆలయం వద్ద తప్పకుండా వర్షం కురుస్తుంది. వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Puri Rath Yatra Secrets: ప్రపంచంలోనే అత్యంత వైభవంగా జరిగే దివ్యోత్సవం పూరీ జగన్నాథుడి రథయాత్ర. ఆ నల్లనయ్యను, బలరామ సుభద్రలను కనులారా వీక్షించడానికి దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి తరలివస్తారు. రథానికి కట్టిన పవిత్రమైన తాడును తాకితే జన్మధన్యమౌతుందని, ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీస్సులు లభిస్తాయని హిందూ ధర్మం నమ్ముతుంది. అయితే, ఈ రథయాత్ర వెనుక ప్రపంచానికి తెలియని ఒక పరమ రహస్యం దాగుంది. వేప చెక్కతో నిర్మించే ఈ మూడు దివ్య రథాల అంతర్భాగ అలంకరణలో దాదాపు 208 కిలోల స్వచ్ఛమైన అపరంజి బంగారాన్ని వినియోగిస్తారు. తరతరాలుగా అత్యంత రహస్యంగా ఉంచుతున్న ఈ సువర్ణ అలంకరణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక మర్మం, రథ నిర్మాణంలోని ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం.
ఆరు రథాల నుండి మూడు రథాల వరకు ... 700 ఏళ్ల నాటి చరిత్ర
నేడు మనం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల కోసం కేవలం మూడు రథాలనే చూస్తున్నాం. కానీ, 700 సంవత్సరాల క్రితం ఈ ఉత్సవం ఏకంగా ఆరు రథాలతో జరిగేది. పూరీ ఆలయం నుండి బయలుదేరిన మూడు రథాలు గుండిచా దేవి ఆలయ మార్గంలో ఉన్న 'బలగుండి' అనే పవిత్ర వాగు వద్దకు ఆగిపోయేవి. అక్కడ విగ్రహాలను మూడు పడవల్లో ఎక్కించి వాగు దాటించేవారు. అవతలి ఒడ్డున సిద్ధంగా ఉంచిన మరో మూడు రథాలపైకి మార్చి అత్తగారింటికి తీసుకెళ్లేవారు. అయితే, కాలక్రమేణా రాజా కేసరి నరసింహ ఈ వాగు ప్రవాహంలో మార్పులు తీసుకురావడంతో, ఆరు రథాల సంప్రదాయం ముగిసి మూడు రథాల యాత్రగా రూపాంతరం చెందింది.
ఒక్క లోహపు ముక్క కూడా లేని రథ నిర్మాణం
పూరీ రథాల తయారీ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ రథాల నిర్మాణంలో ఆధునిక కొలతల పరికరాలు గానీ, ఇనుప మేకులు వంటి ఎలాంటి లోహపు ముక్కలను గానీ అస్సలు ఉపయోగించరు. కేవలం వేప చెక్కతో, సాంప్రదాయ చేతి కొలతలతోనే పూర్తి రథాన్ని తయారు చేస్తారు. దాదాపు 1400 మందికి పైగా చారిత్రక హస్తకళాకారులు రాత్రింబవళ్లు శ్రమించి ఈ పవిత్ర వాహనాలను సిద్ధం చేస్తారు. ఈ రథాల లోపల 208 కిలోల బంగారాన్ని గుప్తంగా ఉంచి అలంకరించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది ఇప్పటికీ పురాణ పరిశోధకులకు ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది.
ప్రకృతి పులకించే అద్భుతమైన వింత
పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమయ్యే ప్రతి ఏటా, రథం కదిలే సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుండి వర్షపు జల్లులు కురవడం ఇక్కడి అలవాటు. శతాబ్దాలుగా ఈ సంప్రదాయం ఒక్కసారి కూడా తప్పకపోవడం భగవంతుడి ఉనికికి నిదర్శనం. పూర్వకాలంలో మోక్షప్రాప్తి కోసం భక్తులు ఈ రథచక్రాల కింద పడి ఆత్మాహుతి చేసుకునేవారంటే ఈ క్షేత్రంపై వారికి గల నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొని, ఆ స్వామి రథాన్ని లాగిన వారికి పునర్జన్మ ఉండదని, సమస్త పాపాలు తొలగిపోతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు.




