పూరీ రథయాత్ర రహస్యం...గుండీచా ఆలయంలో వారం రోజులు ఎందుకు ఉంటారో తెలుసా?
పూరీ జగన్నాథ రథయాత్ర జులై 16 నుంచి ప్రారంభం కాబోతున్నది. వైష్ణవ భక్తుల చూపులు ఈ తొమ్మిదిరోజులు పూరీవైపే ఉంటాయి. అసలు పూరీ రథయాత్ర రహస్యం ఏమిటి...గుండీచా ఆలయంలో స్వామివారు వారం రోజులు ఎందుకు ఉంటారో తెలుసుకుందాం.
Puri Rath Yatra 2026: వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 108 దివ్యధామాలలో ఒడిశాలోని పూరీ క్షేత్రం ఒకటి. ఏటా ఆషాఢమాసంలో ఇక్కడ జరిగే జగన్నాథ రథయాత్ర భూలోకంలోనే ఒక కన్నుల పండుగ. సాధారణంగా దేవుడిని చూడటానికి భక్తులు గుడికి వెళతారు, కానీ ఏడాది పొడవునా గర్భగుడి దాటని ఆ పరమాత్ముడే, తన దర్శనం చేయలేని భక్తుల కోసం స్వయంగా వీధుల్లోకి వచ్చే పరమ పవిత్రమైన రోజే ఈ రథయాత్ర. ఈ ఏడాది చంద్రమాన తిథుల ప్రకారం జూలై 16 వ తేదీన ప్రారంభమై జూలై 24 వరకు మొత్తం 9 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. అయితే, నగర విహారం చేసిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తమ నివాసానికి వెళ్లకుండా, మేనత్త అయిన గుండీచా దేవి ఆలయానికి వెళ్లి వారం రోజుల పాటు అక్కడే ఎందుకు సేదతీరుతారో తెలుసా? ఆ పవిత్ర లీలా రహస్యం వెనుక ఎంతో హృద్యమైన గాథ ఉంది.
సుభద్రాదేవి కోరిక ... నగర పర్యటన వెనుక కథ
పద్మపురాణం ప్రకారం, ఒకసారి జగన్నాథుని ముద్దుల సోదరి సుభద్రాదేవి తనకు నగరాన్ని చూడాలని ఉందని కోరింది. సోదరి కోరికను మన్నించిన జగన్నాథుడు, అన్న బలరాముడితో కలిసి ఆషాఢ శుద్ధ విదియ నాడు రథమెక్కి నగర పర్యటనకు బయలుదేరాడు. అలా నగరమంతా తిరిగి, భక్తులందరికీ దివ్య దర్శనమిచ్చి అలసిపోయిన ఈ ముగ్గురు సమీపంలోనే ఉన్న తమ మేనత్త ‘గుండీచా దేవి’ ఇంటికి వెళ్లారు. మేనత్త ప్రేమతో పెట్టిన ఆతిథ్యానికి ముగ్ధులై, వారు అక్కడే వారం రోజుల పాటు బస చేశారు. ఆ సంప్రదాయాన్నే నేటికీ పూరీలో ‘గుండీచా యాత్ర’ లేదా ‘బహుడా యాత్ర’ గా అత్యంత నిష్ఠతో నిర్వహిస్తున్నారు.
కొత్త కలపతో మూడు రథాలు ... నడక వెనుక మోక్షం
ప్రతి సంవత్సరం ఈ యాత్ర కోసం వేప చెట్టు సరికొత్త కలపతో మూడు నూతన రథాలను అత్యంత పవిత్రంగా తయారు చేస్తారు. గర్భగుడిలో రత్నసింహాసనంపై ఉన్న స్వామివారిని నేరుగా రథంపై దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు, దుఃఖాలు తొలగిపోయి మరణానంతరం మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే మొదటి రోజు, చివరి రోజున లక్షలాది మంది భక్తులు పూరీ నగరానికి పోటెత్తుతారు. ఇంతటి మహోత్సవంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, లక్షలాది మంది రథాల తాడును లాగుతున్నా ఎక్కడా ఎలాంటి తొక్కిసలాటలు జరగవు. కాలచక్రంలా సాగే ఆ రథచక్రాల కింద పడి పూర్వకాలంలో కొందరు భక్తులు ప్రాణత్యాగం చేసేవారని, ఆ రక్తాభిషేకంతోనే రథాలు కదిలేవనే ఒక ఐతిహ్యం కూడా ప్రచారంలో ఉంది.
జగన్నాథుడు గుండీచా ఆలయంలో ఉండే ఆ వారం రోజులను భక్తులు ‘మహా పుణ్యకాలం’గా భావిస్తారు. లౌకిక బంధాలలో చిక్కుకున్న మనిషికి, భగవంతుని లీలలను కళ్లారా చూసి తరించడానికి ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి లేదు. ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో ఆ జగన్నాథుని స్మరించి, సకల పాపాల నుండి విముక్తి పొందుదాం. ఎవరైనా సరే పూరీ యాత్రకు వెళ్తే తప్పకుండా స్వామివారి రథోత్సవంలో పాల్గొని తాడును లాగే ప్రయత్నం చేయండి. ఈ అవకాశం జన్మకోసారి మాత్రమే లభిస్తుంది.




