Putrada Ekadashi 2026: శ్రావణ పుత్రద ఏకాదశి విశిష్టత... సంతానం లేనివారు ఏకాదశిరోజున ఇలా చేస్తే
2026 శ్రావణ పుత్రద ఏకాదశి ఆగస్టు 23న జరుపుకోనున్నారు. ఏకాదశి తిథి, వ్రత విరమణ సమయం, పూజా విధానం, మంత్రాలు, సంతాన ప్రాప్తికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.
Putrada Ekadashi 2026: సనాతన ధర్మంలో శ్రావణ మాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ శ్రావణ శుక్ల పక్షంలో వచ్చే 'పుత్రద ఏకాదశి' కి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. వంశాభివృద్ధిని కోరుకునేవారికి, సంతాన భాగ్యం లేక బాధపడే దంపతులకు ఈ ఏకాదశి వ్రతం ఒక దివ్యమైన వరదాయినిగా నిలుస్తుంది. భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించి వ్రతం ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలగడమే కాకుండా, సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సనాతన సంప్రదాయంలో జనన, మరణ రహిత స్థితికి లేదా ఆత్మ శాంతికి పిండప్రదానం, దహన సంస్కారాలు అత్యంత ముఖ్యం. పితృ దేవతల రుణం తీర్చుకోవడానికి, పరలోకంలో ఆత్మలకు శాంతి కలగడానికి పుత్రుడే శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అందుకే పుత్ర సంతానం కోసం ఆ విష్ణుమూర్తి దివ్య అనుగ్రహాన్ని కోరుతూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
2026 శ్రావణ పుత్రద ఏకాదశి ముహూర్తాలు
ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం శ్రావణ పుత్రద ఏకాదశి 2026 ఆగస్టు 23న (ఆదివారం) వచ్చింది. వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు ఆగస్టు 24న వ్రతాన్ని ఆచరిస్తారు.ఏకాదశి తిథి ఆగస్టు 23, 2026 తెల్లవారుజామున 02:00 గంటలకు ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఆగస్టు 24 వ తేదీ తెల్లవారుజామున 04:18 గంటలకు ముగుస్తుంది. వ్రత విరమణ ఆగస్టు 24, 2026 మధ్యాహ్నం 01:41 గంటల నుండి సాయంత్రం 04:16 గంటల వరకు ఉంటుంది. అంతేకాదు, వైష్ణవ ఏకాదశ వ్రత విరమణ ఆగస్టు 25, 2026 ఉదయం 05:55 గంటల నుండి 06:20 గంటల వరకు ఉంటుంది. సంప్రదాయాలను అనుసరించి ఏకాదశిని నిర్వహించుకుంటారు.
పూజా విధివిధానాలు ... నియమాలు
పుత్రద ఏకాదశి నాడు నియమ నిష్టలతో ఆచరించే పూజ ఎంతో త్వరితగతిన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున తెల్లవారుజామునే లేచి పవిత్ర స్నానం ఆచరించి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించి వ్రత సంకల్పం తీసుకోవాలి. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ప్రతిమల ముందు నెయ్యితో దీపం వెలిగించి చందనం, తులసి దళాలు, సుగంధ పుష్పాలు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని లేదా 'విష్ణు సహస్రనామ పారాయణ' చేయడం అత్యంత శ్రేయస్కరం. హరే రామ, హరే కృష్ణ నామస్మరణతో రోజంతా గడపాలి. రోజంతా తామసిక ఆహారానికి, ఉల్లి, వెల్లుల్లి, బియ్యం (అన్నం), పప్పు ధాన్యాలకు దూరంగా ఉండాలి. కొంతమంది నిరాహారంగా ఉంటారు, మరికొందరు పండ్లు, పాలు తీసుకుంటూ ఫలహార వ్రతాన్ని ఆచరిస్తారు. నూతనంగా వివాహమైన దంపతులు, సంతానం లేనివారు ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీమహావిష్ణువు కటాక్షంతో సత్సంతానాన్ని పొందుతారని నమ్మకం.




