Mahakaleshwar Temple: రాజమహేంద్రవరంలో అద్భుత శివాలయం.. ఇక్కడ రోజూ భస్మాభిషేకమే
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయం ప్రత్యేకతలు తెలుసుకోండి. ఉజ్జయిని తరహాలో నిత్యం చితాభస్మంతో జరిగే శివాభిషేకం, ఆలయ చరిత్ర, నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం.
Mahakaleshwar Temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం గురించి చాలామందికి తెలుసు. అక్కడ తెల్లవారుజామున జరిగే భస్మాభిషేకం ఎంతో ప్రత్యేకం. అయితే ఇలాంటి అరుదైన శైవ సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ దర్శించుకోవచ్చు. గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంలో వెలసిన మహాకాళేశ్వర ఆలయం భక్తులకు ఇటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ఇక్కడ ప్రతిరోజూ చితాభస్మంతో పరమశివుడికి అభిషేకం నిర్వహించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. కేవలం ఒక ఆలయంగా కాకుండా, జీవితం, మరణం, ఆత్మతత్వం గురించి ఆలోచింపజేసే పవిత్ర ప్రదేశంగా ఇది గుర్తింపు పొందుతోంది.
ఉజ్జయిని దర్శనంతో మొదలైన సంకల్పం
రాజమహేంద్రవరానికి చెందిన పట్టపగలు వెంకటరావు జీవితంలో ఉజ్జయిని పర్యటన ఒక కీలక మలుపుగా మారింది. సుమారు 11 సంవత్సరాల క్రితం ఓ వివాహ వేడుక కోసం మధ్యప్రదేశ్ వెళ్లిన ఆయన, అక్కడి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయంలో జరుగుతున్న భస్మాభిషేకాన్ని చూసి ఎంతో ప్రభావితులయ్యారు. శివుడికి చితాభస్మంతో అభిషేకం చేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని తెలుసుకున్న తర్వాత, అదే తరహా క్షేత్రాన్ని గోదావరి తీరంలో నిర్మించాలనే ఆలోచన ఆయనలో బలపడింది. ఉజ్జయిని సంప్రదాయం ప్రకారం చితాభస్మంతో జరిగే పూజకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శరీరం నశ్వరమని, ఆత్మ శాశ్వతమనే శివతత్వాన్ని ఈ ఆచారం గుర్తుచేస్తుంది. ఈ భావననే భక్తులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో వెంకటరావు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
రెండెకరాల్లో అద్భుత ఆలయ నిర్మాణం
గోదావరి నది ఒడ్డున సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించారు. ప్రాచీన ఆలయ నిర్మాణశైలిని ఆధునిక సాంకేతికతతో మేళవించి తీర్చిదిద్దారు. ఇందులో 109 అడుగుల ఎత్తైన ప్రధాన శివాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 75 అడుగుల ఎత్తైన రాజగోపురం ఆలయ వైభవాన్ని మరింత పెంచుతోంది. ప్రధాన ఆలయం చుట్టూ 64 ఉపాలయాలను ఏర్పాటు చేశారు. నాలుగు దిక్కుల్లో నాలుగు రాజగోపురాలు, మహామండపాలు, నందులు, ధ్వజస్తంభాలు, బలిపీఠాలు నిర్మించారు. ప్రధాన గర్భాలయంలోని శివలింగం కోసం మహాబలిపురం నుంచి నల్ల గ్రానైట్‌ను తీసుకొచ్చి, తిరుపతిలో శిల్పులతో ప్రత్యేకంగా రూపొందించారు. దాదాపు ఐదేళ్ల నిర్మాణ కృషి అనంతరం 2022 ఏప్రిల్ 6న స్వామివారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెల్లవారుజామునే భస్మాభిషేకం
ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు భస్మాభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం క్షీరాభిషేకం నిర్వహిస్తారు. స్వామివారిని వెండి ఆభరణాలతో అలంకరించి మధ్యాహ్నం నైవేద్యం సమర్పిస్తారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత కొంతసేపు దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల తర్వాత ప్రత్యేకంగా 12 రకాల హారతులు నిర్వహించడం మరో విశేషం. డమరుక నాదాలు, మేళతాళాల మధ్య ఉపాలయాల్లోని దేవతామూర్తులకు కూడా హారతులు సమర్పిస్తారు. రాత్రి 10 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.
చితాభస్మం ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
ఈ ఆలయంలో జరిగే భస్మాభిషేకానికి ఉపయోగించే బూడిదను రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న రెండు కైలాసభూముల నుంచి సేకరిస్తారు. అక్కడ జరిగే అంత్యక్రియల అనంతరం లభించే చితాభస్మాన్ని ప్రతిరోజూ రాత్రి ఆలయానికి తీసుకొస్తారు. మరుసటి రోజు శాస్త్రోక్తంగా శుద్ధి చేసిన అనంతరం స్వామివారికి అభిషేకం చేస్తారు. మరణించిన వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.
భక్తులకు ఉచిత దర్శనం
ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత ఏమిటంటే భక్తుల నుంచి ప్రవేశ రుసుము వసూలు చేయరు. దర్శనానికి టికెట్లు అవసరం లేదు. అష్టాదశ శక్తిపీఠాలు, పంచముఖ శివుడి ఆలయ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. భవిష్యత్తులో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనే ఆలోచన కూడా నిర్వాహకులకు ఉంది.




