Raksha Bandhan: రాఖీపౌర్ణమి 2026: సోదరుల క్షేమం కోసం అక్కాచెల్లెళ్లు చేయవలసిన పరిహారాలివే
రక్షాబంధన్ రోజున చేతికి రాఖీ కట్టే సమయం, పాటించవలసిన నియమాలు, చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం.
Raksha Bandhan: అక్కాచెల్లెళ్ల అనురాగానికి, సోదరుల దైవిక రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండగ రాఖీ పౌర్ణమి. ఈ పర్వదినాన సోదరుడి ముంజేతికి రక్ష కట్టి, వారి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం సోదరీమణులు ప్రార్థించడం శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. 2026 రక్షాబంధన్ సందర్భంలో సోదరుడి క్షేమం కోసం, జీవితంలో ఎదురయ్యే నజరు దోషాలు తొలగిపోవడానికి జ్యోతిష్య శాస్త్రం సూచిస్తున్న పవిత్ర పరిహారాలు, రాఖీ కట్టే సరైన ముహూర్తం వివరాలను తెలుసుకుందాం.
పౌర్ణమి తిథి ... ముహూర్త వివరాలు
2026 ఆగస్టు 27న ఉదయం 09:08 గంటలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆగస్టు 28న ఉదయం 09:48 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది రక్షాబంధన్ వేడుకలకు ఎటువంటి భద్రకాల ప్రతిబంధకాలు లేవు. సూర్యోదయానికి ముందే భద్ర కాలం పూర్తవుతుంది కాబట్టి, ఆగస్టు 28 ఉదయం వేళ ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా రాఖీలు కట్టుకోవచ్చు.
రాఖీ కట్టేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు
రాఖీ కట్టే సమయంలో సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం చేసి కూర్చోవాలి. తూర్పు దిశ సూర్యభగవానుని తేజస్సును, ప్రాణశక్తిని ఇస్తుందని నమ్ముతారు. సోదరుని కుడిచేతికి మాత్రమే రాఖీ కట్టాలి. ఇది శరీరంలోని పిత్త దోషాన్ని తగ్గించి, దైవిక రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. రాఖీ ముడివేసే సమయంలో యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షే మా చల మా చల అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ మంత్రం పూర్వకాలంలో బలిచక్రవర్తికి రక్షణగా నిలిచిన అపారమైన దైవిక శక్తిని మీ సోదరుడికి అందిస్తుంది.
నెగెటివ్ ఎనర్జీ, దిష్టి పరిహారాలు
రాఖీ కట్టే ముందు చిన్న పటిక ముక్కను సోదరుడి జేబులో లేదా పర్సులో కాసేపు ఉంచి, పూజ ముగిసిన తర్వాత దానిని తోటలోని ఒక మూలలో పడేయాలి. ఇది సోదరునికి తగిలిన నజరు దోషాలను, దుష్ట శక్తులను గ్రహించి దూరం చేస్తుంది. అంతేకాదు, అపార్థాల వల్ల దూరమైన తోడబుట్టినవారు రాఖీ రోజున ఆంజనేయస్వామికి బూందీ లాడూ వంటి ఎర్రటి పిండివంటలు నైవేద్యంగా సమర్పించి, పేదలకు పసుపు రంగు ధాన్యాలు దానం చేస్తే విభేదాలు తొలగి మైత్రి పెరుగుతుంది. ఇక, సోదరుడి దీర్ఘాయుష్షు కోసం బియ్యం, పాలు వంటి తెల్లటి పదార్థాలను అన్నదానంగా ఇవ్వడం శుభఫలితాలను ఇస్తుంది. స్వచ్ఛమైన భక్తితో, శాస్త్రోక్తమైన ఈ చిన్న పరిహారాలు పాటించడం ద్వారా సోదరులకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.




