Raksha Bandhan: రాఖీ పండుగ వేళ చంద్రగ్రహణం, పంచకం.. రాఖీ కట్టడానికి శుభముహూర్తం ఇదే
Raksha Bandhan:ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం 9:09 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:47 గంటలకు ముగుస్తుంది.
Raksha Bandhan
Raksha Bandhan: శ్రావణ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈరోజు ఉదయం 9:47 గంటల వరకే పౌర్ణమి తిథి ఉండటం, రోజంతా పంచకం వ్యాపించి ఉండటంతో పాటు చంద్రగ్రహణం కూడా ఉండటంతో రాఖీ ఎప్పుడు కట్టాలనే విషయంలో చాలామందిలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిపుణులు సూచిస్తున్న శుభముహూర్తాల వివరాలు చూద్దాం.
ఉదయవ్యాప్తి పౌర్ణమిలోనే రక్షాబంధన్ వేడుకలు
ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం 9:09 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:47 గంటలకు ముగుస్తుంది. నిష్ణాతులైన పంచాంగ కర్తల ప్రకారం ఏ పండుగైనా ఉదయ తిథిలోనే జరుపుకోవడం శ్రేయస్కరం. ఆగస్టు 27న పౌర్ణమి వ్రతం పూర్తిచేసుకోగా, ఆగస్టు 28న ఉదయ తిథి పౌర్ణమి ఉన్నందున ఈరోజే రక్షాబంధన్ జరుపుకోవడం అత్యంత శుభప్రదమని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు.
అరుదైన యోగాలు.. భద్ర దోషం నుంచి విముక్తి
ఈసారి రాఖీ పండుగ రోజున సూర్యుడు, గురువు ఉచ్ఛ రాశిలో సంచరిస్తుండటం విశేషం. దీనివల్ల బుధాదిత్య రాజయోగం, ఉభయచరి యోగం, ధన యోగం, విపరీత రాజయోగం వంటి అత్యంత శుభప్రదమైన గ్రహ కూటములు ఏర్పడ్డాయి. గతంలో ఆగస్టు 27న భద్ర నీడ ఉన్నప్పటికీ, ఆగస్టు 28న సూర్యోదయానికి ముందే భద్ర కాలం పూర్తయింది. కాబట్టి ఈరోజు సోదరులకు రాఖీ కట్టడానికి భద్ర ఆటంకం ఏమాత్రం లేదు.
పంచకం వేళ రాఖీ కట్టవచ్చా?
ఆగస్టు 28న రోజంతా పంచక కాలం ఉన్న మాట వాస్తవమే. అయితే శాస్త్రాల ప్రకారం రక్షాబంధన్ పండుగకు భద్ర కాలం మాత్రమే వర్జింతమైనది. పంచక కాలంలో రాఖీ కట్టడం వల్ల ఎలాంటి దోషం ఉండదని, సోదరీసోదరుల అనుబంధానికి పంచకం ఆటంకం కాదని జ్యోతిష్య రత్న పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ వెల్లడించారు. భద్ర లేని పౌర్ణమి ఘడియల్లో రాఖీ కట్టడమే ప్రధానమైనది.
చంద్రగ్రహణం ప్రభావం ఉందా?
ఈరోజు రక్షాబంధన్ రోజునే ఏడాదిలో రెండవ, చివరి చంద్రగ్రహణం సంభవిస్తోంది. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6:53 గంటల నుంచి మధ్యాహ్నం 12:32 గంటల వరకు గ్రహణ సమయం ఉంటుంది. అయితే ఈ గ్రహణం పగటిపూట రావడం వల్ల భారతదేశంలో ఎక్కడా కనిపించదు. మన దేశంలో గ్రహణం దృశ్యం కాకపోవడం వల్ల సూతక కాలం వర్తించదు. కాబట్టి చంద్రగ్రహణం ప్రభావం రక్షాబంధన్ వేడుకలపై ఏమాత్రం ఉండదని పండితులు అభయమిస్తున్నారు.
ఈరోజు రాఖీ కట్టడానికి అద్భుతమైన ముహూర్తాలు
ఆగస్టు 28న సోదరుడి చేతికి రక్షాసూత్రం కట్టడానికి అత్యంత శ్రేష్టమైన సమయం ఉదయం 5:57 గంటల నుంచి ఉదయం 9:48 గంటల వరకు ఉంటుంది. ఒకవేళ ఉదయం వీలుపడకపోతే, మధ్యాహ్నం 12:04 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు ఉన్న అభిజిత్ ముహూర్తంలో రాఖీ కట్టవచ్చు. అయితే ఉదయం 10:46 గంటల నుంచి మధ్యాహ్నం 12:22 గంటల వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో మాత్రం రాఖీ కట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




