Life Lessons: మనమంతా ఇలానే చేస్తున్నాం...రామకృష్ణ పరమహంస చెప్పిన అద్భుతమైన కథ
రామకృష్ణ పరమహంస చెప్పిన చీమలు, చక్కెర పొడి కథలో దాగిన జీవిత సత్యం ఏమిటి? తాత్కాలిక ఆకర్షణలకు లొంగకుండా అసలైన లక్ష్యాన్ని ఎలా సాధించాలో తెలుసుకుందాం.
Life Lessons: మానవ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడానికి, తాత్కాలిక ఆకర్షణలకు లొంగిపోయి అసలైన గమ్యాన్ని విస్మరించడమే ప్రధాన కారణమని శ్రీ రామకృష్ణ పరమహంస ఒక చిన్న ఘటన ద్వారా అద్భుతంగా వివరించారు. కాళీమాత ఆలయంలో లడ్డూలు తయారుచేస్తున్నప్పుడు వచ్చిన చీమల గుంపును దారి మళ్లించేందుకు చక్కెర పొడిని ఉపయోగించిన తీరు, దాని వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక, జీవిత సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆలయంలో లడ్డూలు ... చీమల దండయాత్ర
ఒకరోజు దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయంలో భక్తుల కోసం పెద్ద ఎత్తున లడ్డూలు తయారుచేస్తున్నారు. ఆ సువాసనకు పెద్ద సంఖ్యలో చీమలు చేరి లడ్డూలను ముట్టడించడం ప్రారంభించాయి. చీమలు సాధు జీవులు కావడం వల్ల వాటిని చంపడం పాపమని భావించిన శిష్యులు, ఈ సమస్యకు పరిష్కారం చెప్పాల్సిందిగా రామకృష్ణ పరమహంసను వేడుకున్నారు. పరమహంస కాసేపు ఆలోచించి, చీమలు వస్తున్న దారిలోనే గుప్పెడు చక్కెర పొడిని చల్లమని చెప్పారు. శిష్యులు అలాగే చేయగా, లడ్డూల వైపు వెళ్తున్న చీమలన్నీ మధ్యలోనే ఉన్న చక్కెర పొడిని చూసి దాంతో సంతృప్తిపడి వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. దాంతో లడ్డూలు సురక్షితంగా మిగిలాయి.
కథ వెనుక ఉన్న పరమార్థం
ఈ చిన్న ఘటన ద్వారా మనుషుల ప్రవర్తనను రామకృష్ణ పరమహంస ఎంతో చక్కగా విశ్లేషించారు. చీమలకు కావాల్సింది నిజానికి రుచికరమైన లడ్డూ. కానీ దారిలో దొరికిన అల్పమైన చక్కెర పొడిని చూసి అసలు గమ్యాన్ని మర్చిపోయాయి. నేటి సమాజంలో మనుషులు కూడా అంతే. ఉన్నతమైన లక్ష్యాలు, భగవత్ చింతన లేదా పరిపూర్ణమైన సంతోషం వైపు పయనించడం మొదలుపెడతారు. కానీ మార్గమధ్యంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆకర్షణలు, తాత్కాలిక ప్రయోజనాలు చూసి లోంగిపోయి, అసలు లక్ష్యాన్ని విడిచిపెడతారు.
గొంగళిపురుగు పరిణామ క్రమం
మనిషి జీవితం గొంగళిపురుగులా ఉండాలని శాస్త్రాలు చెబుతాయి. గొంగళిపురుగు దశ నుంచి రెండో దశగా సీతాకోకచిలుకలా మారి ఆకాశంలో హాయిగా ఎగిరినట్లే, మనిషి కూడా పరిమిత ఆలోచనల నుంచి బయటపడి ఉన్నతమైన స్థానానికి ఎదగాలి. కేవలం ప్రణాళికలు వేస్తూ కాలం గడపడం కాకుండా, మధ్యలో వచ్చే ఆటంకాలకు, తాత్కాలిక ఆకర్షణలకు లొంగకుండా ముందుకు సాగాలి. చక్కెర పొడిలాంటి చిన్న చిన్న తాత్కాలిక ఆనందాలను పక్కనపెట్టి, లడ్డూ లాంటి పరిపూర్ణమైన జీవిత గమ్యాన్ని సాధించడమే మానవ జన్మకు సార్థకత అని ఈ కథ మనకు ప్రభోధిస్తోంది.




