Ravana: రావణుడు చివరి క్షణంలో లక్ష్మణుడికి చెప్పిన మాటలు ఇవే

Ramayana:రావణాసురుడు అనగానే మనకు గుర్తొచ్చేది సీతాపహరణం, రామ రావణ యుద్ధం. కానీ, ఆ దశకంఠుడిలో ఒక గొప్ప పండితుడు, రాజనీతిజ్ఞుడు కూడా ఉన్నాడని స్వయంగా శ్రీరామచంద్రుడే కొనియాడారు.

Balachander
Published on: 16 April 2026 7:54 AM IST
Ravana’s Final Advice to Lakshmana  5 Powerful Life Lessons from Ramayana
X

Ravana

Ramayana:రావణాసురుడు అనగానే మనకు గుర్తొచ్చేది సీతాపహరణం, రామ రావణ యుద్ధం. కానీ, ఆ దశకంఠుడిలో ఒక గొప్ప పండితుడు, రాజనీతిజ్ఞుడు కూడా ఉన్నాడని స్వయంగా శ్రీరామచంద్రుడే కొనియాడారు. రావణుడు మరణశయ్యపై ఉన్నప్పుడు లక్ష్మణుడికి బోధించిన ఆ అద్భుతమైన 'రాజనీతి' సారాంశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజనీతి బోధ

రామరావణ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. రావణుడి గుట్టు బయటకు రావడం, పవన తనయుడి స్మరణం మేరకు రాముడి బాణం దిశ మారి రావణుడి ఉదరాన్ని చీల్చుతుంది. ఆ ధాటికి రావణుడు రణరంగంలో నేలకొరిగాడు. ప్రాణాలు వదలడానికి సిద్దంగా ఉన్న సమయంలో...శ్రీరాముడు లక్ష్మణుడిని పిలిచి ఇలా చెబుతాడు. లక్ష్మణ... రావణుడు గొప్ప శివభక్తుడు. చతుర్వేద పండితుడు. అహంకారం వలన అతడు పతనం చెంది ఉండవచ్చు. కానీ, రాజకీయాల్లోనూ, ధర్మశాస్త్రాల్లోనూ ఆయన్ను మించినవారు లేరు. ఆయన అనుభవం వెలకట్టలేనిది. వెళ్లి ఆయన పాదాల చెంత నిలబడి లోకానికి ఉపయోగపడే రాజనీతిని అడిగి తెలుసుకో అంటాడు. శ్రీరాముడి మాటను జవదాటని లక్ష్మణుడు వెళ్లి రావణుడి పాదాల వద్ద నిలబడతాడు. లక్ష్మణుడు ఎందుకు వచ్చి అలా నిలబడ్డాడో తన సూక్ష్మజ్ఞానంతో తెలుసుకున్న రావణుడు రాజనీతికి చెందిన 5 ముఖ్యమైన విషయాలను బోధిస్తాడు.

రావణుడు చెప్పిన 5 ముఖ్యమైన జీవన సూత్రాలు

సన్నిహితులతో వైరము వద్దు

మన రథసారథి, వంటవాడు, సోదరుడు మరియు ద్వారపాలకుడితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకూడదు. ఎందుకంటే మన ప్రాణ రహస్యాలు, మన బలహీనతలు వీరికి బాగా తెలుసు. ఒక్కోసారి వీరు చేసే చిన్న పొరపాటు లేదా ద్రోహం మన ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఎప్పటికీ ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు.

శత్రువును తక్కువ అంచనా వేయకు

నేను చేసిన అతిపెద్ద తప్పు ఇదే. వానర సైన్యాన్ని, హనుమంతుడిని కేవలం అడవి జంతువులే కదా అని తక్కువగా చూశాను. కానీ ఆ చిన్న చూపు నా సామ్రాజ్యాన్ని బుగ్గిపాలు చేసింది. శత్రువు ఎవరైనా సరే, వారి బలాన్ని తక్కువ అంచనా వేయడం రాజుకు తగదు. రాజుకు ఉండవలసిని ప్రధానమైన నీతి ఇదేనని అంటాడు.

శుభకార్యం వాయిదా వేయకు

మంచి పని చేయాలని అనిపిస్తే తక్షణమే ప్రారంభించు. చెడు పనులు చేయడానికి ఎంత వీలైతే అంత ఆలస్యం చేయి. నేను స్వర్గానికి నిచ్చెన వేయాలని అనుకున్నాను, కానీ వాయిదా వేస్తూ వచ్చాను. అదే సీతమ్మను అపహరించాలనే ఆలోచన రాగానే వెనుకాడకుండా చేసేశాను. ఫలితం ఈరోజు ఇలా ఉంది. చెడు పనులను వాయిదా వేసినా పర్వాలేదు. కానీ, మంచి చేయాలంటే వెంటనే చేయి అని చెబుతాడు.

అతి వినయం పనికిరాదు

మన చుట్టూ ఉండి ఎప్పుడూ మనల్ని పొగిడే వారిని నమ్మకూడదు. వారు మనలోని తప్పులను కప్పిపుచ్చుతారు. మనల్ని విమర్శించేవాడే నిజమైన హితుడు. విమర్శను భరించగలిగిన రోజే రాజు సరైన నిర్ణయాలు తీసుకోగలడు.

అదృష్టాన్ని నమ్ముకోకు - శ్రమను నమ్ము

గ్రహగతులు మనకు అనుకూలంగా ఉన్నాయని గర్వపడకూడదు. నేను శని దేవుడినే నా సింహాసనం కింద బంధించాను, కానీ కాలం కర్మం కలిసొచ్చినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. కనుక ఎల్లప్పుడూ ధర్మబద్ధమైన పోరాటంపైనే దృష్టి పెట్టాలి. ఎంత శ్రమిస్తే అంతటి విజయం లభిస్తుంది. శ్రమను నమ్మినవారెప్పటికైనా వృద్దిలోకి వస్తారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే

వాల్మీకి రామాయణంలో యుద్ధకాండతో కథ ముగిసినా, రావణుడి మరణం ప్రపంచానికి ఒక గొప్ప పాఠాన్ని మిగిల్చింది. ఒక వ్యక్తి ఎంతటి మేధావి అయినా, ఎంతటి బలవంతుడైనా 'అహంకారం' అనే ఒకే ఒక్క బలహీనత వల్ల పతనమైపోతాడని రావణుడి జీవితం నిరూపించింది. లక్ష్మణుడు రావణుడి పాదాల దగ్గర నిలబడి జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా.. విద్యను నేర్చుకునేటప్పుడు అణకువ ఉండాలని లోకానికి చాటిచెప్పాడు. భారతీయ ఇతిహాసాల్లో రావణుడు కేవలం ప్రతినాయకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప గురువు కూడా అని ఈ ఘట్టం ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే నేటికీ ఆయన చెప్పిన ఈ రాజనీతి సూత్రాలు మన నాయకులకు, సామాన్య ప్రజలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మనం తెలుసుకోవలసిన నీతి ఏమంటే జ్ఞానం ఎక్కడైనా ఉంటే దాన్ని స్వీకరించడం మన ధర్మం. ఇది ఎవరైతే చేస్తారో వారికి కష్టాలు వచ్చినా వాటంతట అవే తొలగిపోతాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story